ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అర్థ సత్యమో ఏమీ అర్థం కావడం లేదు. గ్రామ పంచాయతీలకు నిధుల మంజూరు విషయానికి వచ్చే సరికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుబడుతుంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తుంది. అసలు విషయం ఏమిటన్నది మాత్రం అంతుబట్టకుండా ఉంది. అయితే, ఒక్కటి మాత్రం నిజం. గ్రామ పంచాయతీలకు మాత్రం నిధులు అందడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలకు గానీ, సంక్షేమ కార్యక్రమాలకు గానీ ఒక్క రూపాయి కూడా నిధులు లేవు. అమలు జరిగిన, అమలు జరుగుతున్న కార్యక్రమాలకు ఇంతవరకూ నిధులు చెల్లించడమే సాధ్యం కావడం లేదు. మధ్యలో సర్పంచులు అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగి పోతున్నారు. రాష్ట్రంలో గ్రామాలు దేశంలో మరెక్కడా లేనివిధంగా అభివృద్ధి చెందు తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గొప్పగా చెప్పుకుంటున్న సమయంలో గ్రామ పంచాయతీలు నిధుల కొరతతో నానా అవస్థలూ పడుతున్నారు.
విచిత్రమేమిటంటే, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్- 2023 కార్యక్రమం కింద రాష్ట్రం లోని మూడు జిల్లాలకు అత్యున్నత పురస్కారాలు లభించాయి. అనేక గ్రామాలు దేశంలో మరెక్కడా లేని విధంగా సమగ్రంగా అభివృద్ధి చెందాయనే గుర్తింపు కూడా లభించింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం కింద సాధ్య మయ్యాయి. ఈ పల్లె ప్రగతి కార్యక్రమం కింద పచ్చదనం, చెత్త పడేసే ప్రదేశాల గుర్తింపు, ట్రాక్టర్ల సరఫరా వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో విశేషమైన మెరుగుదలను రాష్ట్రం సొంతం చేసుకుంది. గత ఏడాది ఈ కార్యక్రమం మీద రూ.4,000 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనల ప్రకారం ప్రతి ఏటా వేలాది
కోట్ల రూపాయలను పల్లె ప్రగతి కార్యక్రమం మీద ఖర్చు చేయడం జరుగుతోంది. అయితే, మరో పక్క నుంచి పూర్తిగా ఇందుకు భిన్నమైన వాదన వినిపిస్తోంది. నిధుల కొరత కారణంగా తాము నానా అవస్థలూ పడుతున్నామంటూ గత కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీల సర్పంచులు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాము కూడా చివరికి వ్యవసాయ కార్మికులుగా, కాపలా దార్లుగా పని చేయాల్సి వస్తోందని, ప్రాణాలు తీసుకోవడం కూడా జరుగుతోందని వారు ప్రకటనలు. పంచాయతి చేస్తున్నారు. తమ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను కాంట్రాక్టర్లకు చెల్లించడానికి రుణాలు తీసుకోవాల్సి వస్తోందని కూడా వారు చెబుతున్నారు. తమ దగ్గర నిధులు లేకపోయినా, అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో తమపై విష రీతంగా ఒత్తిడి పెరుగుతోందని కూడా వారు వాపోతున్నారు. చాలా నెలలుగా తమకు నిధులే విడుదల కావడం లేదంటూ వారు గగ్గోలు పెడుతున్నారు.
ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేదు. ఏ సర్పంచ్ ఏ పార్టీకి చెందినవాడైనా నిధుల కొరత మాత్రం తప్పడం లేదు. అత్యధిక శాతం గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు బాకీ పడిందని వారు చెబుతున్నారు. సహజంగానే ఇది ప్రతిపక్షాలకు పాలక పక్షం మీద ప్రయోగించడానికి ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతోంది.
ప్రతిపక్షాల నిరసనలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందంటూ బీజేపీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వనందుకు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు సరిగా నిధులు రావడం లేదని, కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, నిధుల్లో కోత విధించడం, నిధుల మంజూరులో ఆలస్యం చేయడం, విధులు ఆపేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం ధ్వజమెత్తు తోంది. తాము క్రమబద్ధంగా పంచాయతీలకు నిధులు విడుదల చేస్తూనే ఉన్నామని కూడా ప్రభుత్వం వాదిస్తోంది. అంతేకాదు, 2019 తర్వాత నుంచి ఇప్పటి వరకు సుమారు పది వేల కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు విడుదల చేసినట్టు కూడా అది తెలియజేసింది. మరి సమస్య ఎక్కడ అనేది మాత్రం అర్థం కావ డం లేదు. ఈ వాదోపవాదాల మధ్య నలిగిపోతున్నది మాత్రం గ్రామ పంచాయతీలే.
నిజానికి, కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఏమాత్రం ఇష్టం లేదు. గ్రామ పంచాయ తీల అవసరాల గురించి, సమస్యల గురించి తమకు తెలిసినంతగా కేంద్రానికి అవగాహన ఉండదని ఆయన చెబుతున్నారు. ఇది నిజంగా గమనించాల్సిన విషయమే. ఆయన వాదనలో అర్థం ఉంది. అయితే, నిధుల విడుదల విషయంలో అటు కేంద్రం లోనూ, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ అలస్యమేమీ జరగనప్పుడు గ్రామ పంచాయతీలు నిధులు అందడం లేదంటూ ఎందుకు గగ్గోలు పెడుతున్నాయనేది అర్థం కాని విష యం. ఒకరినొకరు తిట్టుకునే బదులు, ఈ క్లిష్ట సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిది.
– జి. రాజశుక