బెంగళూరుకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికను పరిశీలించిన వారికి ఓ ఒళ్లు గగుర్పొడిచే దారుణం కళ్లకు కడుతుంది. గత ఏడాది ఈ నగరంలో ఆరు యాసిడ్ దాడుల కేసులు చోటు చేసుకున్నాయి. ఈ జిగుప్సాకరమైన, హేయమైన నేరం విషయంలో బెంగళూరు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్టు రికార్డులు తెలియజేస్తున్నాయి. ఒక్క యాసిడ్ దాడి విషయంలోనే కాదు, మహిళలకు సంబంధించిన నేరాల విషయంలో కూడా బెంగళూరు అగ్రస్థానంలోనే ఉన్నట్టు గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. మహిళల పట్ల నేరాల విషయంలో బెంగళూరు మూడవ స్థానంలో ఉంది. 2022లో ఈ నగరంలో మహిళ లకు సంబంధించి మొత్తం 3,924 కేసులు నమోదయ్యాయి. ఇక 14,158 కేసులతో ఢిల్లీ నగరం, 6,129 కేసులతో ముంబై మొదటి ఒకటి, రెండు స్థానాలను ఆక్రమించాయి. దేశం లో ఈ మూడు నగరాలు మహిళలకు అత్యంత ప్రమాదకర ప్రదేశాలుగా ప్రస్తుతం గుర్తింపు పొందాయి. మహిళలు బాగా తేలికైన లక్ష్యాలుగా కనిపిస్తున్నారు. 2022లో దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించిన నేరాలు 4,45,226కు చేరుకున్నట్టు క్రైమ్ రికార్డులు తమ తాజా నివేదికలో తెలియజేశాయి. ఇది అంతకు ముందు సంవత్సరం కన్నా నాలుగు శాతం ఎక్కువ. అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, దాడులు, అపహరణలు మహిళలపై నేరాలకు సంబంధించిన జాబితాలో చేరతాయి. దేశవ్యాప్తంగా ఏటా మహిళలపై 200 వరకూ యాసిడ్ దాడులు జరుగుతున్నట్టు అంచనా.
యాసిడ్ దాడి అనేది నేరాల్లో కెల్లా ఘోరమైన నేరం. ఏమాత్రం ఊహించని, ఏమాత్రం అనుమా నించని మహిళ మీద హఠాత్తుగా యాసిడ్ చిమ్మడం ఎంత దారుణ నేరమో ఊహిం చడానికి కూడా కష్టమే. సాధారణంగా యాసిడ్ విసిరే వ్యక్తి పురుషుడే అయి ఉంటాడు. బాధితులు మహిళలే అయి ఉంటారు. పగ తీర్చుకోవడమే ఉద్దేశమై ఉంటుంది. ఇందుకు కారణం ప్రేమించడం కావచ్చు, ఆస్తి వివాదం కావచ్చు, వరకట్న సమస్య కావచ్చు, కుటుంబ సంబంధమైన లైంగిక దాడి కావచ్చు, ‘గుణపాఠం చెప్పడం’ కావచ్చు. మొత్తం మీద ఈ దాడి తర్వాత బాధితురాలు జీవితాంతం శారీరకంగా, మానసికంగా బాధపడుతూ ఉంటుంది. ఇక న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాటం సాగిస్తూ ఉండాలి. ఇటువంటి కేసు తేలి, నిందితుడికి అయిదేళ్ల నుంచి పదేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది కానీ, శిక్షపడే అవకాశాలు, శిక్షపడిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ.
ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే, అతి తేలికగా యాసిడ్ సీసా దొరకడం. నేరుగా మార్కెట్లో కొనుక్కోవచ్చు. ఆన్ లైన్ లో తెప్పించుకోవచ్చు. యాసిడ్ సీసాలను దుకాణాల్లో అమ్మడాన్ని సుప్రీంకోర్టు 2013లో నిషేధించింది. కొంతమంది ఎంపిక చేసిన చిల్లర దుకాణ దార్లకు మాత్రమే యాసిడ్ అమ్మడానికి లైసెన్సులు జారీ చేయాలని అది అధికారులను ఆదేశించింది. అంటే, యాసిడ్ కొనేవారు తప్పనిసరిగా తమ చిరునామాలను, ఫోటోతో సహా చిరునామాకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఎటువంటి గుర్తింపు పత్రమూ లేకుండా దుకాణాల నుంచి తేలికగా యాసిడ్ సీసా కొనుక్కోవచ్చని ఈ మధ్య ఒక సినిమాలో కూడా చూపించడం జరిగింది. ఆన్ లైన్‌లో తెప్పించుకున్నప్పుడు చిరునామా తెలిసే అవకాశం ఉంది కానీ, కొన్న వ్యక్తి తెలిసే అవకాశం లేదు. నిర్భయ దుర్ఘటన జరిగిన తర్వాత, జస్టిస్ వర్మ కమిటీ నివేదిక అందిన తర్వాత 2013లో కేంద్ర ప్రభుత్వం యాసిడ్ దాడిని ఒక ప్రత్యేక నేరంగా పరిగణించి, పదేళ్ల కఠిన కారాగార శిక్ష లేదా జీవిత ఖైదును విధించడానికి అవకాశం కల్పిస్తూ ఒక చట్టం చేసింది. ప్రభుత్వం ఈ విధంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ యాసిడ్ దాడులకు మాత్రం తెర పడడం లేదు. అక్రమంగా యాసిడ్ అమ్మేవారిపై దాడులు జరపడం దగ్గర నుంచి, కఠిన శిక్షలు విధించే వరకూ పోలీసులు, ప్రభుత్వ అధికారులు, న్యాయస్థానాలు సమన్వయంతో వ్యవహరించి, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంటుంది.
Acid attacks: దేశంలో యాసిడ్ దాడుల వెల్లువ
యాసిడ్ కొనేవారు ఫోటోతో సహా చిరునామాకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలివ్వాలి