Bihar Accident: బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే పూజలు చేస్తున్న వారిపైకి ఓ ట్రక్కు అదుపుతప్పు దూసుకెళ్లడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వైశాలి జిల్లా దేశారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాజీపూర్-మహనార్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రహదారి పక్కన ఉన్న ఆలయంలో ఆదివారం సాయంత్రం గ్రామస్తులు పూజలు నిర్వహించారు.
కొంతమంది ఆలయం బయట ఉండే రావిచెట్టుకి పూజలు చేస్తుండగా అదుపుతప్పిన ట్రక్కు వారిపైకి దూసుకొచ్చింది. మృతిచెందిన 12 మందిలో నలుగురు చిన్నారులు కాగా 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో యువకుడి మృతదేహం ట్రక్కు ముందు బంపర్‌లో ఇరుక్కుపోగా.. డ్రైవర్ కూడా క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అర్థరాత్రి గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి వీరిని బయటకు తీశారు. క్షతగాత్రులను హాజీపూర్ సదర్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఆదివారం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోడీ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు పీఎంఓ ట్వీట్ చేసింది. ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.