దాదాపు పుష్కర కాలం క్రితం.. అంటే 2011 మార్చి నెలలో జపాన్‌లో సంభవించిన పెను భూకంపం తాకిడికి అక్కడి ఫుకుషిమాలోని దైచీ అణు విద్యుత్ కర్మాగారం కకావికలైంది. మూడు రియాక్టర్లు దాదాపు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడ అణుధార్మిక జలాలు పెద్ద స్థాయిలో బయటపడ్డాయి. కొన్నేళ్ల పాటు వాటిని పెద్ద పెద్ద ట్యాంకులలో భద్రపరిచిన జపాన్.. ఇటీవలే ఆ జలాలను సముద్రంలో వదిలిపెట్టడం మొదలైంది. వాటిని తాము శుద్ధి చేసినట్లు జపాన్ అధికారులు చెబుతున్నారు గానీ, వాటి దుష్ప్రభావాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా వేల టన్నుల చేపలు చనిపోయి ఉత్తర జపాన్‌లోని సముద్రతీరానికి కొట్టుకొస్తున్నాయి. జలచరాల మరణాలకు రేడియోధార్మిక జలాల విడుదలే కారణమన్న వాదనలు పర్యావరణవేత్తల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. జపాన్ ఉత్తర భాగంలోని హొక్కైడో అనే ద్వీపానికి చెందిన హకొడటె తీరంలో ఈ చేపలు కొట్టుకొచ్చాయి. తీరానికి దాదాపు అరమైలు దూరం వరకు ఈ చేపలు పెద్దసంఖ్యలో వచ్చాయి. స్థానికులు వీటిని తీసుకుని అమ్మడం మొదలుపెట్టడంతో.. ఎందుకైనా మంచిదని, వీటిని ఎవరూ తినొద్దని అధికారులు హెచ్చరించారు.
చేపలన్నీ ఇలా ఎందుకు చనిపోతున్నాయన్న విషయం ఇతమిత్థంగా ఇంతవరకు తెలియలేదు. హకొడటె ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుడు తకషి ఫుజియొక మాట్లాడుతూ, దీని గురించి గతంలో తాను విన్నాను గానీ, ఇలా చూడటం మాత్రం ఇదే మొదటిసారని చెప్పారు. పెద్ద చేపలు వెంటాడటంతో చిన్న చేపల మంద ఇలా తీరానికి కొట్టుకొచ్చి ఉండొచ్చని, కెరటాలు విసిరేయడం వల్ల ఇలా బయటపడి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లేదా.. వలస సమయంలో చేపలు శీతల జలాల్లోకి ప్రవేశించి తీరానికి కొట్టుకొచ్చి ఉండొచ్చని.. అయితే కారణం ఏంటో స్పష్టంగా చెప్పలేమని ఆయన అన్నారు. కారణం ఏదైనా వాటిని తినడం మాత్రం మంచిది కాదని ఫుజియొక చెప్పారు.
2011 మార్చి నెలలో ఫుకుషిమా అణు విద్యుత్ కర్మాగారంలో ప్రమాదం సంభవించిన తర్వాత అప్పటి నుంచి దాదాపు 13.4 లక్షల టన్నుల అణు వ్యర్థ జలాలను జపాన్ సేకరించింది. ఆగస్టు 24న తొలి దశలో 7,800 టన్నుల అణుధార్మిక జలాలను సముద్రంలోకి వదిలింది. అక్టోబరులో రెండోదశలో కూడా మళ్లీ జలాలను వదిలింది. దీన్ని చైనా, ఇతర దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తొలి దశ అణువ్యర్థ జలాల విడుదల తర్వాతి నుంచే జపాన్ నుంచి జలచరాల దిగుమతులను చైనా నిషేధించింది. సముద్రం మొత్తాన్ని జపాన్ ఒక మురుగు కాల్వలా మార్చేస్తోందని చైనా నాయకులు మండిపడుతున్నారు.
వ్యర్థ జలాల్లో సాధారణంగా అణుధార్మిక పదార్థాలైన ట్రీటియం, స్ట్రాంటియం-90, సి-14 లాంటివి ఉంటాయి. ఇవి సముద్ర జీవరాశుల శరీరాల్లోను, సాగర పర్యావరణ వ్యవస్థలోను చాలా త్వరగా కలిసిపోతాయి. ఒకసారి అణుధార్మికతతో కూడిన వ్యర్థ జలాలను సముద్రంలో వదిలిపెడితే, అప్పటినుంచి 57 రోజుల్లో అవి చేపలు, ఇతర సముద్రజీవాల శరీరాల్లోకి వెళ్లిపోతాయి. వీటివల్ల వెంటనే కాకపోయినా కొన్ని నెలల తర్వాతి నుంచి అయినా వాటి శ్వాసకోశ వ్యవస్థలు దెబ్బతిని, శరీరమంతా విషపూరితంగా మారి చనిపోయే ప్రమాదం ఉంటుంది.
తాము ఈ అణుధార్మిక జలాలను పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలోకి వదులుతున్నామని, అందువల్ల వీటిలో ఒక్క ట్రీటియం తప్ప మరేమీ ఉండవని జపాన్ చెబుతోంది. కానీ, మనుషులకు తీవ్రస్థాయిలో పలు రకాల క్యాన్సర్లు రావడానికి ఈ ట్రీటియం ఒక్కటీ చాలు. జపాన్ చేస్తున్న ఈ చర్య మానవాళికి ఎలాంటి ముప్పు తీసుకొస్తుందో అనడానికి తాజాగా మరణించిన చేపలే అతిపెద్ద నిదర్శనం.