Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్BRS flop: విర్రవీగకండీ-పగబడుతరు

BRS flop: విర్రవీగకండీ-పగబడుతరు

ప్రజా తీర్పు సిరసావహించాలి

తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజాతీర్పు పాలక బి.ఆర్. ఎస్ ను ప్రతిపక్షానికే పరిమితం చేసింది. అధికార పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టడం జరిగింది. ఈ ప్రజా తీర్పు పరిణామాలను విశ్లేషిద్దాం..

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలక భూమిక పోషించి రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా టిఆర్ఎస్ కు రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెట్టారు. అలా ఆ పార్టీ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ముందుంచినప్పటికీ, ప్రజల తీర్పు కాంగ్రెస్ను వరించడంతో బి.ఆర్.ఎస్ అంతర్మథనంలో పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించింది. ఆ తర్వాత ఉద్యమ పార్టీని, రాజకీయ పార్టీగా మార్చడం జరిగింది. పాలన చేపట్టిన తొలినాళ్లలోనే ప్రభుత్వ యంత్రాంగాన్ని రాష్ట్రస్థాయిలో పురమాయించి ఒకేరోజు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో తెలంగాణలోని వివిధ సామాజిక వర్గాల వారీగా జనాభా వారీగా ఆర్థిక, సామాజిక స్థితిగతులు తదితర వివరాలను సేకరించింది. ఆ తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి, సంక్షేమం సమంగా కొనసాగిస్తూ ముందుకు సాగింది. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీల నాయకులను అభివృద్ధి పేరుతో తమ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. అలా ప్రధాన పార్టీ నాయకులను చేర్చుకొని రాజకీయ శూన్యతకు, ప్రత్యర్థి పార్టీలను బలహీనపరచడానికి పూనుకున్నాడు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు అనైతిక విధానాలకు బలైనవే!. ఆ తర్వాత అక్కడక్కడ అప్రజాస్వామిక చర్యలను విభేదించే, ప్రశ్నించే పత్రికలకు, ప్రజాసంఘాలకు నిర్బంధం విధించి ప్రశ్నించే స్వేచ్ఛకు విఘాతం కలిగించారు. పాలకవర్గం చర్యలను భరించలేని నాయకులు, కళాలు, గళాలు ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గడం జరిగింది. రాష్ట్రంలో ధర్నాలు, నిరసనలు కనిపించకుండా, వినిపించరాదనే భావనతో ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తివేశారు. అలా కార్పొరేట్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాను నియంత్రిస్తూ అధికార దర్పంతో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడికి అక్కడ కానరాకుండా నయానో, భయానో మేనేజ్ చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమానికి పురికొల్పిన అంశాలను పరిశీలిద్దాం..నీరు, నిధులు, నియామకాలు ఈ మూడింటిలో తాగునీరు, సాగునీరు విషయంలో పురోగతి సాధించినప్పటికీ, ఎక్కువ నిధులు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేయడం జరిగింది. తీరా ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టు కృంగిపోవడంతో, ప్రతిపక్షాల విమర్శలతో ప్రజల్లో ఇంతకు ముందున్న భావనకు బలం చేకూరినట్లు అయింది. ఇలా సాగునీరు, తాగునీరు పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నిధులు అన్యాక్రాంతమైనట్లు ప్రజలు భావిస్తుండంతోనే ఈ వ్యతిరేకతకు దారితీసినట్లు విశ్లేషకుల అభిప్రాయం. నిధులు అనేక సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకుగా మార్చుకున్నారనే అపవాదు నేడు నిజమని ప్రజలు భావించడం కనిపిస్తుంది. రైతుబంధు, బీసీ బంధు, ఎస్సీ బంధు, పెన్షన్లు, డబుల్ బెడ్ రూములు, మన ఊరు మనబడి ఇలా అనేక పథకాలు ఆరంభించి నిధుల కొరతతో కొద్ది మందికి అందివ్వడం అది కూడా వారి పార్టీ క్యాడర్ కు ఇవ్వడంతో ప్రజల్లో వ్యతిరేకత పైకి కనిపించకుండా ఒక్కసారిగా ఓటు ద్వారా వ్యక్తమైంది. నాయకులు నియోజకవర్గంలో భూదందా చేయడం ధరణితో రైతుబంధు పొందుటకు ఒకరి భూమిని ఇంకొకరికి మార్చడం వల్ల లబ్ధిని పొందడం జరిగింది. రైతుబంధుకు నిర్దిష్టత లేకపోవడంతో ఈ పథకం ద్వారా పేదలకన్న ధనవంతులే ఎక్కువ లబ్ధి పొందడం లాంటి వాస్తవాలను ప్రజలు ఆలస్యంగా గుర్తించారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో పెరిగిపోయింది. మద్య విధానం మీద ఉన్న శ్రద్ధ.. విద్య, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగం, తదితర రంగాలపై లేకపోవడం గ్రహించారు. పరిశ్రమల పేరుతో ఎన్నో ప్రభుత్వ భూములను ఉచితంగా ఇవ్వడం, ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వ భూములు అమ్మడం లాంటి చర్యలు ప్రజలను పునరాలోచించేలా చేశాయి. ప్రచారానికి అక్కడికక్కడ కొన్ని వైద్య, విద్యా కళాశాలలను చూపి ప్రచారం పొందినప్పటికీ, రాష్ట్రంలో చాలా చోట్ల విద్యా, వైద్యం మౌలిక వసతులు లేక సిబ్బంది కొరతతో కనీసం పారిశుద్ధ్య కార్మికులు లేక దుర్భరస్థితిలో కొనసాగుతుందని తన మనుమడే స్పందించిన తీరుతో అర్థమవుతుంది.

నియామకాలు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షలాది ఉద్యోగాలు మన నిరుద్యోగులకు దక్కుతాయనే ఆశలు కల్పించడంతో ఉద్యమ కాలంలో నిరుద్యోగ యువత ఆకర్షితులై కాలేజీలను, యూనివర్సిటీలను వదిలి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాన్ని పణంగా పెట్టి పాల్గొని ఉద్యమానికి స్ఫూర్తిని నింపారు. అలా శ్రీకాంతాచారి లాంటి ఎంతో మంది ఉద్యమకారులు అమరులైనారు. ఆ క్రమంలో ఎన్నికల్లో ఉద్యమ పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి చదువులు మానేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం యువకులు, విద్యార్థులు మేధావులు ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ తీరా పదేళ్ల ఆత్మగౌరవ పాలనలో నియమకాలు జరగకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని అమలు చేయకపోవడం చూసిన నిరుద్యోగుల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోయింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రాకపోవడం, వచ్చినవి.. పరీక్షలు వాయిదా వేయడం లేదా రద్దు చేయడం జరిగింది. ఇలా నిరుద్యోగ యువత విలువైన జీవితాలతో చెలగాటమాడడం ఆత్మగౌరవపాలనలో జరిగింది. టీఎస్పీఎస్సీ పరీక్షలలో అవకతవకలు జరగడం చూసిన నిరుద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఆకాశాన్నంటింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిధులు మనకే, మన నియమకాలు మనవే అన్న ఆశలు ఆవిరైపోవడంతో అమరుల త్యాగాలు రాజకీయ నాయకుల లబ్ధి కోసమో, ముఖ్యమంత్రి పదవుల కోసమో! మంత్రి పదవుల కోసమేనా .. అని ఆలోచనలో పడ్డారు యువత. రాజకీయ ఖాళీలను భర్తీ చేసినంత టైం బాండ్ తో నిరుద్యోగుల నియామకాలు చేయక పోవడం చూసినారు. నిరుద్యోగుల ఆత్మహత్యలతో కూడా ఆత్మగౌరవ పాలకుల్లో కదలిక లేకపోవడంతో వ్యతిరేకత అంతకంతకు పెరిగిపోయింది.

ప్రభుత్వ ఉద్యోగులు ..

ఉద్యోగులు ఉద్యమ కాలంలో ఉద్యమ పార్టీ బలపడడానికి చేతనైన సహాయం చేశారు. సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె లాంటి అనేక ఉద్యమాలకు ఊపిరి పోశారు. మా ప్రభుత్వం వస్తే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పలికి దేశంలోనే ఎక్కువగా వేతనాలు పెంచుతామని నమ్మబలికినారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల నుండి వేరు చేసి దేశంలోనే ఎక్కువ జీతాలు ఇస్తున్నామనే ప్రచారానికి తెరలేపారు, వాస్తవంగా పెంచడం కాదు కదా.. గతంలోని ఉద్యోగుల హక్కులను హరిస్తూ క్రమేపి వారి సమస్యలు గుట్టలుగా పెరిగినయి తప్ప ఏ ఒక్కటి ఈ ప్రభుత్వం పరిష్కరించిన పాపాన పోలేదు. పైగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ పేరుతో కొద్దిమంది సంఘ నాయకులను చేరదీసుకొని వారికి పదవుల ఆశలు కల్పించి ఉద్యోగులను మోసం చేశారు. కనీసం కరువు భత్యం కూడా ఇవ్వలేని స్థితి. అధికార వికేంద్రీకరణ పేరుతో జిల్లాలు, మండలాలు పెంచి నియామకాలు లేకపోవడంతో ఒత్తిడిలో ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి వస్తుంది వాస్తవం కాదా!. అంతేకాకుండా గత ప్రభుత్వాల కాలంలో మొదటి తారీఖున వేతనాలు, ప్రతి ఆరు నెలలకోసారి డీఏ, ఐదేళ్లకోసారి పిఆర్సీ ఇచ్చే సంస్కృతికి విఘాతం కలిగించారు. ఆర్థికంగా ఉద్యోగులను నష్టపరచడం జరిగింది. ఒకటో తారీకు కాదు కదా.. 15వ తారీకు కూడా వేతనాలు పడని దుర్భర స్థితికి నెట్టి వేయబడ్డది మన ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకు రుణాలు కట్టలేక వారి పరపతి దెబ్బతిని కుటుంబంలో సమాజంలో కక్కలేక మింగలేక జీవితాలను గడుపుతున్నారు. అలా వారి బాధను చెప్పడానికి ప్రగతి భవన్ లో అవకాశం కల్పించకుండా తను ఏకాసామ్య పద్ధతిలో ప్రజా సమస్యలను కూడా పరిష్కరించకపోవడంతో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి వ్యతిరేకతను చాటినారు. అంతేకాదు! టీఎస్ ఆర్టీసీ కార్మికులు పోరాటం చేసినప్పుడు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా ప్రయాణికులను,కార్మికులను ఎన్నో అవస్తలపాలు చేశారు. సమస్యలు పరిష్కరించకుండా ఎగతాళి చేసినాడు. వారి అవసరం కోసం ప్రభుత్వంలో కలిపాడు. అందులో కూడా వాటి ఆస్తులపై కన్ను పడిందని ప్రతిపక్షాల వాదన కూడా ఉంది.

తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూనే ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ ను ఆ తర్వాత జాతీయ స్థాయిలో బీ.ఆర్.ఎస్ గా మార్చడం, జాతీయ రాజకీయాలంటూ రాష్ట్ర పాలన గాలికి వదిలేసి దేశం చుట్టి రావడం చూశాం. గతంలో కొండగట్టు ప్రమాదంలో మరణించిన వారిని కనీసం మానవీయ కోణంలో అయినా పరామర్శించక పోవడం, రాష్ట్ర ప్రజలను కలవకపోవడం, రైతు రుణమాఫీ చేయకపోవడంతో రైతు ఆత్మహత్యలు జరిగినా చలించలేదు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడం టి.ఆర్.ఎస్ పార్టీ విస్తరణకు ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం.. ఇదంతా ప్రజలు గమనించడం జరిగింది. ప్రధాని అధికారిక పర్యటనకు రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ మేరకు వారికి స్వాగతం పలకకపోవడం, దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న ఉద్యమ కాలం నాటి మాట నిలుపుకోకపోవడం, లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేస్తారనే రాజకీయ పరిణామాలకు తలొగ్గి మళ్లీ ప్రధానిని ప్రాధేయపడడం, ఇలా ఒక్క మాట మీద నిలబడకుండా ద్వంద్వ విధానాలు పాటించడాన్ని ప్రజలు లేటుగా గుర్తించడం జరిగింది. ఉద్యమ పార్టీలో కుటుంబ పాత్ర పెరిగిపోయింది. వ్యక్తి ఆరాధన పెరిగిపోయింది. ఎంతటి వ్యక్తినైనా విమర్శించడం.. అవసరం కోసం ఆ వెంటనే ప్రాధేయపడడం గమనార్హం. ప్రధానంగా ఉద్యమ కాలంలో పని చేసిన నాయకులకు పొగబెట్టి బయటికి వెళ్ళగొట్టడం, ఉద్యమాన్ని అణచివేసిన నాయకులను మంత్రులుగా చేయడం.. ఇలా అనేక తప్పుల మీద తప్పులు చేస్తూ అధికారం ఎల్లకాలం ఉండదనే వాస్తవాన్ని విస్మరించి వారి ఒక్కరి సొంతం అన్నట్లుగా వ్యవరించారు. వారి చుట్టూ ఒక భజన సంఘం (కోటరి )ఆహా.. ఓహో అంటూ వ్యతిరేకతను కనిపించకుండా చేశారు. ప్రజలు అన్ని పార్టీల సభలకు అధిక సంఖ్యలో హాజరైనట్టే.. రాష్ట్రాన్ని తెచ్చిన మన్న పార్టీకి ఓటుతో పదేళ్లు అధికారం ఇచ్చాం. ఇక చాలు.. మీ వ్యవహారం బాగాలేదు.

మార్పు కోసం.. ఇచ్చామంటున్న పార్టీ నాయకులకు ఒక్క అవకాశం ఇవ్వండని అభ్యర్థించినా కాంగ్రెస్ కు మరో అవకాశం ఇచ్చారని విశ్లేషకులు ప్రజాతీర్పును విశ్లేషిస్తున్నారు. ప్రజల విజ్ఞత, చైతన్యం గమనించి అధికార దర్పం ప్రదర్శించకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య పాలన అందించి ప్రజల హక్కులను, స్వేచ్ఛను పరిరక్షిస్తూ పాలన సాగించాలి. లేదంటే అధికారాన్ని ఇచ్చేదీ..అహంకారం తలకెక్కుతే అదఃపాతాళానికి నొక్కేది ప్రజలే చరిత్ర నిర్మాతలు ముమ్మాటికీ ప్రజలే అని గమనించండి.
మేకిరి దామోదర్, సామాజిక విశ్లేషకులు, వరంగల్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News