శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మహబూగర్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి. రవి నాయక్ ఉదయం 7 గంటలకే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా చౌరస్తా వద్ద ఉన్న 222 పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలోని మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటర్లు ఓటు వేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామని, ఉదయం 7 గంటలకే జిల్లాలోని 835 పోలింగ్ కేంద్రాలు మరో మూడు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభమైందని, పోలింగ్ కేంద్రాలలో మహిళలు, పురుషులకు ప్రత్యేక క్యూ లైన్లు, ప్రత్యేక టాయిలెట్లు, 80 ఏళ్లు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.
ఓటర్లందరూ నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశామని, ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం సరళిని గమనించేందుకు ఐడి ఓసి లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు . ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు అందితే తక్షణమే స్పందించే విధంగా 1950 తో పాటు, జిల్లా ఫిర్యాదుల కంట్రోల్ విభాగం, మీడియా, సోషల్ మీడియా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఓటర్లందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.