ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి, జిల్లా ఎన్నికల అధికారి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 30న జరిగే పోలింగ్ కు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 97.5 శాతం ఓటర్ సమాచార స్లిప్పులు పంపిణీ చేసినట్లు, 27 వేల ఓటర్ సమాచార స్లిప్పులు సంబంధిత ఓటర్లు అందుబాటులో లేక పంపిణీ కాలేదని, అట్టి వానిని రిటర్నింగ్ అధికారులకు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. ఓటర్ సమాచార స్లిప్పు కేవలం సమాచారం కొరకు మాత్రమేనని, ఓటు వివరాలు ఆన్లైన్ లో, సంబంధిత బిఎల్ఓ ద్వారా తెలుసుకోవచ్చని, లేకున్నా ఓటు వేయవచ్చని, గుర్తింపు కార్డులు వెంట తీసుకొని, సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయవచ్చని ఆయన అన్నారు. జిల్లాలో 235315 క్రొత్త ఎపిక్ కార్డులు సంబంధిత ఓటర్లకు అందజేసినట్లు, ఓటరు నమోదు చివరి రెండు రోజుల్లో దరఖాస్తు చేసిన 9900 మందికి ఏపిక్ కార్డులు సోమవారం అందినట్లు, వీటిని త్వరగా బట్వాడా కొరకు ఎన్నికల సంఘం బిఎల్ఓ ల ద్వారా చేయాలని అనుమతి ఇచ్చిందని, మంగళవారంలోగా రాజకీయ పార్టీల వారికి సమాచారం ఇచ్చి, పంపిణీ పూర్తిచేస్తామన్నారు. రాజకీయ పార్టీలు తమ పోలింగ్ ఏజెంట్ల జాబితా ఇవ్వాలన్నారు. పోలింగ్ ముగియు 48 గంటల ముందు, మంగళవారం సాయంత్రం నాటికి ఇతర జిల్లాలకు చెందిన వారు వెళ్లిపోవాలన్నారు. పోస్టల్ ఓటింగ్ చేపట్టి, ఎన్నికల విధుల సిబ్బందికి ఓటుహక్కు వినియోగానికి చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సిసి టివి కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. ఫిర్యాదులు ఉంటే సి విజిల్ యాప్ ద్వారా చేయాలన్నారు.
సమావేశంలో పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, డ్రై డే సందర్భంగా మంగళవారం సాయంత్రం అన్ని వైన్ షాపులు మూసిసిస్తారన్నారు. బయటి వ్యక్తులు జిల్లాలో ఉండడానికి వీలులేదన్నారు. 29 లోగా వాహనాల పాసులు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి జి. కృష్ణ, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సత్యం బాబు, బిజెపి పార్టీ ప్రతినిధి జి. విద్యాసాగర్, టిడిపి పార్టీ ప్రతినిధి కె. కరుణాకర్, కృష్ణ ప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి తిరుమల రావు, సిపిఎం పార్టీ ప్రతినిధి నున్నా నాగేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.