నిరుద్యోగం, అధిక ధరలు, మణిపూర్ హింస వంటి పలు దేశ సమస్యలపై విసిగి వేసారిన సామాన్యులు కొందరు పార్లమెంట్ పై దాడికి విఫలయ్నం చేశారు. ‘భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్’ పేరుతో కొందరు యువత, మధ్యవయస్కులు, నిరుద్యోగులు, మధ్యతరగతి వారు కొందరు ఈ ఫ్యాన్ క్లబ్ పేజీల్లో ఫాలోవర్స్ గా ఉన్నారు. ఈ క్లబ్ లోని కొందరు దేశం ఎదుర్కొంటున్న కొన్ని అతిముఖ్యమైన ప్రజా సమస్యలను పార్లమెంట్ లో చర్చించాలని, ఇదే విషయాన్ని నొక్కి చెప్పి, ప్రభుత్వం-దేశం దృష్టిని ఆకర్షించేందుకే ఈ దాడికి తెగబడ్డట్టు పోలీసుల అదుపులోని నిందితులు వెల్లడించటం షాకింగ్ గా మారింది.
రిక్షా డ్రైవర్, ఇంజినీర్, టీచర్ కూడా ఈ దాడి చేసిన వారిలో ఉండటం దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. అంతేకాదు వీరి నేపథ్యం కూడా పూర్తి భిన్నంగా ఉంది. అంటే కొందరు ఉన్నత చదువులు చదువుకున్న వారైతే, కొందరు పెద్దగా చదువు లేనివారు. సామాజిక నేపథ్యం కూడా అణగారిన వర్గాలు మొదలు, అగ్రవర్ణాలకు చెందినవారు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉత్తరాది వారు, దక్షిణాదివారు ఇలా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు దాడి చేసిన నిందితుల్లో ఉండటం చూస్తుంటే విచిత్రంగా ఉందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
అయితే నిందితులు చేసిన ఈ పనిని వారే స్వయంగా కెమరాల్లో షూట్ చేసి, వైరల్ చేసి, దేశ మీడియాలో హైలైట్ అయ్యేలా తప్పనిసరిగా చేయాలన్న లక్ష్యంతో పనిచేసినట్టు కూడా విచారణలో తేలటం చూస్తుంటే నిరుద్యోగంతో విసిగి వేసారిన వీరు ఓ కామన్ మ్యాన్ లా తిరుగుబాటుకు ప్రయత్నించినట్టు, పలు సినిమాలు ఇందుకు ప్రేరణగా నిలిచినట్టు తెలుస్తోంది.