గార్ల మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాహనాల రాకపోకలు నిలిపివేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న మిచాంగ్ తుఫాన్ తో రాంపురం పాకాల ఏటి వద్ద వరద ఉధృతిని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా గార్ల రాంపురం మద్దివంచ కొత్త తండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. రెండు రోజులుగా కురుస్తున్న తుఫాన్ తో వాగుల్లో నీళ్లు చేరి ఉదృతంగా ప్రవహిస్తున్నాయని ఏ క్షణమైనా వరద ప్రభావం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు చెక్ డాం పైనుంచి ప్రయాణాలు చేయవద్దని రాకపోకలు నిలిపి వేసేందుకు బారికేట్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అత్యవసర సమయంలో హెల్ప్ లైన్ నెంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట డిఎస్పి సత్యనారాయణ గార్ల బయ్యారం సిఐ బాబురావు గార్ల ఎస్సై బానోతు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.