Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Telugu Sahithya: తెలంగాణ భాషలో జోర్దార్ బాలల కథలు

Telugu Sahithya: తెలంగాణ భాషలో జోర్దార్ బాలల కథలు

పలు రకాల తెలంగాణ మాండలికాల్లో కథలు

  జోర్దార్ కతల పేరు వినగానే ఇవి  తెలంగాణ మాండలిక భాషలో రాసిన కథలని తెలిసిపోతుంది.  ఈ కథలు రాసింది సుప్రసిద్ధ బాల సాహితీ వేత్త,  బాలసాహిత్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి, సాహితీ పురస్కార గ్రహీత శ్రీ పైడిమర్రి రామకృష్ణ గారు.  ఈ రెండు పురస్కారాలను దక్కించుకున్న మొదటి వారు వీరే కావడం విశేషం.   వీరు ఖమ్మం జిల్లా తెలంగాణ మాండలికంతో పాటు ఇతర జిల్లాల మాండలిక భాషను కూడా ఉపయోగించుకొని   ఈ కథలను వ్రాయడం విశేషం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలోని పిల్లలు ఇదే భాషను వాడడం మనం చూస్తూనే ఉన్నాం.   
         పిల్లల కోసం  తెలంగాణ భాషలో ఇదివరలో  కీ. శే.  పెండెం జగదీశ్వర్ , డాక్టర్ పత్తిపాక మోహన్ ,గరిపెల్లి అశోక్ వంటి ఎంతోమంది రచయితలు మాండలిక భాషలో  కథలను వ్రాశారు . ఇప్పుడు శ్రీ పైడిమర్రి రామకృష్ణ గారు కూడా తెలంగాణ భాషలో  వ్రాయాలని ముందుకు రావడం విశేషం.   ఈ కథలన్నీ వివిధ  పత్రికలలో  ప్రచురించినవి కావడం ఇంకా  విశేషం.   ఇందులో మొత్తం  12 కథలు ఉన్నాయి.  జంతువులు, పక్షులు, ప్రధాన పాత్రలుగా ఉన్నప్పటికీ ఇవి మనుషులకు గొప్ప సందేశాన్ని  ఇస్తాయి.  ప్రతి కథ ఒక ఆణిముత్యమే.   పిల్లలకు చాలా తేలికైన పదాలతో, చిన్న చిన్న వాక్యాలతో కథ తేలికగా  అర్థమవుతుంది.   కథలో నీతి   కూడా ఉంటుంది.  ఈ కథలకు  ప్రముఖ బాలసాహితీ వేత్త ,చిత్రకారుడు వడ్డేపల్లి వెంకటేష్ గారు వేసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి .  ముఖచిత్రం రంగులతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 
     ఇందులో మొదటి కథ " ఉల్టా పల్టా "మొదలుకొని చివరి కథ "మారిన కోతి "వరకు కథలన్నీ చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఉదాహరణకు "మారిన కోతి "కథలో కోతి పులి నక్కను ఎలా చంపుతుందో చూద్దామని చెట్టు పైనుండి చూస్తుంది .  కానీ ఆ నక్క పొదలలో  దూరి తప్పించుకుంటుంది . ఆ తర్వాత ఎలుగుబంటి పై పులి దాడి చేయాలని అనుకొంటుంది.   అప్పుడు కూడా కోతి ఆసక్తితో  చూస్తుంది.  కానీ ఆ ఎలుగుబంటి కూడా   తప్పించుకుంటుంది .  చివరికి కోతి పులి లేదనుకొని  నీరు త్రాగబోయి అది పులి బారిన పడటం జరుగుతుంది .  అప్పుడు కోతికి ప్రాణభయం అంటే ఏమిటో తెలిసిపోతుంది.   "అందుకే ప్రాణాపాయం లో ఉన్న వారిని ఆసక్తితో  చూసి నవ్వడం తేలిక.  అదే ఆపద మనకు సంభవిస్తే తట్టుకోవడం కష్టం " అంటారు రామకృష్ణ గారు.  
       మరొక కథ " బువ్వ సత్రం" లో సింహానికి నక్క వండిన పదార్థాలు రుచించవు .  అన్నీ జంతువులు లొట్టలేసుకుంటూ  తింటాయి.  ఆ నక్క వంటను మెచ్చుకుంటాయి.   కానీ సింహం మాత్రం ఈ వంటకాలు బాగాలేదని అంటుంది.  దాంతో నక్క నిరాశపడుతుంది.  ఆ తరువాత తోడేలును ఆ సింహాన్ని  తిరిగి తీసుకొని రమ్మని ఆ జంతువులు చెబుతాయి .  సింహం మరునాడు ఆ వంటను మెచ్చుకుంటుంది. అందుకు కారణం అది ఏమీ తినకుండా రావడం, ఆకలితో ఉండడం మాత్రమే !  ఆకలి రుచి ఎరుగదు కదా! అన్న సామెత మనందరం వినే ఉంటాం.  ఈ రెండు కథలు నేను స్థాలీపులాక న్యాయంగా చూపినవే. ఇలాంటి ఇంకా అనేక కథలు పిల్లలకే కాకుండా పెద్దలకు  కూడా చదివేటప్పుడు  మిక్కిలి ఆసక్తిని కలిగిస్తాయి.   ఇటువంటి అద్భుతమైన కథలు ఒక్క దగ్గర చేర్చి ఆ విందును పైడిమర్రి గారు మనకు అందించారు.   ఇందులో బొత్త ,జెప్పన, ఇగురం, నారాజ్, పిస్స,  బాజాప్తా, గప్పుడు, గిప్పుడు ,సోపతి ,పరేషాన్, దూప, దావతు, జిందగీ ,అటెన్క,బర్కత్ లాంటి తెలంగాణ భాష లోని వాడుక పదాలు ఉన్నాయి . ఇంకా ఇందులో తెలంగాణలోని అమ్రాబాద్ అడవి ,మంజీర, భద్రాచలం, పాకాల, భువనగిరి ,పోచారం, శివారం, కిన్నెరసాని, మల్లారం ,నల్లమల, ప్రాణహిత వంటి అడవుల పేర్లను వీరు కథ  మొదటగానే సూచించారు . అలాగే ఇందులో కడుపులో ఎలుకలు తిరగడం, దీపం ముంగిట కూసుని కళ్ళు మూసుకున్నట్లు, పందియై వందేళ్లు బతకడం కన్నా నందియై నాలుగేళ్లు బతకడం మేలు మొదలైన  తెలుగు జాతీయాలు, సామెతలు ,పలుకుబడులు కూడా ఉన్నాయి.  
       వీరు ఖమ్మం జిల్లా వాసి అయినప్పటికీని రంగారెడ్డి జిల్లాలో స్థిరపడ్డారు.  అన్నీ  ప్రాంతాలు తిరగడం వల్ల వీరికి తెలంగాణ మాండలికం కరతాలమలకమైంది.  వీరు ఇంతవరకు 600 పైన పిల్లల కథలు వ్రాశారు.  ఎనిమిది  పుస్తకాలు వెలువరించారు.  మరొక విషయం ఏమిటంటే  వీరు బాలల కథా శిల్పులు అనే  పుస్తకం వ్రాసి అందులో వివిధ బాలసాహిత్య రచయితలను ఒకచోట చేర్చి వారి వివరాలు అందించారు .  అది బాలసాహిత్యం పైన పరిశోధన చేసేవారికి ఎంతో ఉపయోగకరమైన పుస్తకం. 
   ఈ పుస్తకానికి ముందుమాట ముగ్గురు ప్రముఖ బాలసాహితీవేత్తలు   వ్రాశారు. వారిలో    బాల సాహిత్య పరిషత్  అధ్యక్షులు , బాలసాహిత్యంలో  కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత ,స్టోరీ పోటర్,మేజిక్ చాప్లిన్  శ్రీ చొక్కాపు  వెంకటరమణ గారు ఒకరు.   అలాగే ఈ పుస్తకం గురించి ముందు మాట  నారంశెట్టి బాల సాహిత్య పీఠం అధ్యక్షులు,  కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత, ప్రముఖ బాలసాహితీవేత్త శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి ,సాహితీ పురస్కార గ్రహీత శ్రీ పుప్పాల కృష్ణమూర్తి గారు తమ ముందు మాటల్లో  చాలా చక్కగా తమ అభిప్రాయాలను  వెలువరించారు.  పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ చదువతగిన పుస్తకం ఇది.   ఈ పుస్తకం వేల 80 రూపాయలు. పేజీలు 44. 

రచన: సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, ధర్మపురి
మొబైల్: 9908554535

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News