గురువారం నాడు ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తర్వాత పోల్ మేనేజ్మెంట్ కార్యక్రమం ఊపందుకుంది. పోల్ మేనేజ్మెంట్ అంటే రాజకీయ నాయకుల పరిభాషలో ఓటర్లకు నగదు పంపిణీ కార్యక్రమం అని అర్థం. ఎన్నికల వ్యయం మీద ఎన్నికల కమిషన్ అనేక విధాలైన ఆంక్షలు విధించింది కానీ, ఈ నగదు పంపిణీ వ్యవహారం ఎన్నికల కమిషన్ చెప్పే ఎన్నికల వ్యయం కిందకు రాదు. ఎన్నికల వ్యయం అంటే ఎన్నికల కమిషన్ దృష్టిలో ప్రచారానికి, పోస్టర్లకు, వాహనాలకు, సమావేశాల నిర్వహణకు అని అర్థం. ఎన్నికల సందర్భంగా నగదు పంపిణీని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ దగ్గర నగదు స్వాధీన వ్యవస్థ ఒకటుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల సహాయ సహకారాలతో ఎన్నికల కమిషన్ నగదు వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఓటర్లకు నగదు పంపిణీ చేయడం జరిగితే పరవాలేదు కానీ, రాజకీయ పార్టీలు చేపట్టే లావాదేవీలను దీని ద్వారా అంచనా వేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఈ నగదు పంపిణీ వ్యవహా రం అంచనాలకు మించి, అంతుబట్టకుండా ఉంటుంది.
ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్ ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నా నగదు పంపిణీ వ్యవహారానికి అడ్డుకట్ట వేయడమన్నది అసాధ్యాల్లోకెల్లా అసాధ్యమైన విషయంగా కనిపిస్తోంది. ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, తెలంగాణ, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ మొత్తం మీద రూ. 1,760 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఈ సొమ్మంతా ఓటర్లకు పంపిణీకి ఉద్దేశించినదని అధికారులు గుర్తించారు. అయితే, ఇదంతా పట్టుబడిన సొమ్ము. పట్టుబడని సొమ్ము ఎంత ఉంటుందన్నది అంచనా వేయడం కూడా కష్టమే. ఇవే రాష్ట్రాలలో 2018 నాటి సొమ్ముతో పోలిస్తే ఇది ఏడు రెట్లు ఎక్కువ. కాగా, ఈసారి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రూ. 659 కోట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదంతా మొత్తం సొమ్ములో ఒక్క శాతం కూడా కాకపోవచ్చని అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. ఒక్కొక్క నియోజక వర్గంలో ఒక్కో అభ్యర్థి రూ. 40 లక్షలకు మించి ఖర్చు చేయకూడదని ఎన్నికల కమిషన్ పరిమితి విధించడం వల్లే నగదు పంపిణీ వ్యవహారం ఇష్టారాజ్యంగా కొనసాగుతోందని ఓ రాజకీయ నాయకుడు ఇటీవల వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయం.
ఆయన వ్యాఖ్యల్లో అర్థముంది. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి అభ్యర్థీ నలభై లక్షల రూపాయలకు మించే ఖర్చుచేస్తుంటాడని, అధికారులు కూడా చాలావరకు చూసీ చూడనట్టు ఉండిపోతారని అందరికీ తెలిసిన విషయమే. అంతా నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటున్నట్టే నటించడం జరుగుతూ ఉంటుంది. 2018లో తెలంగాణలో వివిధ పార్టీలన్నీ కలిపి రూ. 5,000 కోట్ల పైచిలుకు ఖర్చు పెట్టడం జరిగింది. కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడి ఉన్నందు వల్ల ఈ సారి ఈ ఖర్చు అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఓటర్లకు నగదు పంపిణీ అనేది సర్వసాధారణ విషయమైపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నగదు పంపిణీ ఒక వెల్లువలా సాగిపోతుంది. ఓటర్లు కూడా అభ్యర్థులు తమకు పెద్ద మొత్తాలలో డబ్బు పంపిణీ చేయాలనే ఆశిస్తారు. కొన్ని ప్రాంతాల్లో బి.ఆర్.ఎస్ ఒక్కో ఓటరుకు రూ. 10,000లకు పైగా పంపిణీ చేస్తోందంటూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ తన ధనబలంతో ఎన్నికల్లో గెలవాలనుకుంటోందని బి. ఆర్.ఎస్ ప్రత్యారోపణ చేసింది.
నగదు పంపిణీ జరుగుతున్నట్టుగా ఆధారాలేమీ దొరికే అవకాశం లేదు కానీ, పార్టీలు తమ విమర్శలు, ఆరోపణల్లో ఈ సంఖ్యలను క్రమంగా పెంచేయడం మాత్రం జరుగుతోంది. ఈ అక్రమానికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదు. ఇది గుడ్డు ముందా, కోడి ముందా అన్న ప్రశ్న లాంటిది. అభ్యర్థులు ఇందుకు ఓటర్లనే తప్పుబడుతుండగా, ఓటర్లు ఈ పాపాన్ని అభ్యర్థుల మీదకు నెట్టివేయడం జరుగుతోంది. ఓటర్లు అడిగి తీసుకోవడమూ ఎక్కువైంది. అభ్యర్థులు ఓటర్లకు పంచడమూ ఎక్కువైంది. ఇందులో సందేహమేమీ లేదు. నియమ నిబంధనలకు తగ్గట్టుగా వ్యవహరిస్తామని పార్టీలన్నీ అంగీకరిస్తే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది కానీ, ఇది జరిగే పని కాదని తేలికగా చెప్పవచ్చు.
Cash flow in Telangana: తెలంగాణలో నగదు ప్రవాహం
అడ్డుకోవటం అసాధ్యం