పార్లమెంట్ కొత్త భవనం రెడీ అయింది..ప్రస్తుతం ఫినిషింగ్ టచెస్ జోరుగా సాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శరవేగంగా పనులు సాగుతున్న కారణంగా..ఈనెలాఖరుకల్లా పార్లమెంట్ భవనం పనులు పూర్తవుతాయి. అయితే రానున్న బడ్జెట్ సమావేశాలు కొత్త భవనంలో నిర్వహించాలా వద్దా అన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సెంట్రల్ విస్తా పేరుతో ఈ కారిడార్ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా సాగుతోంది. ఇందులో కామ్ సెంట్రల్ సెక్రెటేరియట్, ప్రధానమంత్రి నివాసం, కొత్త ఆఫీసు, ఉపరాష్ట్రతి కొత్త నివాసం వంటివన్నీ సీపీడబ్ల్యూడీలో భాగంగా ఉండనున్నాయి. రెండేళ్ల క్రితం పార్లమెంట్ కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బోలెడన్ని విమర్శల మధ్య 2020 డిసెంబర్ లో ఈ పనులకు భూమి పూజ చేసిన ప్రధాని మోడీ నిర్మాణ పనులను ప్రారంభించారు.
టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ నిర్మాణం చేపట్టింది. భారత ప్రజాస్వామ్య వారసత్వాన్ని చాటేలా ఇందులో గ్రాండ్ కాన్స్టిట్యూషన్ హాల్ కూడా ఉండనుంది. అతి పెద్ద లైబ్రరీ, బోలెడన్ని కమిటీ రూములు, డైనింగ్ ఏరియా, విశాలమైన పార్కింగ్ ఏరియా కూడా కొత్త పార్లమెంట్ భవనంలో సమకూరనున్నాయి. నిజానికి గతేడాది నవంబర్ లోనే పార్లమెంట్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా పనుల్లో కాస్త జాప్యం చోటుచేసుకుంది.