నవీన్ పట్నాయక్ సర్కారు నిర్మించిన అత్యాధునిక బిర్సా ముండా హాకీ స్టేడియం ప్రపంచంలో అతి పెద్ద హాకీ స్టేడియం అంటూ ఒరిస్సా సర్కారు భారీఎత్తున ప్రచారం చేసుకుంటోంది. అయితే దీనికి బీజేపీ సీరియస్ గా కౌంటర్ ఇస్తోంది. రూర్కెలాలోని ఈ స్టేడియంలో ఈనెల 13 నుంచి 29 వరకు మెన్స్ వల్డ్ కప్ హాకీ జరుగనుండగా ఇప్పుడీ వేదిక రాజకీయాలకు కేంద్రంగా మారింది.
ఇది ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద హాకీ స్టేడియం మాత్రమేనంటూ బీజేపీ విరుచుకుపడుతోంది. పాకిస్థాన్ లోని లాహోర్ లో ఉన్న నేషనల్ హాకీ స్టేడియం 45,000 మంది కెపాసిటీతో అతిపెద్ద హాకీ స్టేడియం అని, ఆ తరువాతి స్థానం చండీగఢ్ లోని 30,000 మందికెపాసిటీ ఉన్న స్టేడియంది కాగా.. మూడవ పెద్ద హాకీ స్టేడియం లాస్ ఏంజిలెస్ లో ఉందని బీజేపీ మండిపడుతోంది. కాగా ఇది తాము చేస్తున్న ప్రచారం కాదని.. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషనే బిర్సా ముండా స్టేడియంను ప్రపంచంలో అతిపెద్ద హాకీ స్టేడియంగా సర్టిఫికెట్ సైతం ఇచ్చిందని ఒరిస్సా సర్కారు గట్టి కౌంటర్ వేస్తోంది. 20,000 మంది కూర్చుని మ్యాచులు చూసేలా బిర్సా ముండా స్టేడియంను నిర్మించారు.