Friday, September 20, 2024
Homeహెల్త్Pigmentation?: పిగ్మెంటేషన్ పోవావలంటే?

Pigmentation?: పిగ్మెంటేషన్ పోవావలంటే?

ఇంట్లోనే నాచురల్ గా పిగ్మెంటేషన్ పోవాలంటే..

పిగ్మెంటేషన్ పోగొట్టే బ్యూటీ చిట్కాలు..

- Advertisement -

ముఖంపై నల్లటి మచ్చలు, మరకలు పోయేందుకు షహనాజ్ హుస్సేన్ సహజసిద్ధమైన వంటింటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. స్కిన్ పిగ్మెంటేషన్ ను ఇవి బాగా తగ్గిస్తాయి. నిత్యం ఫేస్ ప్యాక్స్ ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం బిగువుగా ఉండడంతో పాటు అన్ని రకాల మచ్చలు పోతాయి. ఒక పాళ్లు తేనె, రెండు పాళ్లు నిమ్మ రసం రెండింటినీ బాగా కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

అలాగే బాదం, పెరుగు రెండింటినీ మెత్తగా పేస్టులా చేసి దాన్ని ముఖానికి సున్నితంగా పట్టించి కొద్దిసేపు ముఖంపై దాన్ని అలాగే వదిలేయాలి. ఆతర్వాత నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే కూడా చర్మం కాంతివంతంగా, మచ్చలు ఏమీ లేకుండా ఉంటుంది. రోజ్ వాటర్, నిమ్మరసం రెండింటినీ సమపాళ్లల్లో తీసుకుని ముఖంపై ఉన్న నల్లటి ప్రదేశాలపై అప్లై చేసి పది నిమిషాలు అలాగే ఉంచుకుని ఆతర్వాత నీటితో ముఖం కడుక్కోవాలి. శెనగపిండి, పెరుగు, కొద్దిగా పసుపు ఈ మూడింటినీ నీరు పోసి కలిపి మెత్తటి పేస్టులా చేసి దాన్ని ముఖంపై ఉండే నల్లటి ప్రదేశాల్లో రాసుకోవాలి. అలాగే కొద్దిగా బియ్యప్పిండి, పెరుగు రెండింటినీ కలిపి ముఖానికి స్క్రబ్ లా అప్లై చేసుకుంటే కూడా ముఖంపై ఉండే పిగ్మెంటేషన్ పోతుంది.

ఇవికాకుండా ముల్తానీ మట్టి కూడా పిగ్మెంటేషన్ మీద బాగా పనిచేస్తుంది. ఇది ముఖంపై ఏర్పడ్డ మొటిమల తాలూకు మచ్చలను పోగొడుతుంది. అందుకే కొద్దిగా ముల్తానీ మట్టి తీసుకుని అందులో నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేసి వారానికి మూడు సార్లు ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎక్కువ బ్లీచింగ్ చేయడం వల్ల కూడా చర్మంపై పిగ్మెంటేషన్ సమస్య తలెత్తుత్తుంది. బ్లీచింగ్ పూర్తిగా మానేస్తే మంచిది. లేదా స్పెషల్ సందర్భాల్లో మాత్రం బ్లీచింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నేచురల్ బ్లీచింగ్ పద్ధతులను అంటే నిమ్మరసం లేదా టొమాటో రసంతో బ్లీచింగ్ చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్టుల బారిన పడరు.

ఫేస్ స్క్రబ్ లను వారానికి రెండు సార్లు ముఖానికి అప్లై చేసుకుంటే చాలు. ఇవి పిగ్మేంటేషన్ సమస్యను పోగొడతాయి. దీంతో మీ చర్మం తాజాగా, మృదువుగా, మరింత ఆరోగ్యంగా తయారవుతుంది. అయితే ముఖంపై మొటిమలు ఉంటే మాత్రం స్ర్కబ్బింగ్ చేసుకోవద్దు. ఇలా చేసుకుంటే ఇన్ఫ్లమేషన్ తో పాటు యాక్నే మార్క్స్ ముఖంపై ఏర్పడతాయి. సూర్యరశ్మికి బాగా గురికావడం వల్ల కూడా చర్మంపై పిగ్మెంటేషన్
ఏర్పడుతుంది. ఫలితంగా చర్మంపై నల్ల మచ్చలు, వలయాలు, ముడతలు, టానింగ్ ఏర్పడతాయి. దీంతో చర్మం కాంతి విహీనంగా తయారవడమే కాకుండా వయసు తొందరగా మీద పడుతుంది. చర్మం రంగు తగ్గుతుంది. అందుకే తప్పనిసరిగా సన్ స్క్రీన్ నిత్యం చర్మానికి రాసుకోవాలి. ఎస్పిఎఫ్ కంట్రోల్ తో ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ను చర్మానికి రాసుకుంటే మంచిది. బయటకు వెళ్లడానికి అరగంట ముందుగానే ముఖానికి సన్ స్క్రీన్ అప్లై చేసకోవాలి. చలికాలంలో సైతం సన్ స్క్రీన్ తప్పనిసరిగా చర్మానికి రాసుకోవాలి.

పొడిచర్మం ఉన్న వారు తొందరగా పిగ్మెంటేషన్ కు, టానింగ్ కు గురవుతారు. అందుకే వీళ్లు తప్పనిసరిగా చర్మానికి మాయిశ్చరైజర్లు వాడాలి. ఇలా వీటిని చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉండి మెరుపులు చిందిస్తుంది. చలికాలంలో, చల్లటి ప్రదేశాల్లో ఉంటున్న వాళ్లు మాయిశ్చరైజర్లను మందంగా చర్మానికి పూసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల కూడా ముఖం పొడిబారినట్టు కనపడుతుంది. చర్మం కాంతివిహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకే రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లను తాగాలి. ఇలా నీరు బాగా తాగడం వల్ల చర్మం మృదువుగా ఉండడంతో పాటు మెరుస్తుంది. పిగ్మెంటేషన్
సమస్య తలెత్తదు. కెమికల్ పీల్స్ వల్ల చర్మంపై ఉన్న మలినాలన్నీ శుభ్రంగా పోతాయి. అయితే సెన్సిటివ్ స్కిన్ వారు కెమికల్ పీలింగ్ కు దూరంగా ఉంటేనే మంచిది.

పిగ్మెంటేషన్ పోవడానికి వంటింటి చిట్కాలు ఉన్నాయి. వాటిల్లో బంగాళాదుంపను తురిమి ముఖానికి రాసుకోవచ్చు. అలాగే కీరకాయ జ్యూసు అప్లై చేసుకున్నా కూడా పిగ్మెంటేషన్ పోతుంది. ఇవి కాకుండా నిమ్మరసం, అలొవిరా నుంచి తీసిన జెల్, వెనిగర్, టొమాటో జ్యూసు, పెరుగు, అరటిపండు గుజ్జు లాంటివి కూడా చర్మంపై ఏర్పడ్డ పిగ్మెంటేషన్ ను పోగొట్టడంలో ఎంతో శక్తివతంతంగా పనిచేస్తాయి. విటమిన్ ఇ అధికంగా ఉన్న కాప్సూల్స్ లేదా లోషన్స్ లేదా నూనెలను వాడినా కూడా ముఖంపై ఉండే రకరకాల మచ్చలు పోతాయి. విటమిన్ ఇ టాబ్లెట్ వేసుకున్నా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. విటమిన్ ఇ బాగా ఉన్న పప్పులు, చేప, బ్రొకోలీ, పాలకూర, అవకెడో, గుమ్మడి, టోఫు, గుమ్మడి గింజలు వంటివి తింటే చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. పిగ్మెంటేషన్ సమస్య పూర్తిగా పోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News