తెలంగాణ కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు.
ప్రజాతీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించి, ప్రజాసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిద్దామని, ఏమి జరుగుతుందో వేచి చూద్దామని సూచించారు. రాజ్యాంగబద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నా ప్రజాతీర్పునకు అనుగుణంగా హుందా వ్యవహరించి తప్పుకున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో త్వరలోనే సమావేశమై శాసనసభాపక్షనేతను ఎన్నుకుందామని చెప్పారు.
బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ ని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
వారితో పాటు పలువురు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ఇతర నేతలు కేసీఆర్ గారిని కలిసిన వారిలో ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారి ధ్రువీకరణ పత్రాన్ని వారికి అందిస్తున్న స్థానిక నేత వంటేరు ప్రతాపరెడ్డి, చిత్రంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
సీఎం కేసీఆర్‌ను కలిసిన వారిలో తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, దానం నాగేందర్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కాలే యాదయ్య, కేవీ వివేకానంద్, పాడి కౌశిక్‌రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డాక్టర్ సంజయ్, సునీతా లక్ష్మారెడ్డి, లాస్య నందిత, చింతా ప్రభాకర్, ప్రకాశ్‌గౌడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఉన్నారు.