మహానంది పుణ్యక్షేత్రం కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా భక్తజన సంద్రంగా మారింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు మహానందికి తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉంది పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ పరిసరాల్లో కార్తీకదీపాలు వెలిగించారు. భక్తులు మహానందీశ్వర స్వామికి అభిషేకం, కామేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. స్వామివారి ఉచిత దర్శనం భక్తులు, ప్రసాదాల కౌంటర్ల దగ్గర భక్తులు గంటల కొద్ది క్యూలైన్లలో వేచి ఉన్నారు.
భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ఈఓ కాపు చంద్రశేఖర్ రెడ్డి, దేవస్థానం అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహానందికి తరలివచ్చిన భక్తులకు గరుడ నంది దగ్గర దాతలు నాగేశ్వర రెడ్డి, సుధీర్ కుమార్ రెడ్డి, వెంకట శివయ్యలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎ టువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు.