Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Kommula Venkata Suryanarayana: ఆధునిక బాల కథా వీధిలో నవ్య సూర్యచంద్రిక

Kommula Venkata Suryanarayana: ఆధునిక బాల కథా వీధిలో నవ్య సూర్యచంద్రిక

విలువైన నీతిని స్ఫూర్తిదాయకంగా పంచే కథలు

నేటి ఆధునిక బాల్యానికి బాలసాహిత్యానికి అవసరమైన అచ్చమైన ఆధునిక బాలల కథలు ఏమిటో తెలుసుకోవాలి అంటే వర్థమాన బాలసాహితీవేత్త “కొమ్ముల వెంకట సూర్యనారాయణ” గారు రాసిన “బాల కథా చంద్రిక” విధిగా చదవాలి. వైజ్ఞానిక శాస్త్ర నేపథ్యం గల అధ్యాపక రచయిత అయిన కె.వి సూర్యనారాయణ వంటి రచయితలు నేటితరం ఆధునిక బాల సాహిత్యానికి మరికొందరు కావలసిన అత్యవసరం ఎంతో ఉంది. తెలుగు బాలసాహిత్యం అంటేనే నీతులు, సందేశాలమయంగా పాత కథలనే పేర్లు పాత్రలు మారుస్తూ సృజన కొరవడి సేకరణలమయంగా సాగిపోతున్న ప్రస్తుత అంధకార కాలంలో నూతన వరవడితో ఆధునిక బాలల ఆలోచనలకు తగిన శైలిలో గల కథలతో మన ముందుకు వచ్చారు సూర్యనారాయణ. ఇక ఆయన వ్రాసిన అనేక కథలలో ముచ్చటగా 30 బాలల కథలను సంపుటిగా “బాల కథా చంద్రిక” పేరుతో ప్రచురించారు.
“కమ్మని నీతి కథలు” అనే ఉపశీర్షిక దీనికి మరింత సార్ధకత చేకూర్చింది. సూర్యనారాయణ గారి కథలు అన్ని నిడివిలో పఠనాసక్తి కలిగి ఉండటమేకాక పాఠకులు ఊహించని మలుపులు, ముగింపులు ఇస్తూ, పాత కథలకు సైతం అత్యంత ఆధునికత జోడించి ఉత్తమ శైలిలో కథలు కొనసాగించారు. ఈ గుణాలే వారి కథలను ఉత్తమ కథల సరసన చేర్చడంతో పాటు ఆయనను మంచి బాలల కథా రచయితగా మార్చాయి.
వీరి కథలు అన్ని ఎప్పటికీ గుర్తుండిపోయే కథలే!! ఈ కథల్లో నీతులు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. స్ఫూర్తిని కలిగిస్తాయి. యుక్తిదాయకంగా ఉండి కథలన్నీ ఆడదాకా చదివింపు చేసుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలి అంటే నూతన బాల కథా రచయితలకు వీరి కథలు పాఠ్యాంశాలు అయితే సీనియర్ రచయితలకు వారి మార్గాలు మార్చుకునే మార్గ సూచికలు వంటివి, అనడంలో అక్షర సత్యం నిండిఉంది.
ఆధునిక విధానాలకు అనుగుణంగా మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ సమాజానికి మనం ఎలా సాయపడాలో చెప్పిన ఉత్తమోత్తమ కథ “సార్థకత”. రంగాచారి, రామాచారి అనే ఇద్దరు యువ పురోహితులు గురువు “సత్యవర్తనుడు” చెప్పిన మార్గం అనుసరించి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా పాలు, పంచదార, కొబ్బరి నీళ్లు, తేనెలను అభిషేకాలతో వ్యర్థం చేయకుండా వాటిని నిరుపేదలకు అందించడంలో రామాచారి విజయం సాధించిన వైనం దానిని అనుసరించిన రంగాచారి తీరు “సార్థకత” కథలో మనం చదవవచ్చు.
తెనాలి రామలింగడు, కుందేలు సింహం, ఆవు పులి, వంటి పాతతరం కథలను సైతం పూర్తి మార్పులతో నేటి ఆధునిక సమాజానికి చక్కగా అన్వయించి చెప్పడంలో శత శాతం విజయం సాధించడమే గాక ఆధునిక బాల సాహిత్యానికి కొత్తదారులు చూపారు రచయిత కె .వి . సూర్యనారాయణ, కుందేలు తెలివి- సింహం బలి, ఆడిన మాట తప్పరాదు, వంటి కథలు నూతన ఆలోచనా ధోరణితో సాగి, పిల్లలకు ఆలోచనాశక్తి పెంచడంతో పాటు ప్రతిభకు మూలమైన ప్రశ్నించే తత్వం పెంచుతాయి.
పులికి ఇచ్చిన మాట తప్పకుండా, తన ఆలూ బిడ్డలకు ఆహారం అందించి, నిజాయితీతో పులి వద్దకు వెళుతున్న జింక మార్గమధ్యంలో మరో అపాయంలో చిక్కుకోవడం చివరికి తనను తినాల్సిన పులి ఆ జింకను కాపాడటం వంటి ఉత్తమ ముగింపు గల “ఆడిన మాట తప్పరాదు” కథతో పాటు, ఆపదలు అనేవి అందరికీ వస్తుంటాయి వాటిని సమయస్ఫూర్తితో ఎదుర్కొని బయటపడాలి తప్ప, మన పరిస్థితులను కారణాలుగా చూపి మన అసమర్థతను చాటుకోరాదు అని విలువైన నీతిని స్ఫూర్తిదాయకంగా పంచిన కథ “సానుకూల ఆలోచన”. నిజాయితీలోని గొప్పదనం ఆవిష్కరిస్తూనే పశ్చాత్తాప గుణం యొక్క విశేషాన్ని అన్యాయం చేస్తూ నేటితరం బాల్యానికి అత్యవసరమైన విషయాలను అందించిన ఎంతో విలువైన ఉత్తమ కథ “చిన్నబోయిన మైనా “.
సాధారణంగా పిల్లలంతా కాల్పనిక కథలే ఇష్టపడతారు అనే మూస ధోరణి గల నేటి బాలసాహిత్యంలో అనుసరించాల్సిన ఉత్తమ మార్పుకు శ్రీకారం చుట్టిన కథ “కనువిప్పు”, సోమయ్య అనే కట్టెలు కొట్టే కార్మికుడికి కలలో ఏదైనా కష్టం వల్ల అతను పశ్చాత్తాపంచెంది, పర్యావరణ సంరక్షకుడిగా మారిన వైనం తెలిపే కథకనువిప్పు. ఇలా ప్రతి కథ ప్రయోజన భరితంగా, స్ఫూర్తివంతంగా, సాగి పాఠకులకు సంతృప్తితో కూడిన అక్షరానందం అందిస్తాయి.
వ్యాసాలను సైతం కథలుగా చెప్పడంలోని నైపుణ్యం ఈ రచయితలో పుష్కలంగా కనిపిస్తుంది అందుకు ఉదాహరణ “అమ్మ చెప్పింది చింటూ ఉన్నాడు”‘ కథ.
ఈ కథలన్నీ రచయిత మనసుపెట్టి శ్రద్ధగా వ్రాశారు అందుకే కథ పేరు మొదలు కథలోని పాత్రలు, ప్రాంతాలు, పేర్లు కూడా చక్కటి సమన్వయంతో పెట్టారు ఇవి కూడా రచయితకు రచనకు అద్భుతమైన ప్రామాణికత చేకూర్చుతాయి. అందుకు ఉదాహరణగా “జలకళ” అనే చెరువు, “మీనా” అనే చేప, “రోజి” అనే కోడి, చెప్పవచ్చు. ప్రతి కథ ఒక ప్రత్యేకతను కలబోసుకుని ముందుకు సాగింది,
ఆధునిక సమాజం పోకడలను ఎప్పటికప్పుడు భద్రపరిచి వాటిని కథలుగా చెప్పడం ఉత్తమ కథకుల లక్షణం, అచ్చంగా ఆకోవకు చెందినవారే రచయిత సూర్యనారాయణ. “కరోనా” లాంటి కష్ట కాలం విద్యార్థుల జీవితాలకు అన్వయం చేస్తూ రాసిన “అంతరాత్మ”కథ చదివితే రచయితకు గల సామాజిక బాధ్యతపై గల తపన అర్థమవుతుంది.
ఏతరం పిల్లలైనా ఆసక్తిగా చదివేవి యుక్తి కథలు ఇందులోని అబ్బురపరిచే ముగింపుల కోసం వారు తపనతో వాటిని చదువుతారు, అందుకే ఈ రచయిత చూపు ఆ వైపు మళ్లి ఎక్కువగా ‘యుక్తి కథలు’ అందించారు. వీటిలో ఆసక్తితో పాటు అంతర్గత సందేశం, నైతిక విలువలు అందించిన తీరు ఆచరణీయం.
సేవకుని ఎంపిక, పనివాని ఎంపిక, అసలు దొంగ, సమయస్ఫూర్తి, మొదలైన కథలు ఈ కోవకు చెంది,పిల్లలకు చక్కని అనుభూతిని అందిస్తాయి. ముక్కుసూటి, అంతరాత్మ, లాంటి కొన్ని కథల్లోని విషయాలు నేటి ఆధునిక పిల్లల బుర్రలకు కాస్త అయోమయం కలిగించి అసహజంగా అనిపించిన, కథ చెప్పిన నైపుణ్యంతో అవి అన్ని కలిసిపోయి చివరికి చిరునవ్వుల సంతృప్తినే పంచుతాయి. నేటితరం మేటి బాల కథా సంపుటిగా ఎంచు”కొని” చదవాల్సిన ఉత్తమ బాల కథా సంపుటి ఇది, అనడంలో అక్షర సత్యం ఉంది.

- Advertisement -

బాల కథా చంద్రిక (కథా సంపుటి), రచన:- కొమ్మల వెంకట సూర్యనారాయణ, పేజీలు:- 100, ధర:- 120/- రూ, ప్రతులకు, సెల్: 99496 02721.
సమీక్షకుడు:- డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్:77298 83223.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News