Tuesday, November 26, 2024
Homeఓపన్ పేజ్Armed Forces Flag Day: సాయుధ దళాల పతాక దినోత్సవం

Armed Forces Flag Day: సాయుధ దళాల పతాక దినోత్సవం

త్రివిధ దళాల పతాక దినోత్సవం

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం, అత్యంత శౌర్యప్రతాపాలతో ప్రాణాలకు సైతం తెగించి దేశ సరిహద్దుల వద్ద ఎముకల కొరికే తీవ్ర చలిలో, కుండపోత వర్షాలైనా, భగ్గుమనే ఎండలనైనా ఏమాత్రం లక్ష్యపెట్టకుండా అక్రమ చొరబాట్లను అడ్డుకోవడం, భారత గగనతలాన్ని డేగకన్నుతో పహారా కాయడం, దేశ సముద్ర తీరాన్ని కంటికి రెప్పలా కాపాడడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయ పునరావాస కార్యక్రమాలలో భారత త్రివిధ దళాలు ప్రదర్శించే దేశభక్తి, ప్రతికూల పరిస్థితులలో కూడా పట్టు సడలని వారి ఆత్మస్థైర్యానికి దేశ పౌరులంతా కూడా ప్రతినిత్యం వందనం సమర్పించాల్సిందే. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన వెంటనే త్రివిధ దళాల్లో పనిచేసే వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సాయుధ బలగాల పతాక దినోత్సవాన్ని నిర్వహించాలని ఆగస్టు 28, 1949లో రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఒక కమిటీ నిర్ణయించింది. ఆ తర్వాత 1993లో భారత రక్షణశాఖ, యుద్ధ బాధితుల సంక్షేమ నిధి, కేంద్రీయ సైనిక్ బోర్డ్ ఫండ్ వంటి వేర్వేరు సంక్షేమ ఫండ్‌లను “ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్” (ఏఎఫ్ఎఫ్‌డీఎఫ్‌) పేరిట ఒకే ఫండ్‌గా మార్చివేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.. భారత త్రివిధ దళాల నిరుపమాన సేవలు మరియు వారి త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా డిసెంబర్ 7 న “సాయుధ దళాల పతాక దినోత్సవం” (Armed Forces Flag Day) భారత రక్షణ మంత్రిత్వ శాఖ 1949 లో నిర్ణయించింది. దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు మరియు వారి కుటుంబాలకు అండగా ఉన్నామని తెలియజేయడమే ఈ రోజు ప్రత్యేకత.

- Advertisement -

నిరుపమానమైన సేవలు:

దేశ రక్షణతో పాటు దేశంలో అంతర్గతంగా జరిగే అనేక విపత్కర పరిస్థితులను చక్కదిద్దడంలో ఆర్మీ, వైమానిక మరియు నౌకా దళాలు నిరుపమానమైన సేవలను అందిస్తుంటాయి. దేశ ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించడంలో సాయుధ ధళాలు ముందు వరసలో ఉంటాయి. దేశం లోని 28 రాష్ట్రాలతో సహా 8 కేంద్ర పాలిత ప్రాంతాలలోని ఏ మారుమూలనైనా ప్రకృతి వైపరీత్యాల వంటి వరదలు, భూకంపాలు సంభవించినప్పుడు, అసాంఘిక శక్తులు పేట్రేగి దేశ సుస్థిరతకు భంగం వాటిల్లి పరిస్థితి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం చేయి జారినప్పుడు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సైనికులు సేవలందించడం మనకు తెలుసు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచివేసి దేశ ప్రజలకు రక్షణ కల్పించే ఎన్నో సందర్భాలలో వీరమరణం పొందిన దృష్టాంతాలు కూడా మనం వార్తలలో చూస్తుంటాము. భారత సాయుధ దళాలు 1947, 1965, 1971 సంవత్సరాల్లో సైనిక చర్యల్లో పాల్గొన్నాయి. అందులో 1963లో చైనా యుద్ధం, పోర్చుగీసు యుద్ధం, 1987లో చైనా ఘర్షణ, 1999 నాటి కార్గిల్‌ యుద్ధం, సీయాచిన్‌ ఘర్షణలలో అప్రతిహతంగా పోరాడాయి.

త్రివిధ దళాల పతాకం:

“త్రివిధ దళాల పతాక దినోత్సవం” అయిన డిసెంబర్ 7న దేశవ్యాప్తంగా త్రివిధ దళాలు ప్రాతినిధ్యం వహించే ఎరుపు, ముదరు నీలం, లేత నీలం రంగుల జెండాలను కేంద్రీయ సైనిక్ బోర్డు, రాజ్యసభ, జిల్లా సైనిక్ బోర్డ్ ద్వారా ప్రజలకు పంపిణీ చేసి విరాళాలు సేకరిస్తారు. దేశం కోసం అహర్నిశలు సర్వసన్నద్ధంగా ఉంటూ శత్రుమూకలతో భీకరంగా పోరాడే సైనికుల కుటుంబాలు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ వారి పరిరక్షణ బాధ్యతను సాధారణ దేశ ప్రజలు స్వీకరిస్తున్నారన్న భావనను వారికి కలిగించేలా విరాళాలను సేకరించడం ఫ్లాగ్ డేకు అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది. విధి నిర్వహణలో భాగంగా క్షతగాత్రులైన సైనికులకు పునరావాసం కల్పించడం, సర్వీసులో సిబ్బంది, వారి కుటుంబీకుల సంక్షేమం, మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం, పునరావసం కల్పించడం. అమరవీరుల కుటుంబాలు, మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా “సైనిక సంక్షేమ శాఖ” స్థాపించబడింది. రాష్ట్రంలో హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే అన్ని రాయితీలను పైన పేర్కొన్న లబ్దిదారులకు సక్రమంగా చేరేయడంలో ప్రత్యేక కృషి చేస్తుంది.

ప్రపంచంలోనే ద్వితీయ స్థానం:
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సైనిక పాటవాలను అంచనా వేసే ప్రఖ్యాత సంస్థ “గ్లోబల్ ఫైర్‌పవర్” అంచనా ప్రకారం, భారతీయ సైన్యం 14.50 లక్షల క్రియాశీలక సిబ్బందిని కలిగి ఉంది. ఈ విభాగంలో భారత దేశం ద్వితీయ స్థానంలో ఉండగా మొత్తం 20.00 లక్షల క్రియాశీలక సిబ్బందితో చైనా మొదటి స్థానంలో ఉంది. ఇది వివిధ దేశాల వారీగా అందుబాటులో ఉన్న మొత్తం క్రియాశీలక సైనిక సిబ్బంది సమాచారం ఆధారంగా అంచనా వేయబడింది. భారత రాష్ట్రపతి సర్వసైన్యాధక్షుడుగా వ్యవహరించే ప్రధానమైన ఈ త్రివిధ దళాలతో (పదాతి దళం, వాయు సేనా దళం మరియు నౌకాదళం) పాటు తీర రక్షక దళం, పారామిలటరీ దళాలు కూడా వీటిలో అంతర్భాగాలే.

ప్రప్రథమ ప్రధాని కితాబు:

1954 డిసెంబర్ 7న దేశ ప్రథమ ప్రధాన మంత్రి ఉన్న నెహ్రూ తాను కొన్ని రోజుల క్రితం భారత్-చైనా సరిహద్దుకు వెళ్లినట్లు అక్కడ మన భారత జవాన్లు ఎంతో ఉత్సాహంగా కనిపించారని చెప్పారు. దేశ భద్రత కోసం తమ కుటుంబాలను ఎక్కడో వీడి అక్కడ సేవలందించడం నిజంగా గర్వించదగ్గ విషయం అని చెప్పారు. అంతేకాదు అక్కడ ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు మన జవాన్లు అని గుర్తు చేశారు ప్రధాని. దేశ ఖ్యాతిని వ్యాపింపచేయడంలో వారు ఎంతో కృషి చేస్తున్నారని, దేశ నలుమూలల నుంచి వచ్చినప్పటికీ ఎలాంటి విబేధాలు లేకుండా… దేశాన్ని రక్షించుకోవాలన్న ఏకైక లక్ష్యంతో వారు అక్కడ సహజీవనం చేస్తున్నారని నెహ్రూ చెప్పారు. దేశానికి అలవోకగా తమ సర్వస్వం ధార పోస్తున్న జవాన్ల సంక్షేమం కోసం ఒక నిధిని సమకూర్చి ప్రతి “ఫ్లాగ్ డే” రోజున విరివిగా విరాళాలు ఇచ్చి వారి తోడ్పాటుకు సహకరిద్దాం అని నెహ్రూ పిలుపునిచ్చారు.

ఫ్లాగ్ డే ముఖ్య ఉద్దేశం:

ప్రతి సంవత్సరం 60 నుండి 70 వేల మంది సిబ్బంది సాయుధ దళాల నుండి పదవీ విరమణ చేయడమో లేదా క్రియాశీల సేవల నుండి విడుదల చేయడమో జరుగుతుంది. వారిలో అత్యధికులు తొలి 40 ఏళ్ల ప్రాయంలో ఉండడం గమనార్హం. సాయుధ దళాలలోని వివిధ రంగాలలో వివిధ స్థాయిలలో సేవలందించిన అనుభవజ్ఞులు పదవీ విరమణానంతరం కార్పొరేట్ రంగంలో ప్రభావశీలవంతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. అయితే మాజీ సైనికులందరికీ సమానావకాశాలు లభించకపోవచ్చు. యుద్ధ సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి పునరావాసం కల్పించడం, దేశం కోసం త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సైనికులు వారి కుటుంబ సంక్షేమం కోసం, దేశం కోసం సేవ చేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికుల కుటుంబం సంక్షేమం కోసం ఫ్లాగ్‌డేను నిర్వహిస్తారు. వీరి సంక్షేమం కోసం విరాళం ఇచ్చి ప్రతి ఒక్కరం దేశభక్తిని చాటుకోవాడమే కాదు ఆ అమరులకు నివాళులు అర్పించినట్లు కూడా అవుతుంది. ఈ రోజును పురస్కరించుకుని విరాళాలు ఇవ్వాల్సిందిగా సోషల్ మీడియాలో విజ్ఞప్తుల వెల్లువ వస్తోంది. ట్విటర్ వేదికగా చాలా మంది సైనికుల సంక్షేమం కోసం పేటీఎం ద్వారా విరాళాలు అందిస్తున్నారు. ఈ రోజున ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు గట్టి ప్రయత్నం జరుగుతుంది. సాయుధ దళాల యూనిట్లు మరియు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ద్వారా “ఫ్లాగ్ డే” ప్రాముఖ్యతను వివిధ ప్రదర్శనలు, కార్నివాల్‌లు, నాటకాలు మరియు ఇతర వినోద కార్యక్రమాల ద్వారా తెలిపే ఏర్పాటు చేస్తాయి. ఎరుపు, ముదురు నీలం మరియు లేత రంగులలో టోకెన్ ఫ్లాగ్‌లు మరియు కార్ స్టిక్కర్‌లు, మూడు సేవలను సూచిస్తూ కేంద్రీయ సైనిక్ బోర్డు ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేసి విరాళాలు సేకరించబడతాయి. “ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్” (AFFDF) నిర్వహణకు కేంద్రీయ సైనిక్ బోర్డ్ బాధ్యత వహిస్తుంది. సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ నిర్వహణ మేనేజింగ్ కమిటీపై ఆధారపడి ఉంటుంది, దీని ఛైర్మన్ గా భారత రక్షణ శాఖ మంత్రి మంత్రి, వైస్ ఛైర్మన్ గా భారత రక్షణ శాఖ సహాయ మంత్రి, సభ్యులుగా త్రివిధ దళాల అధిపతులు (సర్వీస్ చీఫ్‌), రక్షణ శాఖ కార్యదర్శి, మాజీ సైనికుల సంక్షేమం కార్యదర్శి, రక్షణ శాఖ మరియు ఇతర సీనియర్ కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు.

మీరిలా చేయూతనందించవచ్చు:
సాయుధ బలగాల పతాక దినోత్సవాలలో పాల్గొనడం, జెండాలు, కూపన్లు, కార్డులు కొనుగోలు చేయడం ద్వారా “ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్” కు ప్రతి ఒక్కరూ తమ తోడ్పాటునందించవచ్చు. సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా ఈ ఫండ్‌కు విరాళం అందించొచ్చు. కేంద్రీయ సైనిక్ బోర్డ్ వెబ్‌సైట్‌పై లభించే అఫిషీయల్ లింక్‌పై క్లిక్ చేసి ఆన్‌లైన్ డొనేషన్ చేయవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లకు చెక్ రూపంలో కూడా విరాళాలు అందించవచ్చు. ఈ కింద సూచించిన లింక్ ttps://www.ksb.gov.in/DonateAFFDF.htm ద్వారా కూడా విరాళం అందించే వెసులుబాటు ఉంది.

గతంలో మన సాయుధ దళాలు ఎన్నో విలువైన ప్రాణాలను కోల్పోవడమే కాక ఇప్పుడు కూడా కోల్పోతూనే ఉన్నాయి. అంతేకాక ఎంతో మందిని శాశ్వత వికలాంగులుగా మారుస్తున్నాయి. కుటుంబ పోషణకు ప్రధాన ఆదాయ వనరైన వ్యక్తి మరణం ఆ కుటుంబానికి ఆశనిపాతమే అవుతుంది. వికలాంగులైన మాజీ సైనికులకు సంరక్షణ మరియు పునరావాసం కల్పించడం ద్వారా వారు తమ కుటుంబానికి భారంగా మారకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడపవచ్చు. అంతే కాక జీవన చరమాంకంలో కొందరు ఎదుర్కొనే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మోకాలు కీలు మార్పిడి, క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధులతో ఒక పక్క మరియు నానాటికీ పెరిగిపోతున్న వైద్య ఖర్చులను భరించే ఆర్ధిక స్థోమత వారికి కూడా మన సంరక్షణ ఎంతో అవసరం.

యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News