ఉగ్రవాదం మీద పోరాటం పేరుతో ఒకటి రెండు దేశాల మీద దాడులు కూడా చేసిన అమెరికాకు తన గడ్డ మీద నుంచే మరో దేశంలో దారుణ మారణ హోమం సృష్టిస్తానంటున్న ఓ వ్యక్తి ఉగ్రవాదిగా కనిపించకపోవడం దాని రెండు నాలుకల ధోరణికి అద్దం పడుతోంది. కొద్ది రోజుల క్రితం గురు పత్వంత్ సింగ్ పన్నున్ అనే ఖలిస్థానీ ఉగ్రవాది ఇందిరా గాంధీ జయంతి రోజైన నవంబర్ 19న భారతీయ విమానాలు ఎక్కవద్దంటూ తమ సిక్కులను హెచ్చరించడం జరిగింది. ఆ రోజున ఎయిర్ ఇండియా విమానాలను పేల్చి వేయడం జరుగుతుందని చెప్పడం అతని ఉద్దేశం. ఈ పన్నున్ అనే ఉగ్రవాదికి కెనడా పౌరసత్వంతో పాటు, అమెరికా పౌరసత్వం కూడా ఉంది. భారత్ ఇప్పటికే అతని మీద నేర సంబంధమైన కేసులు పెట్టి దర్యాప్తులు సాగిస్తోంది. అతను నిర్వహిస్తున్న సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థను నిషేధించడం కూడా జరిగింది. అయినప్పటికీ అతను కొందరు అంగరక్షకులతో కెనడా, అమెరికాల మధ్య తిరుగుతూ ఉంటాడు. అతనికి తాము ప్రత్యక్షంగానో, పరోక్షం గానో మద్దతునిస్తున్న విషయాన్ని అమెరికా పైకి చెప్పకపోవచ్చు కానీ, భారత్ కు వ్యతిరేకంగా హింసా విధ్వంసకాండలను రగుల్కొలుపుతున్న వ్యక్తిని ఆ దేశం చూసీ చూడనట్టు ఏమాత్రం సమంజసం కాదు.
భారతదేశానికి అమెరికా వ్యూహాత్మకంగా బాగా సన్నిహితంగా ఉంటున్న దేశం. పన్నున్ వంటి ఉగ్రవాదుల ధోరణులు పెనుభూతాలుగా మారక ముందే అమెరికా లాంటి మిత్ర దేశాలు వీరిని అణచివేయాల్సిన అవసరం ఉంది. భారతీయ అధికారులు ఈ విషయాన్ని అమెరికా అధికారు లకు తెలియజేసినప్పుడు అమెరికా ఈ ఖలిస్థానీ ఉగ్రవాదుల పట్ల ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. భారత్ కు సానుభూతి కూడా వ్యక్తం చేయడం జరిగింది కానీ, పన్నున్ ను నియంత్రించే పని మాత్రం ఎక్కడా కనిపించలేదు. పన్నున్ విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరును బట్టి, పన్నున్ అమెరికాకు చెందిన సి.ఐ.ఐకు సంబంధించిన వ్యక్తనే విషయం రూఢి అవుతోంది. ఇది ఇలా ఉండగా, పన్నున్ ను హతమార్చే విషయంలో భారత్ చేస్తున్న రహస్య ప్రయత్నాలను విరమించుకోవాలంటూ ఇటీవల అమెరికా భారత్‌ను హెచ్చరించిందని బ్రిటన్ కు చెందిన ఒక సోషల్ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ మేరకు తమ వద్ద ఒక నివేదిక ఉన్నట్టు కూడా అది తెలియజేసింది. ఈ వార్తను అమెరికా ఉద్దేశ పూర్వ కంగా లీక్ చేసినట్టు అర్థం అవుతోంది.
నిజానికి దాదాపు అదే సమయంలో కెనడాలోని ఒక గురుద్వారా బయట హర్దీప్ సింగ్ నిర్జర్ అనే ఖలిస్థానీ ఉగ్రవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పన్నున్‌ను హత్య చేయడానికి భారత్ వ్యూహం రూపొంచినట్టు తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని కూడా అమెరికా తెలిపినట్టు తెలిసింది. నిజ్జర్‌ను చంపింది కెనడా ప్రభుత్వమేనంటూ ఎదురు దాడి ప్రారంభించిన భారత్ పన్నున్ విషయంలో వచ్చిన ఆరోపణను మాత్రం తోసిపుచ్చడం జరగలేదు. పైగా భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ, వ్యవస్థీకృత నేరస్థులు, అక్రమ తుపాకీ విక్రేతలు, ఉగ్రవాదులకు సంబంధించి భారత్ అమెరికాకు కొన్ని వివరాలు అందజేసిందని తెలియజేసింది. ఈ వివరాలకు సంబంధించిన జాబితాలో పన్నున్ పేరు కూడా ఉంది. ఈ వివరాల ఆధారంగా ఉగ్రవాదులు తదితరుల మీద చర్యలు తీసుకోవాలని ఉభయ దేశాలు సంకల్పించడం జరిగింది. తమ దేశంలోని కొందరు సిక్కు నాయకులను భారతదేశ ఏజెంట్లే హతమార్చారని కెనడా ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ ఇతరుల విషయంలో అమెరికా నుంచి స్పందన ఉండడం లేదు కానీ, పన్నున్ పై న్యూయార్క్ కోర్టులో విచారణలో ఉన్న కేసులను ఆ తర్వాత కొట్టేయడం జరిగింది. కొందరు ఉగ్రవాదుల కేసులను అమెరికా కోర్టులు కొట్టి వేయడాన్ని బట్టి, అమెరికా తీరుతెన్ను లను అర్థం చేసుకోవచ్చు. నిజ్జర్ వంటి ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను కూడా కోర్టులు పరిశీలిస్తున్నందువల్ల, చివరికి ఈ కేసులు నిలబడతాయా, లేదా అన్నది చూడాలి.
Khalistan: అమెరికా చెప్పేదొకటి చివరికి చేసేదొకటి!
విమానాలు ఎక్కవద్దంటూ తమ సిక్కులకు హెచ్చరిక..