Weather Update: చలి పంజా విసురుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతూ చలి తీవ్రత పెరుగుతోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుంటే.. ఏపీలో పలుచోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. వర్షం ప్రభావంతో ఏపీలో కూడా చలి వణికిస్తుంది. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు సగటున 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతున్నాయంటే ఇక్కడ చలి ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఈశాన్య రుతుపవనాల రాక నేపథ్యంతో పాటు ఈశాన్య, తూర్పు దిశల నుంచి రాష్ట్రానికి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగినట్లు వాతావరణ నిపుణులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొమరంభీం జిల్లాలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవగా.. మంచిర్యాల 12, ఆదిలాబాద్ 13, నిర్మల్ లో 13.5 డిగ్రీలు నమోదయ్యాయి.
మరోవైపు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు
వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ గ్రామాల్లో చలిగాలులు అధికమవగా.. చలి తీవ్రతకు ప్రజలు తాళలేకపోతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్ప పీడనంతో పొగమంచు దట్టంగా కురిసి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తూ.. మధ్యాహ్నం వరకు సూర్యుడు కనిపించడం లేదు. ఏపీలోని అల్లూరి జిల్లాలో 10, పాడేరులో 12, అరకులోయలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.