Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Dhiraj Sahu black money: బ్లాక్‌ మనీలో కొత్త రికార్డు

Dhiraj Sahu black money: బ్లాక్‌ మనీలో కొత్త రికార్డు

అన్నీ 500 నోట్లతో 350 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఇంట్లో దాచిన సాహు

ఒరిస్సాలో జార్ఖండ్‌ పార్లమెంట్‌ సభ్యుడు ధీరజ్‌ సాహూ తన డిస్టిలరీలో దాచుకున్న కోట్లాది రూపాయల సొమ్ము చూసినవారెవరికైనా కళ్లు చెదరడం ఖాయం. అల్మేరాలలో కాక, ఎక్కడ పడితే అక్కడ కట్టల కొద్దీ బయటపడుతున్న ఆ కోట్లాది రూపాయల సొమ్మంతా నల్ల ధనమే ననడంలో సందేహం లేదు. వాటికి లెక్కాపత్రం లేదు. ఆదాయ పన్ను కడుతున్న దాఖలాలు కూడా లేవు. ఇప్పటి వరకూ లెక్కపెట్టిన సొమ్ము 300 కోట్ల రూపాయల పైచిలుకే ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయిలో లెక్క తేలాల్సి ఉంది. ఆదాయ పన్ను శాఖ నుంచి అధికారులు తీసుకువచ్చిన ఆరేడు కౌంటింగు మెషీన్లు ప్రస్తుతం రాత్రింబగళ్లు ఈ సొమ్మును లెక్కపెట్టే పనిలో నిమగ్నం అయిఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో నల్ల ధనం పట్టుబడడం అనేది దేశంలో ఇదే మొదటిసారి. 2018లో ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో 160 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఒడిశా వ్యవహారం చెన్నై వ్యవహారాన్ని మించి పోయి కొత్త రికార్డు సృష్టించింది.
సాధారణంగా మద్యం వ్యాపారంలో ఈ విధంగా కోట్లాది రూపాయలు సంపాదించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ, ఒక్క రూపాయి కూడా పన్ను కట్టకుండా ఈ విధంగా డబ్బును భద్రపరచడం మాత్రం కాస్తంత అరుదైన విషయమే. ఇంకా ఆభరణాలను, డాక్యుమెంట్లను పరిశీలించడం ప్రారంభం కాలేదు. ఆ సొమ్మంతా సాహూదేనా లేక ఇంకెవరి సొమ్మయినా ఇందులో ఉందా అన్న విషయం సాహూయే చెప్పాల్సి ఉంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఆదాయ పన్ను ఎగ్గొట్టడానికి ఇలా పారిశ్రామికవేత్తల దగ్గర తమ అక్రమ సంపాదనను దాచుకోవడం సహజంగా జరుగుతున్న వ్యవహారమే. లోక్‌ సభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా దాడులు చేయడం, నల్లధనం పేరుతో కష్టార్జితాన్ని స్వాధీనం చేసుకోవడం సహజమేనని కాంగ్రెస్‌ నాయకత్వం తీవ్రస్థాయి విమర్శలు సాగిస్తోంది. నిజానికి తమకు, ఈ డబ్బుకు సంబంధం ఏమీ లేదని కూడా కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ సొమ్ముకు సంబంధించిన వివరాలను సాహూయే వెల్ల డించాల్సి ఉందని, తమకు ఆయన వ్యవహారాలతో ఎటువంటి సంబంధమూ లేదని పార్టీ సీనియర్‌ నాయకుడు జైరామ్‌ రమేశ్‌ వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం నల్లధనాన్ని పట్టుకోవడమనేది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదని, ఇటువంటి డబ్బు పట్టుబడినప్పుడు దాన్ని ఏదో విధంగా ప్రజలకు చేరవేయడమే జరుగుతుందని వివరణ ఇచ్చారు. అంతేకాదు, తాము ప్రకటించిన గ్యారంటీ లకు ఈ డబ్బు ఖర్చు చేయడం జరుగుతుందని కూడా ఆయన ప్రకటించారు. ఈ డిస్టిలరీ ఒడిశాలో ఉన్నందువల్ల అక్కడి ప్రభుత్వం దీని వ్యవహారాలపై ఒక కన్ను వేసి ఉండాల్సిందని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నల్ల ధన వ్యవహారాలను దృష్టిలో ఉంచుకునే 2016లో నోట్లను రద్దు చేసింది. అది ఎంత వరకు సత్ఫలితాలనిచ్చిందో తెలియదు కానీ, నల్లధనం అనేక విధాలుగా వృద్ధి చెందుతూనే ఉంది. ప్రభుత్వం 2,000 రూపాయల నోట్లను రద్దు చేసినందు వల్ల సాహూ వద్ద ఎక్కువగా 500 నోట్ల కట్టలే ఉండడంతో దీన్ని లెక్కించడం అన్నది కష్టసాధ్యమవుతోంది. 1977లో విద్యార్థి నాయకుడుగా రాజకీయ ప్రవేశం చేసిన సాహూ ఆ తర్వాత వరుసగా మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నికల కమిషన్‌ కు సమర్పించిన అఫిడవిట్‌ లో తనకు, తన కుటుంబానికి ఉన్న ఆస్తిపాస్తుల గురించి ఆయన చాలా తక్కువ చేసి చూపించారు. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్‌ ప్రస్తుతం ఆయనపై గట్టి చర్యలు తీసుకునే ఉద్దేశంలో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News