Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్New CM New Challenges: కొత్త ముఖ్యమంత్రికి సరికొత్త సవాళ్లు

New CM New Challenges: కొత్త ముఖ్యమంత్రికి సరికొత్త సవాళ్లు

'మల్లు' 'ముల్లు'గా మారితే రేవంత్ పరిస్థితి ఏంటి?

దేశంలో సరికొత్త రాష్ట్రమైన తెలంగాణకు ముఖ్యమంత్రిగా అవతరించడానికి ముందు అనుముల రేవంత్‌ రెడ్డి రాజకీయంగా సుదూర ప్రయాణమే సాగించాల్సి వచ్చింది. పార్టీ సిద్ధాంతాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటూనే తన ఆశలను, ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడిన, అవిశ్రాంత జీవితం గడిపిన రేవంత్‌ రెడ్డి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఆయన ఆశయాలకు, కాంగ్రెస్‌ ఆశయాలకు పూర్తిగా పొంతన కుదిరినట్టు కనిపిస్తోంది. పిన్నవయసులో తనకు ఆర్‌.ఎస్‌.ఎస్‌ తోనూ, అఖిల భారత విద్యార్థి పరిషత్తుతోనూ ఉన్న సంబంధాలను పక్కన పెట్టి, తనకు రాజకీయంగా భవిష్యత్తునిచ్చిన తెలుగుదేశం పార్టీనీ పక్కనపెట్టి 2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రేవంత్‌ రెడ్డి అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీతో పూర్తిగా మమేకమయ్యారు. రాజకీయాల్లో ఆయన ఎంత కష్టపడి ఎదిగారో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా అంత కష్టపడి పునరుజ్జీవించడం జరిగింది. సంచలనాత్మక ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి ఇరుక్కున్నప్పుడు ఇక ఆయన నుంచి తనకు ముప్పు ఉండదని మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు భావించారు. అయితే, రేవంత్‌ రెడ్డి పట్టుదల ఆయనకు పూర్తిగా అర్థమైనట్టు లేదు.
ఆ కేసు నుంచి బయటపడడంతో పాటు, ఆయన కె.సి.ఆర్‌ కుర్చీకే ఎసరు పెట్టే స్థాయికి వెళ్లడం నిజంగా ఒక అనూహ్య పరిణామమనే చెప్పాలి. రాష్ట్రంలో ప్రతిపక్షాల పట్ల విసిగిపోయిన ఓటర్లను తన వైపునకు తిప్పుకుంటూనే, కె.సి.ఆర్‌ కుటుంబ పాలనకు పక్కలో బల్లెంలా తయారయిన రేవంత్‌ రెడ్డి చివరికి అనుకున్నది సాధించారు. అతి తక్కువ కాలంలోనే ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠానికి చేరువయ్యారు. ఇతర నాయకులెవరూ సాధించలేకపోయిన విజయాన్ని ఆయన కాంగ్రెస్‌కు రాష్ట్రంలో సాధించిపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని అయిపోయిందనే ప్రత్యర్థుల విమర్శలను, అభిప్రాయాలను ఆయన అతి తక్కువ కాలంలోనే తిప్పికొట్టారు. భారత రాష్ట్ర సమితి మీదా, దాని నాయకుల మీదా తనకున్న పగను, ప్రతీకారాన్ని తీర్చుకోవడంతో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరుగులేని విధంగా పునరుద్ధరించడం అనేది ఆయనకే చెల్లింది. అంతేకాదు, రాష్ట్ర కాంగ్రెస్‌ లోని ఇతర నాయకులు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడవాల్సి వచ్చింది.
అయితే, అగ్రస్థానానికి చేరుకోవడంతోనే సరిపోలేదు. రేవంత్‌ రెడ్డికి, కాంగ్రెస్‌ పార్టీకి అసలైన సవాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కుల న్యాయానికి పెద్ద పీట వేస్తున్నారు. అనేక కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాల సంకీర్ణమైన కాంగ్రెస్‌ పార్టీకి కుల న్యాయాన్ని సాధించడమనేది చిన్న విషయమేమీ కాదు. దేశంలో అతి తక్కువ రాష్ట్రాలకే పరిమితం అయిన కాంగ్రెస్‌ పార్టీ అధికారం ఈ కుల న్యాయాన్ని సాధించగలుగుతుందా, కుల గణన చేపట్టగలుగుతుందా అన్నది పెద్ద ప్రశ్న. ఇక ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు కొత్తగా పార్టీలోకి అడుగుపెట్టి అందలాలు ఎక్కిన రేవంత్‌ రెడ్డిని పార్టీలోని సీనియర్‌ నాయకులు భరించలేకపోవచ్చు. ఇదివరకటి అసెంబ్లీలో కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడుగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క తప్పకుండా ఆయనకు కాలిలో ముల్లులా, కంటిలో నలుసులా వ్యవహరించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ తాను ప్రవచించిన కుల న్యాయానికి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలన్నా, దీన్ని అర్థవంతం చేయాలన్నా తప్పకుండా భట్టి విక్రమార్కకు ముందుగా న్యాయం చేయాల్సి ఉంటుంది. ఆయనను ఒక గౌరవనీయ స్థానంలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ దశిత నాయకుడు పాదయాత్రలు చేయడం, ప్రభుత్వ విధానాలపై పోరాటాలు సాగించడం విస్మరించలేని విషయం.
శాసనసభలో ఈ పార్టీకి ఉన్నది 64మంది సభ్యులే. ఇందులో ముఖ్యమంత్రితో సహా 17 మందిని మాత్రమే మంత్రులుగా నియమించడానికి అవకాశం ఉంది. అంతేకాక, 119 మంది సభ్యుల శాసన సభలో కాంగ్రెస్‌ పార్టీకి చాలా తక్కువ మెజారిటీతోనే అధికారం దక్కింది. దీన్ని కాపాడుకోవడం అన్నిటికంటే పెద్ద సవాలుగా పరిణమించే అవకాశం ఉంది. బహుశా ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకునో ఏమో, కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే తమది ఏక వ్యక్తి పాలన కాబోదంటూ ప్రకటన చేసింది. రాష్ట్రంలో తమ సంక్షేమ పథకాలు నిరాఘాటంగా, నిర్విరామంగా కొనసాగుతాయంటూ కూడా ప్రకటించింది. కాంగ్రెస్‌ పాలన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ తో సహా ఇతర రాష్ట్రాల మీద కూడా పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం రేవంత్‌ రెడ్డికే కాక, కాంగ్రెస్‌ పార్టీకి సైతం ఒక పెద్ద సవాలుగా పరిణమించబోతోంది. రేవంత్‌ రెడ్డి తన పాలనను తప్పకుండా ఆదర్శవంతమైన పాలనగా మార్చాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News