Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Venkatrama & Co: గ్రంథ రచనకు మార్గదర్శకుడు

Venkatrama & Co: గ్రంథ రచనకు మార్గదర్శకుడు

ఏటా క్యాలెండర్స్ వేయటంలో కొత్త ఒరవడి సృష్టించిన..

గ్రంథ రచనలోనే కాదు, గ్రంథ ప్రచురణలోనూ చేయి తిరిగిన వ్యక్తి ఈదర వెంకటరావు. అనేక రచనలు సాగించడంతో పాటు, పలువురు గ్రంథ రచయితల గ్రంథాలను ప్రచురించి తెలుగునాట సాహితీరంగంలోనే కాక, వాణిజ్యం రంగంలో కూడా చెరగని ముద్ర వేసిన ఈదర వెంకటరావు తెలియని వ్యక్తి లేరు. ఆయన 1927లో స్థాపించిన వెంకట్రామ అండ్‌ కో ఎన్ని వేల పుస్తకాలను ముద్రించి, సాహిత్యానికి ఎంత సేవ చేసిందో లెక్క లేదు. పితృసంబంధమైన భాగ్యమేమీ లేదు. ఏలూరు పవర్‌ పేటలో ఆచంట గోపాలకృష్ణయ్య ఇంట్లో ఉండి, మిషన్‌ హైస్కూలులో చదువుకుంటూ, పేదరికపు కష్టాలన్నీ అనుభవిస్తూ, కేవలం స్వయం కృషితో ప్రాముఖ్యానికి వచ్చిన వ్యక్తి ఈదర వెంకటరావు. ‘ప్రారంభ విద్య’ అనే మాసపత్రికను స్థాపించి, చిన్న చిన్న పాఠ్య పుస్తకాలు రాయించి, వాటిని విద్యాధికారులతో ఆమోదింపజేసి, నానా కష్టాలూ పడతూ, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఉత్సాహాన్ని మాత్రం వదిలిపెట్టకుండా, పాతికేళ్లు అవిశ్రాంత పరిశ్రమ చేసి, తెలుగులో ఒక పెద్ద ప్రచురణకర్తగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
వెంకటరావు పుస్తక ప్రచురణ ప్రారంభించిన రోజుల్లో తెలుగు పాఠ్య పుస్తకాలు గుర్తింపు పొందాలంటే భగీరథ ప్రయత్నం చేయాల్సి వచ్చేది. ప్రముఖులైన వ్యక్తుల పేరుతో పుస్తకాలు రాసి, మ్యాక్మిలన్‌ వంటి ఐరోపా దేశీయులు కంపెనీల్లో ప్రచురిస్తే కానీ, దీనికి ప్రభుత్వ పరమైన గుర్తింపు లభించేది కాదు. విద్యాధికారుల అభిమానం కూడా పెద్ద కంపెనీల మీదే ఉండేది. అయినప్పటికి వెంకటరావు ఏమాత్రం నిరుత్సాహపడకుండా పట్టుదల వదిలి పెట్టకుండా, ఆంధ్ర పాఠ్య పుస్తక ప్రచురణలో తెలుగువారికి ఒక స్థానం సంపాదించారు. ప్రతి గ్రంథాన్ని తాను చదివి, ముద్రా రాక్షసాలను సవరించి గ్రంథ ప్రచురణ చేసేవారు. మొత్తం మీద ఆయన 77 వేల పైచిలుకు గ్రంథాలను ప్రచురించారని చెబుతారు. ఆయనకు ఉన్నంత విషయ పరిజ్ఞానం సమకాలీన రచయితలకు కూడా ఉండేది కాదని అప్పట్లో చెప్పుకునేవారు. ఆయన స్వయంగా అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను, చరిత్ర గ్రంథాలను రాయడం జరిగింది. ఇవన్నీ ఎక్కువగా విద్యార్థులకు సంబంధించిన గ్రంథాలుగా గుర్తింపు పొందాయి.
వెంకటరావు కేవలం ప్రచురణకర్తలుగా, ద్రవ్యార్జనాపరులుగా మాత్రమే ఉండిపోకుండా ప్రజల సంక్షేమానికి సంబంధించిన కార్యాలు కూడా చేపడుతుండేవారు. పేదలకు, అతిథి, అభ్యాగతులకు శక్తివంచన లేకుండా సహాయం చేస్తుంటారు. ఏలూరు పురపాలక సంఘంలో చాలాకాలం సభ్యులుగా ఉండి, పట్టణాభివృద్ధికి పాటపడ్డారు. ఆంజనేయ స్వామి దేవాలయం, గోరక్షణ సమితి, అన్నదాన సమాజం, హిందూ యువజన సంఘం, గాంధీ విద్యాలయం వంటి సంఘాల నిర్వహణలో ప్రాముఖ్యం వహించి, ఎందరో పేదలకు సహాయపడ్డారు. ప్రతి ఏటా కేలండర్లు వేయడంలో ఆయన ఒక కొత్త ఒరవడి సృష్టించారు. ఆయన ప్రజాసేవకు గుర్తుగా పౌరులు ఆయన పేరుతో ఏలూరు పట్టణంలో వెంకటరావు పేట అనే ప్రాంతాన్ని నిర్మించారు. ఆయన అక్కడ తన సతీమణి పేరుతో ఒక పాఠశాలను నిర్మించి, విద్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఆంధ్రదేశవ్యాప్తంగా ఆయన తన వెంకట్రామ అండ్‌ కోను విస్తరించి, అక్కడ విద్యాధిక యువతీ యువకులకు ఉద్యోగాలిచ్చారు. కేవలం స్వశక్తితో పైకి వచ్చిన వెంకటరావు జీవిత కథ ఆదర్శప్రాయమైంది, అనుసరణీయమైంది అనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News