నేషనల్ హెరాల్డ్ కేసు తాజాగా మరోసారి దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని నేషనల్ హెరాల్డ్ కేసు వెంటాడుతోంది. నేషనల్ హెరాల్డ్ ఇష్యూలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్నది ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ప్రధాన ఆరోపణ. అయితే, లోక్‌సభ ఎన్నికలు తరు ముకు వస్తున్న పరిస్థితుల్లో నేషనల్ హెరాల్డ్ కేసు తెరమీదకు రావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. సోనియగాంధీ కుటుంబ ఆస్తుల జప్తు వెనుక రాజకీయ కోణం ఉందంటున్నారు విశ్లేషకులు. కాలగర్భంలో కలిసిపోయిన ఒక కేసును కేవలం రాజకీయ కక్షతోనే తవ్వితీస్తున్నారని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆరోపిస్తోంది.
కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీల కుబుంబానికి చెందిన రూ.752 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఈ కేసులో గతంలో సోనియా, రాహుల్ కు సమన్లు జారీ చేసి విచారణకు రావాలని ఈడీ కోరింది. దీంతో నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఇప్పటిది కాదు. నేషనల్ హెరాల్డ్ పత్రికది లాంగ్ ఇన్నింగ్స్. స్వాతంత్య్ర సమరం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజుల్లో పుట్టిన పత్రిక అది. 1938లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ ప్రారంభించారు. అసోసియేటెడ్ జర్నల్స్ ప్రైవేటు లిమిటెడ్ (ఏజేఎల్) పేరుతో నేషనల్ హెరాల్డ్ పత్రికను అప్పట్లో పండిట్ నెహ్రూ రిజస్టర్ చేయించారు. అనేక మంది కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు అప్పట్లో నేషనల్ నేషనల్ హెరాల్డ్ అండగా నిలిచారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో పండిట్ నెహ్రూ, ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ, ఘన్ శ్యామ్ దాస్ బిర్లాతో పాటు ఐదు వేల మంది అప్పట్లో వాటాదారులుగా ఉన్నారు. అయితే ఒకదశలో నేషనల్ హెరాల్డ్ పత్రిక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. పత్రికను నష్టాల బాట నుంచి బయటపడేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. తొంభై కోట్ల రూపాయలకు పైగా రుణాలు ఇచ్చింది. అయినప్పటికీ పత్రిక ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోయింది. ఈ పరిస్థితుల్లో 2008లో నేషనల్ హెరాల్డ్ మూసివేశారు. నేషనల్ హెరాల్డ్ మూతపడేనాటికి కాంగ్రెస్ పార్టీకి సదరు పత్రిక తొంభై కోట్ల రూపాయలకుపైగా బకాయిపడింది. అంతేకాదు ఇది వడ్డీలేని రుణం కావడం మరో విశేషం. మరోవైపు 2009లో యూపీఏ సర్కార్ అధికారంలోకి రావడంతో నేషనల్ హెరాల్డ్ ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో 2010 నవంబరులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారు. అందులో తల్లీ కొడుకులకు 76 శాతం వాటా ఉంది. మిగిలిన వాటాలు ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ ఓరా పేర్ల మీద ఉన్నాయి. అయితే 2010 డిసెంబర్‌లో సోనియా, రాహుల్ కలిసి అసోసియేటె్‌డ జర్నల్స్ ప్రైవేట్ లిమిటె్‌డ ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థ తీసుకున్న అప్పును తాము తీరుస్తామనీ, అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీలో వాటాలు ఇవ్వాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. అసోసియేటె్‌డ జర్నల్స్ బోర్డు అందుకు అంగీకరించి తొంభై కోట్ల రూపాయలకు సరిపడ షేర్లను సోనియా, రాహుల్‌కు అప్పగించింది. తల్లీ కొడుకులు కాంగ్రెస్ పార్టీకి యాభై లక్షలు చెల్లించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మిగిలిన రుణాన్ని కూడా మాఫీ చేసింది. అంటే కేవలం యాభై లక్షల రూపాయలు చెల్లిం చడంతో నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నీ సోనియా, రాహుల్ వశమయ్యాయన్నమాట.
యంగ్ ఇండియన్ లిమిటెడ్ సూట్‌కేస్ కంపెనీనా ?
నేషనల్ హెరాల్డ్ కథ అక్కడితో ముగియలేదు. అనేక ఆరోపణలు పెల్లుబికాయి. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే సంస్థను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు సోనియా కుటుంబ సభ్యుల మీద వచ్చాయి. సీనియర్ రాజకీయవేత్త సుబ్రహ్యణ్య స్వామి అయితే, సోనియా, రాహుల్‌పై 2012లో ఏకంగా కంప్లయింట్ కూడా చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను చేజిక్కించుకోవడానికి తల్లీ కొడుకులు యంగ్ ఇండియన్ లిమిటెడ్ పేరుతో ఒక సూట్‌కేస్ కంపెనీ పెట్టారన్నది స్వామి చేసిన ఫిర్యాదు. కాగా అసోసియే టెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో వేలాది కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. ఒక సూట్‌కేస్ కంపెనీని అడ్డం పెట్టుకుని, సోనియా గాంధీ కుటుంబం భారీ ఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నారన్నది సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన ఆరోపణ. ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఉంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు ప్రైవేటు కంపెనీకి రుణాలు ఇవ్వడం చట్ట విరుద్దం. చట్టం ఇంత స్పష్టంగా ఉంటే నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఎలా రుణాలు ఇచ్చిందని సుబ్రహ్మణ్య స్వామి ఓ లా పాయింట్ లేవనెత్తారు. అలాగే తీసుకున్న రుణం …మొత్తంగా చెల్లించనప్పుడు…ఏ నిబంధనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మాఫీ చేసిందన్నది స్వామి సంధించిన మరో ప్రశ్న. సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు కేసు ఫైల్ చేశారు. 2016 నుంచి అసోసియేటెడ్ జర్నల్స్ బాధ్యులను, కాంగ్రెస్ నాయకులను ఈ కేసు వెంటాడుతోంది. చివరకు సోనియా, రాహుల్ గాంధీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ విచారించేంతవరకు వెళ్లింది.
మీడియా సంస్థకు కాంగ్రెస్ పార్టీ రుణాలు !
నేషనల్ హెరాల్డ్ మౌలికంగా ఒక మీడియా సంస్థ. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రాజకీయ సంస్థ. అలాంటిది ఒక మీడియా సంస్థకు ….కాంగ్రెస్ పార్టీ ఏకంగా తొంభై కోట్ల రూపాయలు అప్పుగా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందులోనూ, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అంత పెద్ద అమౌంట్ ఎలా ఇచ్చారనే దానికి ఇప్పటికీ సరైన సమాధానం లేదు. సెక్యూరిటీ సంగతి ఇలా ఉంటే అసలు ఇచ్చిన తొంభై కోట్ల రూపాయలను ఎలా వసూలు చేస్తారన్నదానికి కూడా కాంగ్రెస్ నాయకత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదు.
అయితే ఈడీ విచారణతో ఉక్కిరిబిక్కిరి అయిన కాంగ్రెస్ పార్టీ, కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చింది. నేషనల్ హెరా ల్డ్ పత్రికను ప్రచురించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అప్పట్లో తమ పార్టీ అనుబంధ సంస్థ అని కుండబద్దలు కొట్టింది. దీంతో నేషనల్ హెరాల్డ్ తిరిగి తీసుకురావాలన్న ఉద్దేశంతో అనుబంధ సంస్థ అయిన అసోసియేట్ జర్నల్స్ సంస్థకు రుణాలు ఇచ్చినట్లు పేర్కొంది. ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని తెగేసి చెప్పింది. నేషనల్ హెరాల్డ్ ఎపిసోడ్‌లో తాము చట్టప్రకారమే వ్యవహరించామని కాంగ్రెస్ పార్టీ వాదించింది.
కక్ష సాధింపులో భాగంగా ఈడీ విచారణ ?
ఇదిలా ఉంటే నేషనల్ హెరాల్డ్ కేసును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కుటుంబాన్ని కేంద్ర ప్రభు త్వం వేధిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ను కేంద్ర ప్రభుత్వం దుర్విని యోగం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. కిందటేడాది హైదరాబాద్‌లో కూడా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరిగాయి.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రదర్శనల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఏమైనా లోక్‌సభ ఎన్నికలు తరుముకు వస్తున్న పరిస్థితుల్లో నేషనల్ హెరాల్డ్ కేసు తెరమీదకు రావడం వెనుక రాజకీయ కోణం ఉందంటున్నారు విశ్లేషకులు. కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రతిపక్షాల ఇండియా కూటమి కూడా ఏర్పడింది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రతిపక్షా లను నరేంద్ర మోడీ సర్కార్ వేధిస్తోందన్న ఆరోపణలు జాతీయ స్థాయి రాజకీయవర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.
- ఎస్. అబ్దుల్ ఖాలిక్,
సీనియర్ జర్నలిస్ట్,
63001 74320