భారతీయులు శతాబ్దాల తరబడి విదేశీ దురాక్రమణదారుల పాలనలో నలిగిపోయారు. క్షీణదశలో ఉన్న రాజరిక వ్యవస్థ వారిని ఎదిరించినా ఫలితం లేకపోయింది. దేశ పౌరుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా హరించుకుపోయాయి. ఎక్కడికక్కడ దేశభక్తులు వారిని ప్రతిఘటించినా కష్టనష్టాలనే చవిచూడవలసి వచ్చింది. చివరకు ఆసేతు శీతాచలం ఒకటై బ్రిటిష్ ప్రభుత్వాన్ని గద్దెదించింది. ఈ స్వాతంత్ర్ సమరంలో ఎందరో దేశభక్తులు తమ ధన, మాన ప్రాణాలను త్యాగం చేశారు. గాంధీ మహాత్ముని సత్యాగ్రహ సిద్ధాంతమే చివరకు విజయమూలమైనా, ఈలోగా అనూహ్యంగా రక్తపాతం జరిగింది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అలా స్వాతంత్ర్య సమరంలో సర్వస్వం కోల్పోయిన వారిని గుర్తుకు తెస్తూ, మనిషి పరోపకార సారీణతతో నీతియుక్తంగా జీవించడం ఎంత దుర్భరమైనదో తెలియజేసే కవిత ‘మసి’ని. ఇది అభ్యుదయ కవి రచించిన ‘డమరుధ్వని’ కవితా సంపుటి లోనిది.
‘స్వాతంత్ర సవనాగ్ని కుండంలో
రక్తాజ్యాన్ని ధార పోసినా
విశాల భారతావనిలో
నిలువ నీడలేని దేశభక్తుణ్ణి నేను’
స్వతంత్ర సమరం ఒక యజ్ఞం అయితే దేశభక్తులు ఆ యజ్ఞకుండంలో తమ రక్తాన్నే ఆజ్యంగా ధారపోశారు. కానీ యజ్ఞం పరిసమాప్తమైన తరువాత ‘యజ్ఞఫలం’ మాత్రం ప్రజలకు దక్కలేదంటున్నాడు కవి. ముఖ్యంగా త్యాగం చేసిన దేశభక్తులు కుటుంబాలతో సహా బ్రతుకుతెరువులు కోల్పోయారు. అంతటి దేశభక్తులకు ఈ విశాల భారతావనిలో నిలువ నీడలేక పోయిందటున్నాడు కవి. అంటే తలదాచుకోవడానికి చోటులేక వీధిన పడిన వారందెరో ఉన్నారు. అంటే పరిపాలన చక్కబడిన తరువాత స్వతంత్ర సమరయోధుల గురించి, వారి కుటుంబాల గురించి పటిష్టమైన సంక్షేమ చర్యలను తీసుకోక వారిని ప్రభుత్వం గాలికి వదిలివేసిందని కవి భావం. తాను వారిలో ఒకణ్ణి అంటున్నాడు. ఈ కవిత అప్పటికి స్వాతంత్ర్యం సిద్ధించి పాతికేళ్లు కావస్తున్న సందర్భంగా రాసినది.
‘ఉద్యమాల ముందు నడచి
ఉక్కుగుళ్ళకు బలియైన
విప్లవకారుణ్ణి నేను’
అలాగే ప్రజలకు న్యాయం చెయ్యాలనే తపనతో ఉద్యమాల్లో పాల్గొని తూటాలకు బలియై పోయిన విప్లవకారుల్లో తానొకడిని అంటున్నాడు. స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణా విమోచనోద్యమం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం, ఆంధ్రోద్యమం మొదలైనవి అలాంటి వాటిలో కొన్ని. దశాబ్దం కిందట జరిగిన తెలంగాణా ఉద్యమం మనమెరిగినదే!
‘కర్మాగారాల దుర్మార్గాలను ఖండించబోయి
గండ్రగొడ్డలి నెత్తినెత్తుకున్న కార్మికుణ్ణి నేను’
ఒక వ్యక్తి భూమీపుట్టా లేక బ్రతుకుతెరువు కోసం ఫ్యాక్టరీలో కార్మికుడిగా చేరతాడు. అక్కడ తనలాంటి వేలమంది శ్రామికుల చేత ఒంట్లో శక్తినంతా పిండుకుని శ్రమకు తగిన ప్రతిఫలం యాజమాన్యం ఇచ్చేవారు కాదు. ఒళ్ళుగుల్లయినా కుటుంబానికి కడుపునిండా తిండి పెట్టలేక పోవడమే కాదు బట్టాపాత, మందూమాకు, పిల్లల చదువూసామూ మొదలైన కనీస అవసరాలు కూడా తీరేవికావు. పెట్టుబడిదారులు మాత్రం లక్షలూకోట్లూ గడించి విలాసవంతమైన జీవితాలు గడిపేవారు. ఈ శ్రమదోపిడీని అరికట్టడానికి కార్మికులు సమ్మె చేస్తే, యాజమాన్యాలు కుట్రలు పన్ని వాళ్ళను అంతం చెయ్యడానికి ప్రయత్నించేవి. అలా దెబ్బతిన్న శ్రామికుల్లో నేనొకడ్ని అంటున్నాడు కష్టజీవి. ప్రభుత్వం మాత్రం ప్రజలకు న్యాయం చెయ్యకపోగా, పెట్టుబడిదారుల పక్షాన కొమ్ము కాయడం నాడూనేడూ చూస్తున్నాం.
‘కళాశాలల కుటిల రాజకీయాల
ఉక్కుపాదాల క్రింద నలిగిపోయిన విద్యార్థిని నేను’
ఈనాడు ర్యాగింగుల వల్ల అనేకమంది విద్యార్థినీ విద్యార్థులు నష్టపోవడం మనం చూస్తున్నాం. అలాగే ఆనాడు కొన్ని విద్యాసంస్థల్లో కరడుగట్టిన కులమత బేధములు వికటాట్టహాసం చేసేవి. బయటికి కనిపించని అంతర్గత సంఘర్షణలతో కొందరు విద్యార్థుల జీవితాలు నాశనమైన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి కుటిల వాతావరణంలో నలిగిపోయిన వాళ్ళలో తానొకడిని అంటున్నాడు.
‘నీతి నియమాలకు తలవంచి
అధఃపాతాళానికి త్రొక్కబడిన బలీంద్రుణ్ణి నేను’
ఇక జీవన స్రవంతిలోకి వస్తే సమాజంలో చాలా మంది నీతియుక్తంగానే జీవించాలని కోరుకుంటారు. కానీ ఎవరూ నీతిబాహ్యులు కావాలని కోరుకోరు. కాని కొన్ని ప్రయోజనాలను కోల్పోవలసి వచ్చినప్పుడు కొందరు ఏ ఎండకాగొడుగు పడతారు. లేకపోతే కష్టాలు మూట కట్టుకోవలసి వస్తుంది. కాని కొంతమంది ఎంత లేమిలో ఉన్నా తమ జీవనశైలిని మార్చుకోవడానికి ఇష్టపడరు. నియమబద్ధంగా జీవించడం వల్ల కలిగిన తృప్తితోనే వాళ్ళు జీవిస్తారు. ఐతే అన్ని సందర్భాల్లోనూ ఆ పద్ధతి సరిపడదు. అలాంటప్పుడు తమ స్వప్రయోజనాలనే బలిపెడతారు తప్ప నీతినియమాలను ఉల్లంఘించరు. అలా నీతికి నిలబడటం వల్ల చాలా కుటుంబాలు పతనమైపోయిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఒక పురాణ పురుషుడైన బలిచక్రవర్తిని ఉదాహరణగా చెబుతున్నాడు. వామనుడు మాయోపాయంతో బలిచక్రవర్తిని మూడు అడుగుల నేల అడిగి ముల్లోకాలను ఆక్రమించుకొనడమే కాక బలి నెత్తిన కాలుమోపి అధఃపాతాళానికి తొక్కిన విషయం అందరికీ తెలిసినదే! కవి ఇక్కడ ‘తలవంచి’ అనే పదం ప్రయోగించాడు. అంటే మాటకు కట్టుబడి అని అర్థం. తలవంచకపోతే విష్ణుమూర్తి అంతటివాడు కూడా ఏమీ చెయ్యలేడు. ‘తలవంచి’ అనే పదం కవి ఎంత సాభిప్రాయంగా ప్రయోగించాడో కదా! ఈ పదం సందర్భానికి సరిపోయినంతగా మరెక్కడా అతకదేమో కదా!
‘నిప్పులాంటి నిజాన్ని కౌగిలించుకొని
నిలువునా బూడిదైన వాణ్ణి నేను’
నిజం నిప్పులాంటిది అని లోకోక్తి. అంటే సత్యాన్ని ఆచరించడం చాలా కష్టతరమైన పని అని అర్థం. జీవితాంతం నిజాన్ని నమ్ముకుని బ్రతకడం ముళ్ళబాటలో ప్రయాణించడం లాంటిదే! ఈ ఆదర్శ పురుషుడు తాను నాశనమైనా సత్యాన్ని వదల లేదంటాడు. ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు’ అనే పంథాలో చాలామంది జీవితాలు గడిపేస్తుంటారు. ఈ ధోరణి సమాజానికి ఎంతమాత్రమూ మేలు చెయ్యదు కదా! దీనివల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరిగే నష్టం అనుభవైకవేద్యమే!
‘నేను కోరిన నవతా స్రవంతిలోనే
మునిగిపోయిన వాణ్ణి నేను’
ఆదర్శవంతుడైన వ్యక్తి సామ్యవాదంతో కూడిన నవలోకాన్ని కాంక్షిస్తాడు. అది కేవలం ఆకాంక్షలతో సాధ్యమయ్యే పనికాదు. దానికోసం సమాజంలోని అందరూ, అన్ని శక్తులూ ఏకమై పూనుకున్ననాడే సాధ్యపడుతుంది. అది మరో పెద్ద విప్లవానికో, ఉద్యమానికో, సంఘర్షణకో దారితీస్తుంది. ఆ విజయసాధనలో ఎందరో త్యాగశీలురైన ఉద్యమకారులు బలియైపోతారు. అందుకే తాను ఆశించిన నవతా స్రవంతిలోనే మునిగిపోయానంటున్నాడు.
‘నేను వెలిగించిన చైతన్య జ్యోతిలోనే
మలమల మాడిపోయిన శలభాన్ని నేను’
ఆకలి, శోకం, బానిసత్వం, పరాధీనత, భయం, అభద్రతాభావం, అశాంతి అనే చీకట్లు సమాజంలో నలుదెసలా అలముకొని ఉన్నాయి. నాగరికత అనే ముసుగులో ఇవన్నీ కప్పబడి ఉన్నాయి. సభ్యసమాజం చూసీచూడనట్లు నటిస్తోంది. ఈ భయానక పరిస్థితి నుండి జాతిని విముక్తం చేసేందుకు ఆదర్శపురుషులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాని అలాంటి ప్రయత్నంలో ఆదర్శమూర్తి తాను వెలిగించిన ఆ చైతన్య జ్యోతిలోనే శలభంలా మాడి మసైపోయానంటున్నాడు. కాబట్టే-
‘ఇప్పుడు నేను ‘మనిసి’ని కాను
‘మసి’ని!’
అని అంటున్నాడు. ఆదర్శ పురుషుడు ఒక దేశభక్తుడుగా, విప్లవకారుడుగా, విద్యార్థిగా, నీతి నిజాయితీపరుడుగా, సమాజంలో అంతటా అన్నింటా తానై గోచరిస్తాడు. అతని జీవన వైఫల్యం అన్ని రంగాల్లోనూ దృగ్గోచరమౌతుంది. సర్వే సర్వత్రా ఇలాంటి సగటు మానవుల సమాహారమే సమాజం విశ్వరూపం. భౌగోళిక చిత్రపటం. ఈ సామాజిక చిత్రపటాన్ని సాదాగా కనబడే ఒక పేజీ కవితలో మన కళ్ళకు కట్టించిన అభ్యుదయ కవి ‘సీరపాణి’ అభినందనీయుడు.
పిల్లా తిరుపతిరావు…7095184846