Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Abortions in Mysore Jaggery factory: అంతూ పొంతూ లేని భ్రూణ హత్యలు

Abortions in Mysore Jaggery factory: అంతూ పొంతూ లేని భ్రూణ హత్యలు

వెలుగులోకి షాకింగ్ న్యూస్

దేశంలో పిండ దశలోనే ఆడ శిశువులను హతమార్చడం అనేది అంతూ పొంతూ లేకుండా సాగిపోతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఆడపిల్ల పుట్టబోతున్న విషయాన్ని గర్భస్థ దశలోనే ఏదోవిధంగా తెలుసుకోవడం, ఆ పిల్లను చట్టవిరుద్ధంగా గర్భస్రావం ద్వారా తొలగించుకోవడం రానురానూ పెరిగిపోతున్న విషయాన్ని ఈమధ్య ప్రభుత్వ నివేదికలు సైతం బయటపెట్టాయి. నిజానికి ఇదొక పెద్ద కుంభకోణం కింద జరుగుతోందని కర్ణాటకలో కొన్ని సంఘటనల ద్వారా వెల్లడైంది. తన లాబ్‌ టెక్నీషియన్‌ మైసూరులోని ఒక ఆస్పత్రిలో గత మూడేళ్ల కాలంలో 900 పైచిలుకు గర్భస్రావాలు చేయించాడని, ఒక్కొక్క గర్భస్రావానికి రూ. 30,000 చొప్పున వసూలు చేశాడని, మాండ్యాలోని ఒక బెల్లం తయారీ దుకాణంలో స్కానింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేసుకుని, ఆడపిల్ల పుడుతుందా, మగ పిల్లవాడు పుడతాడా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకుని, ఆడపిల్ల గనుక గర్భంలో ఉంటే వెంటనే గర్భస్రావానికి ఏర్పాట్లు చేస్తున్నాడని ఇటీవల బెంగళూరులో ఒక ప్రసిద్ధ డాక్టర్‌ వెల్లడించినప్పుడు యావత్‌ సభ్య సమాజం దిగ్భ్రాంతికి లోనయింది. 1994 నాటి గర్భస్రావాల నిరోధక చట్టం కింద ఆ లాబ్‌ టెక్నీషియన్‌ ను, అతని సహచరులను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.
నిజానికి చట్టవిరుద్ధంగా గర్భస్రావాలకు పాల్పడిన వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఈ చట్టం కింద అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడానికి, యాభై వేల రూపాయల వరకు జరిమానా విధించడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులు యథేచ్ఛగా, అడ్డూ ఆపూ లేకుండా ఈ నేరాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విష యంలో కుల, మత, వర్గ తారతమ్యమేమీ లేదు. పురుషాధిక్య సమాజానికి వీరు తమ వంతుగా ఈ విధంగా వంత పాడడం నిర్విఘ్నంగా, నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఇటువంటి వ్యవహారాలు కర్ణాటకకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇవి దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టు నేషనల్‌ క్రైమ్‌ రికార్డుల బ్యూరో కూడా ఈ మధ్య ఈ నేరానికి సంబంధించి అనేక దిగ్భ్రాంతికర విషయాలను బయటపెట్టింది.
ఇటువంటి భ్రూణ హత్యలకు ప్రధాన కారణాలు వరకట్న దురాచారం ప్రబలంగా ఉండడం, ఆడపిల్లలకు సరైన భద్రత లేకపోవడం, వారిని పెంచి పోషించడం అన్నది రిస్కుతో కూడిన వ్యవహారంగా పరిగణించడం, మగ పిల్లవాడైతే తమను వృద్ధాప్యంలో ఆదుకుంటాడని ఆశించడం. విచిత్రమేమిటంటే, విద్యాధికులు, సామాజిక హోదా కలిగినవారు సైతం మగ పిల్లవాడు పుట్టడాన్ని ఒక సామాజిక హోదాగానే ఇంకా భావించడం కూడా ఇందుకు కాస్తో కూస్తో దోహదం చేస్తోంది. దేశంలో లైంగిక నిష్పత్తి అనేది అత్యంత అధ్వాన స్థితిలో ఉంది. 2022-23 సంవత్సరానికి సగటున ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు 933 మంది ఆడపిల్లలు మాత్రమే ఉండడం జరుగుతోంది. 2015-17 సంవత్సరాలలో వెయ్యికి 896 ఉన్న ఆడపిల్లల సంఖ్య 2022లో బాగానే పెరిగిందని ప్రభుత్వాలు సంబరపడ్డాయి. దేశం మొత్తం మీద 2023 సంవత్సరానికి ఈ వెయ్యి మంది మగ పిల్లలకు ఆడ పిల్లల సంఖ్య 943కు చేరింది. అయితే ఈ విషయంలో ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కేరళలో ఆడ పిల్లల సంఖ్య 1,084 కాగా, తమిళనాడులో 995, ఆంధ్రప్రదేశ్‌ లో 992, గుజరాత్‌ లో 918, ఉత్తర ప్రదేశ్‌ లో 908, హర్యానాలో 877గా నమోదైంది.
మొత్తం మీద పురుషాధిక్యత కొనసాగుతోందని, ఆడ పిల్లల పట్ల చిన్నచూపులో పెద్దగా మార్పేమీ లేదని, సమాజంలో ఈ విషయంలో అతి దారుణంగా సంకుచిత మనస్తత్వం నెలకొని ఉందని ఈ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇక 968కి దగ్గరగా ఉన్న కర్ణాట కలో అత్యంత ఎక్కువ స్థాయిలో భ్రూణ హత్యలు, గర్భస్రావాలు జరుగుతున్నాయన్నది ఇటీ వలి కుంభకోణాలతో దేశ ప్రజల దృష్టిలో పడింది. ముఖ్యంగా కర్ణాటకలోని మాండ్యాలోనూ, ఉత్తర కర్ణాటకలోని వెనుకబడిన జిల్లాల్లోనూ కని విని ఎరుగని రీతిలో గర్భస్రావాలు జరుగుతున్నట్టు నిదర్శనాలతో సహా వెలుగులోకి వచ్చింది. బాలికల పట్ల వివక్ష ప్రదర్శించడం అన్నది దేశంలోని అనేక ప్రాంతాలలో భ్రూణ హత్యలు, గర్భస్రావాల రూపంలోనే ప్రారంభం అవుతోంది. ఆ తర్వాత ఈ వివక్ష విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగావకాశాలు, వేతనాలు, ఆస్తి హక్కులు, పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలు తదితర అంశాలలో మరింతగా బయటపడుతూ ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి చివరి క్షణం వరకూ ఆడ పిల్లను ఒక గుదిబండ గానే పరిగణించడం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇక ఆహారంతో సహా అన్ని విషయాల్లోనూ ఆడపిల్ల తక్కువ స్థాయిలోనే ఉంటుంది. ప్రస్తుతం ఆడవారు కంపెనీలను నిర్వహిస్తున్నా, కంపెనీలకు అధిపతులుగా ఎదుగుతున్నా వారి పట్ల సమాజ దృష్టిలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలు వెనుకబడి ఉండే పక్షంలో దేశం యావత్తూ వెనుకబడే ఉంటుందనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News