నదుల అనుసంధానం ఎప్పటికైనా సాకారం అవుతుందని ఆశల్లో ఊరేగుతున్నవారు మనదేశంలో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సంఘ్ పరివార్ మద్దతుదారులు,ప్రధాని నరేంద్ర మోడీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు నదుల అనుసంధానం త్వరలో సాకారం అవుతుందని ఆశిస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం, పంటలు పచ్చగా నాలుగు కాలాలూ పండేలా నదుల అనుసంధానం సాకారం చేస్తానంటూ మోడీ తరచూ తన ప్రసంగాల్లో ఊరిస్తూ, భరోసా ఇస్తుంటారు.
భారతదేశాన్ని ధాన్యాగారంగా మార్చేందుకు దేశాన్ని అన్నపూర్ణగా భవిష్యత్తులో తీర్చి దిద్దేందుకు నదుల అనుసంధానమే అసలైన అస్త్రంగా మోడీ అభివర్ణిస్తుంటారు. దేశాన్ని సమైక్యంగా, సంఘటితంగా ఉంచేందుకు నదుల అనుసంధానం చక్కని ఆయుధమనే మోడీ ఈ దిశగా పనులు మాత్రం మొదలుపెట్టినట్టు కనిపించదు. అసలు ఈ మహా కార్యక్రమాన్ని అపర భగీరథ ప్రయత్నంగా పిలవాల్సిందే. అంతటి బృహత్ కార్యం నదుల అనుసంధానం.
2022కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటూ మూడేళ్ల క్రితం మోడీ పలికిన బీరాలు మనందరికీ గుర్తున్నాయి. కనీసం ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కనుక వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలంటే కనీసం ఈ నదుల అనుసంధానం అనే ప్రాజెక్టులో కదలిక వచ్చి, శంకుస్థాపనలైనా కావాల్సిందే. మరి రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎటువంటి అస్త్రాలను బీజేపీ ఎత్తుకుంటుంది. సరికొత్తగా బీజేపీ చేయబోయే ఎన్నికల వాగ్దానాలు ఏమిటి. ఎందుకంటే రామమందిర అంశమంటూ దశాబ్దాలపాటు రాజకీయాలు చేసిన బీజేపీకి ఇక ఆ అంశం మిగలకపోవటంతో అంతటి బలమైన మరో అంశాన్ని రాజకీయ తెరపైకి తేవాలి. నదుల అనుసంధానానికి మించిన అతిపెద్ద అజెండా ఏముంటుంది. పైగా ప్రతి బీజేపీ అగ్రనేతకు ఇది అత్యంత ప్రియమైన ప్రాజెక్ట్ కూడానూ. అంతెందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కల కూడా నదుల అనుసంధానమే. మరి పార్టీ సిద్ధాంతం, పార్టీ నేతలంతా నదుల అనుసంధానం గురించి ఇంతలా యోచిస్తున్నప్పుడు దానికే ప్రాధాన్యత ఇస్తే సరికదా.
నదుల అనుసంధానమంటే అది అతిపెద్ద సివిల్ ఇంజినీరింగ్ మార్వెల్ గా మారటం ఖాయం. దేశ భౌగోళిక పరిస్థితులను, వాతావరణాన్ని బేరీజు వేసుకుని పకడ్బందీ ప్రణాళికలతో, భారీ ఆర్థిక ప్యాకేజీతోనే ఇదంతా సాధ్యమవుతుంది. భారత దేశం వంటి సువిశాలమైన దేశంలో నదులన్నింటినీ లింక్ చేయాలంటే మానవ నాగరికతకు, మేధస్సుకు అతి పెద్ద సవాలు. దేశంలోని అతిపెద్ద నదులన్నీ సముద్రంలో నీరు కలిసిపోయి వృథా కాకుండా, అతీవృష్టి, అనావృష్ఠి సంభవించకుండా ఈ రివర్ లింకింగ్ చక్కని శాశ్వత పరిష్కారంగా నిలవటం ఖాయం. కానీ ఇది ఎక్కడ మొదలుపెట్టాలి, ఎలా మొదలుపెట్టాలన్న కసరత్తు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. నాడు వాజ్ పేయి మొదలు..నేటి మోడీ వరకూ అందరూ దీన్ని కేవలం కాగితంపై ఓ అంశంగా మాత్రమే ప్రయోగిస్తూ వస్తున్నారు. దేశంలో ప్రతి ఇంచు ఇంచుకీ నీటి పారుదల అందేలా చేయగల సామర్థ్యం ఈ నదుల అనుసంధానానికి ఉంది. దేశంలో ఇక ఆహార సంక్షోభం, నిరుద్యోగం, సాగు-తాగు నీటి కటకట వంటి సమస్యలేనేవే లేకుండా పోతాయి. ఒకవేళ ఇది బెడిసికొడితే మాత్రం మనం కాలగర్భంలో సింధూలోయ నాగరికతలా మిగిలిపోతాం. ప్రకృతి రెండు వైపులా పదునున్న కత్తి వంటింది. ప్రకృతితో వికృతమైన చేష్టలు చేస్తే మానవాళే తుడిచిపెట్టుకుపోతుంది.
మీకు నైలు నది గుర్తుందికదా. ప్రపంచంలో అతి పొడవైన నదిగా నైలు నదికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి నైలు నది వల్ల ఒక ప్రాంతం సుభిక్షంగా కళకళలాడుతుంటే మరో ప్రాంతంలో మాత్రం ఈ నది దుఖఃదాయనిగా మిగిలిపోయింది. బైకాల్ వంటి సరస్సుల ప్రవాహాన్ని తరచూ మార్చటంతో ఈ విపత్తు వచ్చిపడింది.
అగ్రరాజ్యం అమెరికాలోనూ ఇదే పరిస్థితి. కొలరాడో వెంబడి ఎన్నో డ్యాములు కట్టినా మెక్సికో, నెవాడా, క్యాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లో నీటి కటకట మనకు కనిపిస్తూనే ఉంది. అందుకే నదుల అనుసంధానం అనే ప్రాజెక్టు సత్ఫలితాలు ఇస్తుందా, బెడిసి కొడుతుందా అని కచ్ఛితంగా అంచనా వేయలేం. సర్ ఆర్ధర్ కాటన్ మొట్టమొదటిసారి 1800ల్లో దీన్ని ప్రతిపాదించారు. ఔట్ స్టాండింగ్ ఇంజినీర్ గా ప్రఖ్యాతిగాంచిన మాజీ కేంద్ర మంత్రి కేఎల్ రావ్ దీన్ని 1960ల్లో మళ్లీ వెలుగులోకి తెచ్చారు. గంగా కావేరీ నదుల అనుసంధానం రావ్ తెరపైకి తెచ్చినదే. కానీ ఇప్పటికీ పురుడు పోసుకుంది మాత్రం లేదు. ఆతరువాత 1977లో గార్లాండ్ కెనాల్స్ అంటూ దేశంలోని ప్రముఖ నదులన్నింటినీ అనుసంధానం చేస్తామంటూ దీనికి మరో రూపాన్ని తెరపైకి తెచ్చారు. ఎయిర్ లైన్ పైలట్ కెప్టెన్ దిన్షా దస్తూర్ ఈ అంశాన్ని గొప్పగా ప్రస్తావించేవారు. మొరార్జీ దేశాయ్ దీనిపైన అత్యుత్సాహం ప్రదర్శించేవారు. ఆతరువాత 1980లో ఇందిరా గాంధీ హయాంలో ఇది తెరవెనక్కు వెళ్లిపోయింది. మళ్లీ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరుగున పడిన ఈ ప్రాజెక్టుకు ప్రాణం పోశారు. 2002లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో కలాం దీన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
మనదేశంలో 60 శాతం పంట భూములకు నీటి పారుదల సదుపాయాలు లేక మెట్ట ప్రాంతంగా మిగిలిపోతోంది. ఇదంతా వర్షాధారంగానే ఉన్న వ్యవసాయ భూమిగా మిగిలిపోయింది. దీంతో ఈ ప్రాంతాల్లో నిత్యం పేదరికం తాండవిస్తూ ఉంటుంది. అదే వీరికి సాగు-తాగు నీటి సదుపాయాలు కల్పిస్తే పచ్చగా ఈ రాష్ట్రాలు కళకళలాడతాయి. పేదరికానికి చెక్ పెట్టచ్చు.
ఆధునిక దేవాలయాల పేరుతో 1950 నుంచి ప్రధాని నెహ్రూ నిర్మించిన భాక్రానంగల్, దామోదర్ వ్యాలీ నాగార్జున సాగర్ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కేవలం 17.4 శాతం లేదా 21 మిలియన్ హెక్టర్లకు మాత్రమే సాగునీరు అందిస్తుంది. కానీ 1980లో ఈ పరిధి కాస్త 35 శాతానికి పెరిగింది. దీనికంతా కారణం నీటిపారుదల రంగంపై కేంద్ర ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించటమే.
నదుల అనుసంధానం కింద బ్రహ్మపుత్రా నది మహానది, గోదావరి నది, క్రిష్ణా నదితో కలిసి పెన్నార్, కావేరీని కూడా అనుసంధానం చేస్తుంది. మరోవైపు గంగా-యమున నదులను నర్మదా నదితో అనుసంధానం చేస్తుందన్నమాట. ఈమధ్యలో అతర్వాహిని అయిన సరస్వతి నదిని కూడా అనుసంధానం చేస్తామనే మాటను ఊదరగొడుతున్నారు. కానీ ప్రస్తుతం సరస్వతి నది ఉందా లేదా అన్నది రహస్యంగానే ఉంది. దీనిపై ఎవరికీ స్పష్టత అయితే లేదు. అది అంతరించి పోయిందంటే లేదు అంతర్వాహినిగా ఇప్పటికీ సజీవంగా ఉందనే వాదనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
ఇదొక్కటే కాదు దేశంలోని చిన్న చిన్న నదులు, ఉపనదులను కూడా అనుసంధానం చేయాలనే యోచనలో ప్రభుత్వాలున్నాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్ లో కెన్, బేట్వా వంటి చిన్న నదులనున్నాయి, ఉత్తర్ ప్రదేశ్ లో కోసి, గండక్ అనే చిన్న గంగా ఉపనదులున్నాయి. రాజస్థాన్ లోని చంబల్ లోయలో పర్బతి, కాలిసింధ్ అనే నదులున్నాయి.
నిజానికి ఈ నదుల అనుసంధానం కింద 30 లింకులు ఉన్నాయి. 36 డ్యాములు, 10,800 కిలోమీట్రల మేర కెనాల్స్ కలిసి 174,000మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించి సాగు నీటిగా, తాగు నీటి వనరులుగా మార్చే అవకాశం ఉంది. మరి ఇంత అతి భారీ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు, నిధులు ఎంతనో ఒక్కసారి మీరు ఊహించగలరా. దీనికి అయ్యే మొత్తం ఖర్చు 5,60,000 కోట్ల రూపాయలు అది కూడా 2002 లెక్కల ప్రకారం మాత్రమే. అంటే 2002లోనే రాబోయే 10 ఏళ్ల మొత్తం జీఎన్ టీలో 2 శాతం అన్నమాట. తాజా లెక్కల ప్రకారం అంచనా వేయాలంటే ఇది చాలా రెట్లు తడిసి మోపెడు అయి ఉంటుంది. అయితే ప్రస్తుతం మన దేశ డీజీపీ అప్పటితో పోల్చితే మూడు రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ ఖర్చు భరించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అంటే మోడీ సర్కారు నదుల అనుసంధానానికి నిధులు సమకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పనులకు కొబ్బరికాయ కొట్టచ్చుకూడా. ఇది చాలా టెప్టింగ్ గా ఉన్న విషయమే. కానీ పాలకులు దీన్ని కేవలం ప్రసంగాల్లో, ఎన్నికలకు ఉపయోగించే రాజకీయ అంశంగా మార్చేశారు. మోడీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఈ పనులు ప్రారంభించటం ఇప్పట్లో అంత పెద్ద సవాలైతే కాదు. దీనిపై సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా గతంలో దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టత కూడా ఇచ్చింది. ఇదంతా పార్లమెంటు పరిధిలోకి వస్తుందని, అంతర్ రాష్ట్ర నదుల అనుసంధానం చేస్తే దేశంలోని ఓ ప్రాంతంలో వరదలు వస్తే మరో ప్రాంతంలో క్షామం వచ్చే స్థితులు లేకుండా పోతుందని పేర్కొంది. నీటిని పంచుకోవటంతో రాష్ట్రాలన్నీ సస్యశ్యామలం అవుతాయని చాలా రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి కూడా వచ్చినట్టు అత్యున్నత ధర్మాసనం గుర్తుచేసింది. ఇలా చేస్తే నీటి గొడవలు, సమస్యలు తగ్గటమే కాదు నదీ జలాల కాలుష్యానికి పరిష్కారం లభిస్తుందని కోర్టు పేర్కొంది. నదుల అనుసంధానం జరిగితే అన్ని నదులలో నీటి మట్టం కూడా ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
మన రాజకీయ నాయకులు కూడా తమ ముందు తరం వారు చేసిన ఈ ప్రతిపాదనలను స్వాగతిస్తూ భారీ ప్రకటనలైతే చేస్తున్నారు, మనం మన తరువాతి తరాలు కూడా వీటితో బాగా లబ్దిపొందుతాయి. కానీ ఇందుకు అవసరమైన చొరవ చూపి, వాటిపై మాటలు కట్టిపెట్టి పనులు ప్రారంభిస్తే మరికొన్ని ఏళ్లలో మనం నదుల అనుసంధానం అనే యజ్ఞం ఫలాలను ఆస్వాదించవచ్చు.