Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Karimnagar: ప్రజా క్షేత్రంలో మళ్లీ నిలబడదాం

Karimnagar: ప్రజా క్షేత్రంలో మళ్లీ నిలబడదాం

కార్యకర్తలూ..అధైర్యపడొద్దు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారధి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజకంగా పాలన సాగించినప్పటికీ ఓటమి గల కారణాలపై విశ్లేషణ చేసుకుంటూ ప్రజా క్షేత్రంలో ముందుకు సాగుదామని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని రామడుగు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వినోద్ కుమార్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి గల కారణాలను కార్యకర్తలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ జాతిపితగా అపారమైన గౌరవం ఉందని అన్నారు. పాలనలో జరిగిన చిన్న చిన్న లోపాలతోనే పార్టీ ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ ఒకేసారి చేయకపోవడంతో రైతుల్లో కొంత వ్యతిరేకత రావడం జరిగిందని దీంతో పాటు దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లర్లు క్వింటాలకు 10 నుండి 12 కిలోల తరుగు కోత విధించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఇది కూడా కొంత ప్రభుత్వం మీద వ్యతిరేక రావడానికి గల కారణమైందన్నారు.

కెసిఆర్ పాలనలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పలువురు దూరం కావలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనకు నచ్చిన పని చేసే వారే కానీ ఎవరికి సమయం ఇచ్చి పాలనలో భాగస్వామ్యం చేయకపోవడం కూడా ఒక కారణం అన్నారు. ప్రభుత్వ అధికారులు సైతం బిఆర్ఎస్ నాయకులకు పనులు చేయలేదని దీంతో బీఆర్ఎస్ నాయకులు కొంత అసంతృప్తికి లోనయ్యారని అన్నారు. ఉద్యమ సమయంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని చెప్పిన బిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత వారి సమస్యలను గాలికి వదిలేయడంతో జర్నలిస్టులతో కొంత వ్యతిరేకత ఏర్పడిన మాట వాస్తవమన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకులను విస్మరించి ఉద్యమ ద్రోహులకు సైతం పదవులు ఇచ్చారనే అపవాదు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉండడం కూడా ఓటమికి ఒక కారణంగా చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేయాలని ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు వారు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామాల్లో సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అది కూడా కొంత ఓటమి కారణంగా చెప్పవచ్చన్నారు. ప్రధానంగా విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించడంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొనడంతో యువత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాల్సిన అవసరం వచ్చిందని ఇలాంటి చిన్న చిన్న కారణలతో పార్టీ ఓటమికి కారణమయ్యాయని టి ఆర్ ఎస్ పార్టీ బి ఆర్ ఎస్ గా మారడం కూడా ఓటమికి కారణం అయిందని పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వినోద్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను ఏకీభవిస్తున్నమని ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుందామని వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని వినోద్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో దేశంలోనే రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఆదాయ వనరులను మెరుగుపరచుకోవడంలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణ రెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు ఎడవల్లి నరేందర్ రెడ్డి కొండగట్టు దేవస్థాన డైరెక్టర్ రాజేందర్ రెడ్డి వివిధ గ్రామాల ఎంపీటీసీలు జడ్పిటిసిలు సర్పంచులు బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News