భారతదేశంలో అవినీతి అన్ని రంగాల్లో అన్ని రకాల సేవల్లో పేరుకుపోయింది. రేషన్ కార్డ్ పొందడం నుండి పరిశ్రమల స్థాపన వరకు చిన్న చిన్న పనులు చేసే కాంట్రాక్టర్లకు పనులు జరుగాలంటే అవినీతి ఒక సాధనం అయ్యింది. ప్రభుత్వ సేవలు అందించే ఉద్యోగులు సేవలు పొందే ప్రజల మధ్య అవినీతి రాజ్యమేలుతుంది. ప్రభుత్వం ఉచితంగా అందించే విద్య ‘వైద్య ‘సేవల్లో లంచం ఇవ్వందే పనులు జరగని స్థితి నెలకొన్నది.
అవినీతికి పాల్పడిన అధికారులను శిక్షించే చట్టాలు ఉన్నప్పటికీ ‘హెచ్చరికలు చేసినప్పటికీ సమాజంలో అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. అవినీతి అధికారం ఒకే నాణానికి (బొమ్మ బొరుసుగా) రెండు ముఖాలుగా మారిపోయాయి.
అవినీతిపై అవగాహన చైతన్యం కలిగించడానికి అవినీతిని ఎదిరించి ఎలా పోరాడాలి అనే విషయాలపై అవగాహన కల్పించడానికి నిర్దేశించేది అంతర్జాతీయ అవినీతి వ్యతిరేఖ దినోత్సవం. దీనిని ప్రపంచమంతా జరుపుతారు. అవినీతి వల్ల జరుగుతున్న పరిణామాలు అవినీతిని అరికట్టడానికి ఉన్న చట్టాల మీద అవగాహన ‘తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 2003లో ఐరాస అక్టోబర్ 31న నిర్వహించిన అవినీతి వ్యతిరేక సదస్సులో ప్రతి ఏడాది డిసెంబర్ 9తేది నాడు ప్రపంచ వ్యాప్తంగా అవినీతి వ్యతిరేక దినోత్సవం జరపాలని నిర్ణయించారు.
అవినీతి _ పేదరికం
ప్రపంచంలో అవినీతి లేని దేశం, రంగం లేదంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. ప్రపంచమంతా అవినీతి మయమైంది. అవినీతి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్లలాగ పరిణమించింది. పేదల అభివృద్ధి కొరకు అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలు లబ్ధిదారులకు అందని స్థితి నెలకొన్నది. పేదల అభివృద్ధి కొరకు అమలు చేసిన అభివృద్ధి పథకాలలో అవినీతి చోటు చేసుకోవడం వల్ల వారి స్థితిగతులను మార్చడానికి చేపట్టిన చర్యలు ‘పథకాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పేదలు మరింత పేదరికంలోకి నెట్టివేయబడి పేదలు నిరుపేదలౌతున్నారు.
పేదవర్గాల జీవన ప్రమాణాలు కొనుగోలు శక్తి పెరుగక “సామాన్యుని సాధికారిత” కలగానే మిగిలిపోయింది. అవినీతి నిర్మూలనకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎన్జీఓలు స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా అవినీతి వ్యతిరేక పోరాటాలు చేసినప్పటికీ అవినీతిపై ప్రజలకు అవగాహాన కలిపించే ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ ప్రజల అవసరాల ముందు పనిచేయని స్థితి నెలకొన్నది.
అవినీతి భారత్
దేశంలో రాజకీయాలు’ వ్యాపారాలు’ ప్రభుత్వ ఆఫీసులు: ప్రైవేట్ రంగాలు ప్రతి రంగం ప్రతి సేవా డబ్బులు ఇవ్వందే పని జరగని స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ నిధులు ‘పాలసీలు’ పథకాలు అల్లంత దూరాన ఆగిపోతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే పలు అభివృధి సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న స్కాములు (కుంభకోణాలు) అవినీతి అడ్డగా మారి అభివృధిని అడ్డుకుంటుంది.
అవినీతి – గణాంకాలు భారత్
2012_2019 అధ్యయనం ప్రకారం మనదేశం (భారత్) అవినీతి ఎక్కువగా జరుగుతున్న దేశాల జాబితాలో వుంది. చైనాతో పోలిస్తే అభివృద్ధిలో మనదేశం వెనుకబడి ఉన్న అవినీతిలో మాత్రం ముదంజలో వుంది. ప్రపంచంలోనే అవినీతి బాగా ప్రభలిన దేశాలలో భారత దేశం ఉన్నది.
“ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ” అద్యయనం ప్రకారం ప్రభుత్వ ఆఫీసుల్లో పని కావాలంటే పని కోసం 75 శాతం ప్రజలు లంచాలు చెల్లించు కోవాల్సి వస్తుందని. 2017 లో ప్రకటించిన ఈ సర్వేలో మన దేశం రాంక్ 94 వుంది.” లంచం ఇవ్వడం పుచ్చుకోవడం నేరాలు” గా పరిగణించే చట్టాలు చుట్టబండలైనాయి. అవినీతికి పాల్పడిన ఉద్యోగిని ఉద్యోగం నుండి తొలగించడమే సరియైన శిక్ష అని సుప్రీమ్ కోర్టు పేర్కొంది. అవినీతి నిర్మూలన చట్టాలు కాగితాలకే పరిమితమైనాయి.
ప్రపంచ అవినీతి సూచిక భారత్
2021లో ప్రపంచ అవినీతి సూచిక ప్రకారం. భారత దేశం ప్రపంచంలో ని 180 దేశాల అవినీతితో పోలిస్తే మనదేశం 85వ స్థానం గత సంవత్సరం 183 దేశాల తోపోలిస్తే 95 వా స్థానం శ్రీలంక 79వ స్థానం’ చైనా 80.వ స్థానం’ డెన్మార్క్ ఫిన్లాండ్’ న్యూజిలాండ్ స్వీడన్ ‘సింగాపుర్ ‘స్విజర్లండ్ ‘ దేశాలు అతి తక్కువ అవినీతి కలిగిన దేశాల జాబితాలో మొదటి 6 స్థానాల్లో ఉన్నాయి.
అవినీతి అభివృధికి అడ్డంకి
భారత దేశంలో మౌలిక వసతుల కల్పనకు ప్రతి యేటా 10 లక్షల కోట్లు రోజుకు 2750 కోట్లు గంటకు రూ”115 కోట్లు నిమిషానికి రూ”1.80కొట్లుఖర్చు పెడుతున్నారు. దాదాపు 9 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు 35 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. 52 కోట్ల మందికి రక్షిత మంచినీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్ల సౌకర్యం లేదు. ప్రతి పథకంలో అవినీతి ప్రభిలిపోయింది. ఎయిడ్స్ మహమ్మారి కన్న.ఎక్కువగ వేగంగావ్యాపిస్తుంది .అదుపు లేని పెనుభూతంగా అవినీతి పెరిగి అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తుంది.
2007 లో ఢిల్లీకి చెందిన “ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ & సెంటర్ ఫర్ మీడియా స్టడీస్” సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో11 ప్రజాసేవా అంశాల్లో ఒదో ఒకదానిని పొందేందుకు మూడు వంతులు మంది నిరుపేదలు ఏడాదికి రూ” 900 కోట్లు చెల్లించినట్లు తేలింది.
2009 లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం భారత దేశం 542 మంది ఎంపిలలో 120 మంది ఎంపిల మీద (నాలుగో వంతు) క్రిమినల్ చార్జీలు ఎదురుకుంటున్నట్లు 2008 లో వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. మనుషులని అక్రమంగా తరలించడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన, రేప్ హత్యలాంటి ఆరోపణలు ఇందులో ఉన్నాయి.1948 నుండి2008 నాటికి దేశం నుండి రూ” 20లక్షల కోట్ల మేరకు డబ్బు అక్రమంగా విదేశాలకు చేరుకున్నట్లు అంచనా.
అవినీతి ప్రభుత్వ రంగ సంస్థలు
భారత దేశంలో ప్రభుత్వ, రంగ సంస్థలు ఆఫీసులు అవినీతికి అడ్డాగా మారినాయి. ప్రజా పనులు రోడ్లు కాలువల తవ్వ కం నీటి వనరులు ఆనకట్టల నిర్మాణం .గిడ్డంగుల నిర్మాణం రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రతి దశలో టెండర్ దశ వరకు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా మారింది. చేసిన పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడం ప్రభుత్వ అధికారులు ‘కాంట్రాక్టర్లు చేతులు కలపడం అవినీతికి పాల్పడటం వల్ల ఫలితంగా రోడ్స్ ‘ప్రభుత్వ భవనాలు ప్రాజెక్టులు ఆనకట్టలు త్వరగా పాడైపోయి. కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది.
మారని ప్రభుత్వ అధికారులు
రవాణా రంగం ‘ఆదాయ పన్ను’ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ ‘ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ‘గనులు ‘కరెంట్ ‘సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ ‘పంచాయతి రాజ్ విభాగాలలో అవినీతి తీవ్ర స్థాయిలో వున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ఇటీవల కాలములో తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అధికారులను పట్టుకుంటున్న అధికారులలో మార్పు రాలేదు. భూమి పత్రాలు ఇవ్వడం పాస్ పుస్తకాలు భూమిసర్వే పనుల్లో అధికారుల చేతులు తడపనిదే పని కావడం లేదు.
అవినీతి నిర్మూలన మార్గాలు
అవినీతి వ్యతిరేకతకు ప్రతి కుటుంబం యూనిట్ కావాలి. నీతి నిజాయితీ మానవీయ విలువలు పాటశాల కళాశాల స్థాయిలో పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలి. విద్యార్థుల్లో యువతలో అవినీతి నిర్మూలన చట్టాల మీద సదస్సులు సమావేశాలు నిర్వహించాలి. నీతి నిజాయితీ చట్టబద్ధ పాలన ‘జవాబుదారీ తనం పాటించిన నిజాయితీ గల ఉద్యోగులకు “అవార్డ్స్” ఇవ్వాలి. అవినీతికి పాల్పడిన అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టిచ్చిన వ్యక్తిని స్వచంద సంస్థలకు ప్రభుత్వం అవార్డ్స్ ఇవ్వాలి. ప్రతి ప్రభుత్వ ‘ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అవినీతి నిర్మూలన మార్గాలమీద సమావేశాలు నిర్వహించాలి. నిర్ణీత కాలవ్యవధిలో ఉద్యోగులు తమ భాధ్యతలు నిర్వహించే పాలనా పరమైన సంస్కరణలు చేపట్టాలి. కేంద్ర స్థాయిలో అవినీతి నిరోధక విభాగం ఏర్పాటు’ లోకాయుక్త అంబుడ్స్మెన్ వ్యవస్థలు సమాచార హక్కు చట్టం ‘సిటిజెన్ చార్టర్ ఏర్పాటు ‘ఫిఫ్త్ పిల్లర్” అనే సంస్థ జీరో రూపీ నోట్లను జారీచేసింది.ఎవరైన లంచం అడిగితే ఈ నోట్లను ఇవ్వాల్సిందిగా సూచించింది. లంచం తీసుకోవడం నేరం అనే హెచ్చరిక ఆ నోట్ల పై ఉంటుంది.
అవినీతి జవాబుదారీతనం
ప్రజలలో ప్రశ్నించే తత్వం పాలకులలో అధికారులలో జవాబుదారితనం పారదార్శనికత పెరిగినపుడు మాత్రమే అవినీతి తగ్గుతుంది. ప్రభుత్వ రంగం సంస్థలు విడుదల చేస్తున్న నిధులు పనితీరును పారదర్శకంగా చూపగలిగితే కొంత మేరకు అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చు. సమాచార హక్కు చట్టం అనేది ప్రతి భారతీయుని చేతిలో ఆయుధం వంటిది దీని ద్వారా సమాచారాన్ని సేకరించి కోర్టులలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడం ద్వారా అవినీతిని బట్ట బయలు చేయవచ్చు. తర్వాత కాలములో అవినీతి తగ్గుముఖం పడుతుంది.
అవినీతి ఎన్నికల సంస్కరణలు
చట్ట సభలకు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నీతి నిజాయితీ పరులకు టికెట్ల ఇచ్చి రాజకీయ రంగములో జరుగుతున్న ధన ప్రాబల్యం అడ్డుకోవాలి. రాజకీయ పార్టీలు అవినీతికి పాల్పడిన అభర్తులకు టికెట్లు ఇవ్వకూడదు. ఎన్నికల సమయములో నోటుకు ఓటు కొనే సంస్కృతిని ఎన్నికల కమిషన్ అడ్డుకోవాలి. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే ఆర్థిక ప్రలోభాలతో ఓటర్లను ఆకర్షించేందుకు చేసే అవినీతి అక్రమ కార్యకలాపాలను నిషేధిస్తూ ఎన్నికల సంస్కరణలు ప్రభుత్వం చేపట్టి అమలు చెయ్యాలి. ప్రజాస్వామ్యంలో ధన స్వాముల ప్రవేశం అడ్డుకోవాలి. అక్రమాలకు అవినీతికి కుంభకోణాల్లో చిక్కుకున్న వారిని అవినీతి ఆరోపణలు వున్న వారు చట్ట సభ సభ్యులుగా ఎన్నిక కావడానికి అనర్హులుగా ప్రకటించాలి.
అవినీతి నేరమయ రాజకీయాలు
నేరమయ చరిత్ర వున్న వ్యక్తులు చట్ట సభలకు ప్రతినిధులుగా పోటీ చేయడాన్ని నిషేధించే చట్టాలను ఎన్నికల సంస్కరణలు ప్రవేశ పెట్టి నీతి వంతులు సమర్థులు ప్రజా ప్రతినిధులు గా ఎన్నికయ్యే వాతావరణం కలిపిస్తే రాజకీయ అవినీతి సాంద్రత తగ్గుతుంది.
అవినీతి డిజిటల్ టెక్నాలజీ
ప్రభుత్వ రంగం’ ప్రైవేట్ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని “డిజిటల్ టెక్నాలజీ” వినియోగించి అవినీతిని అరికట్టేందుకు బహుముఖ చర్యలు తీసుకోవాలి.
అవినీతి వినియోగదారుల చైతన్యం
వస్తు సేవల’ క్రయ విక్రయాలలో వినియోగదారులు తప్పని సరిగా రసీదులు పొంది వినియోగదారులు తమ హక్కుల పరిరక్షణకు పాటుపడాలి. మార్కెట్లో జరుగుతున్న మోసాలను అడ్డుకొని వ్యాపార రంగములో జరుగుతున్న అవినీతి నిర్మూలనలో ప్రతి వ్యక్తి చైతన్య వంతమైన పాత్ర పోషించి అడ్డు అదుపు లేకుండా విస్తరిస్తున్న అవినీతిని అడ్డుకోవాలి.నిరంతర అప్రమత్తత తో అవినీతి అంతానికి పాటుపడాలి.
అవినీతి చట్టాలపై అవగాహన
సమాచార హక్కు చట్టం పట్ల అందరూ అవగాహన పెంచుకొని ప్రజా పనుల్లో జరుగుతున్న అవినీతిని ఎక్కడికక్కడ నిలదీయాలి. అవినీతి నిర్మూలనను ప్రతి పౌరుడు సామాజిక భాద్యతగా స్వీకరించాలి.
‘ “ఎవ్వరో వస్తారని ఎదో చేస్తారని “ఎదిరి చూడకుండా ప్రతి పౌరుడు చైతన్య వంతమై అవినీతి నిర్మూలన లో క్రమశిక్షణ గల సైనుకునిగా పనిచేయాలి” లంచం ఇవ్వడం తీసుకోవడం నేరం” ‘అనే భావన అందరిలో రావాలి.అవినీతి నిర్మూలన చట్టాలపై అవగాహన పెంచుకుందాం. దేశాన్ని ‘రాష్ట్రాన్ని “అవినీతి రహితంగా “మార్చుదాం అవినీతి అక్రమాల మీద ప్రజలను చైతన్య పరుస్తూ ప్రభుత్వం’ పౌరసమాజం’ మహిళా యువత ‘ధార్మిక ‘స్వచ్చంధ సంస్థలు సమిష్టిగా ఉద్యమించి అవినీతి రహిత భారత్ నిర్మాణానికి పునరంకితం మౌధాం. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం. అవినీతి అంతం మన పంతం కావాలి.
అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం అంటే కేవలం అవినీతిని అరికట్టే విధానాలు తెలుసుకొని తర్వాత రోజు మరిచిపోయి మళ్ళీ అవినీతికి పాలుపడకుండ ప్రపంచంలోని ప్రతి దేశ ప్రభుత్వం ‘ప్రతి పౌరుడు అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఉద్యమిస్తే అవినీతి రహిత సమాజం ఆవిర్భవిస్తుంది.
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం 9440245771 హైదరాబాద్