Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Modi cabinet: ఉత్తరాయణంలో మోడీ క్యాబినెట్ విస్తరణ

Modi cabinet: ఉత్తరాయణంలో మోడీ క్యాబినెట్ విస్తరణ

10 రాష్ట్రాల్లో ఎన్నికలు.. వచ్చే ఏడాది చావో రేవో తేల్చుకోవాల్సిన సంవత్సరం. మొత్తానికి 2023 ఎలక్షన్ ఇయర్. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త సమీకరణాలు, సరికొత్త లెక్కలు పక్కాగా చూసుకునే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల్లో సత్తా చాటగలిగితే 2024లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరు మీద నడకలానే ఉంటుందని మోడీ-షా లెక్కలేస్తున్నారు. ఈనేపథ్యంలో నేడో రేపో ఉన్నట్టుండి కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరగటం ఖాయంగా మారింది.
మరి ఈ కొత్త క్యాబినెట్ లో ఎవరిని తీసుకుంటారు ఎవరెవరిని సాగనంపుతారంటే సింపుల్.. పర్ఫార్మెన్స్ ఆధారంగా కొందరు మంత్రులను తొలగించి, వారి స్థానంలోనే ఎన్నికలు జరుగనున్న కీలక రాష్ట్రాలకు చెందిన ఒకటి అర ఎంపీలకు ఛాన్స్ ఇస్తారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సాగుతున్న రొటీన్ తంతుగా క్యాబినెట్ విస్తరణ అనే అంశం సాగుతూ వస్తోంది. మత, కుల, ప్రాంతీయ .., వంటి సామాజిక సమీకరణాలను సంతృప్తి పరచటమే ఈ క్యాబినెట్ విస్తరణ ప్రధాన ఉద్దేశంగా సాగుతూ వస్తోంది.
బడ్జెట్ సమావేశాల్లోగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంత్రి మండలి నుంచి తొలగించిన కొందరు మంత్రులను పార్టీ కార్యక్రమాల కోసం ఫుల్ టైం ఉపయోగించుకోనున్నారు. జనవరి 14 మకర సంక్రాంతి తరువాత కొత్త మంత్రిమండలి పదవీ ప్రమాణ స్వీకారం చేసే సూచలను ఉన్నాయి. ఇప్పటికే ఈ జాబితా సిద్ధంగా ఉంది. ఉత్తరాయణంలో క్యాబినెట్ విస్తరణ జరిగాక ఇక పూర్తిస్థాయి ఎన్నికల్లోకి దిగనుంది కేంద్ర ప్రభుత్వం. సరికొత్త ఆకర్షణీయ పథకాలు, నిధులపై భారీగా ప్రకటనలు జరగనున్నాయి. 2021 జూన్ 8వ తేదీన చివరిసారిగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. అచ్చం గతంలోలానే ఈసారి కూడా 12 మందిని మార్చి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు. ఈసారి కేంద్ర మంత్రుల సంఖ్యను కూడా కాస్త పెంచి..అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యత ఇచ్చేలా కసరత్తు జరిగినట్టు సమాచారం.
మహిళలు, వెనుకబడ్డ తరగతులవారికి ఈసారి మరిన్ని అవకాశాలు దక్కి, కేంద్ర మంత్రులుగా వీరు ప్రమోషన్ దక్కేలా కమలనాథులు స్కెచ్ వేశారు. వీరిలో అత్యధికులు మొట్టమొదటిసారి మంత్రి పదవి దక్కించుకోనున్నారుకూడా. నాన్-పర్ఫార్మర్స్ పేరుతో కొందరు కేంద్ర మంత్రులను సాగనంపుతున్నారు.
జనవరిలో పార్టీ నేషనల్ ఎగ్జిక్యుటివ్ మీటింగ్ కూడా జరగనుంది. కొత్త క్యాబినెట్ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ కు సముచిత ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి. జమ్ము-కశ్మీర్ లో కూడా అతి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలుండటంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇంకాస్త ఎక్కువగా ఇవ్వనున్నారు.
త్రిపుర, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల్లో ప్రభావితం చేసే వ్యక్తులకు, సామాజిక వర్గాలకు మంచి వెయిటేజ్ ఇచ్చేలా ఈ కేబినెట్ విస్తరణ ఉండనుంది.
ఇందులో భాగంగా తెలంగాణకు కూడా కేబినెట్ లో చోటు కల్పించేలా బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్ లో జరిగే ఎన్నికలను కూడా సవాలుగా తీసుకున్న పార్టీ ఈ నాలుగు రాష్ట్రాలకు సైతం కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించనుంది.
ఐదుగురు బీజేపీ ఎంపీల పనితీరు భేషుగ్గా ఉందని, వారు పార్లమెంట్ లోపల, బయట తమ సొంత నియోజకవర్గాల్లోనూ ప్రభావితం చేయగలిగే లీడర్లుగా గుర్తించిన మోడీ-షా ఆ ఐదుగురికి క్యాబినెట్ లో చోటు కల్పిస్తున్నట్టు ఢిల్లీలో భారీగా చర్చలు సాగుతున్నాయి. తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఇందులో ఉండటం విశేషం.
గుజరాత్ లో బంపర్ మెజార్టీ సాధించిన బీజేపీ ఈమేరకు ఆ రాష్ట్ర ప్రజలకు రిటర్న్ గిఫ్టుగా కేంద్ర మంత్రులుగా కొందరు గుజరాత్ఎంపీలకు ఛాన్స్ లభించటం ఖాయంగా మారింది. లోక్సభ ఎంపీలకు ఈసారి కేంద్ర మంత్రులయ్యేఅవకాశాలు అధికంగా ఉన్నాయి. అంతేకాదు వీరికే కీలక బాధ్యతలున్న శాఖలను కూడా అప్పగించేలా కొత్త వ్యూహంలో మోడీ ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల్లో మరోదఫా క్లీన్ స్వీప్ చేసేలా పార్టీకి కొత్త జవసత్వాలు తెచ్చే బాధ్యతను ఆయా రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులకు అప్పగిస్తున్నారు.
ఈ 10 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు దాదాపు 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్ పరీక్ష లాంటివే కనుక ఈ దిశగా మోడీ కేంద్ర ప్రభుత్వంలో కొత్త ముఖాలను తీసుకువచ్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీలో కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటున్న మోడీ-షా ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ఎట్టిపరిస్థితుల్లోనూ రిపీట్ కాకూడదనే కసిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టి, తమ సంఖ్యా బలాన్ని మరింత పుంజుకునేలా చేయాలనే యోచనలో ఉన్నారు.
నిజానికి వయసులో పెద్దవారు, సీనియర్ లీడర్లు అత్యధికంగా ఉన్నందున పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలన్నా, సీనయర్లను పక్కనపెట్టాలన్నా అతిపెద్ద ప్రహసనంగా మారింది బీజేపీకి. పార్టీలో, ప్రభుత్వంలో కనీసం 30-40 శాతం కొత్త ముఖాలు లేకపోతే ప్రజాకర్షణ కోల్పోతుందని మోడీ భావన. అందుకే ఇదే ఫార్ములాను కేంద్ర క్యాబినెట్ కు వర్తింపచేసే అవకాశాలున్నాయి.
ట్రైబల్, ఎస్సీ ఓటర్లలో పుంజుకునేందుకు బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మళ్లీ అధికారం చేపట్టాలన్నా, సునాయాసంగా మళ్లీ ఢిల్లీలో అధికారం చేపట్టాలన్నా ఈ రెండు వర్గాలపై సరైన ఫోకస్ చేయటం అత్యంత ముఖ్యమైన విషయంగా మోడీ, షా భావిస్తున్నారు.
గుజరాత్ మోడల్ ను అవలంభిస్తూ కేంద్ర క్యాబినెట్ లోనూ, పార్టీలోనూ వెటరన్స్ ను పక్కనపెట్టి, కొత్త వారికే ఛాన్స్ కట్టబెట్టే పనిలో బీజేపీ ఉంది. ‘పోల్ మెషీన్’ గా పేరు తెచ్చుకున్న బీజేపీకి ఈ ఏడాది అతి పెద్ద సవాలుగా నిలువనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News