అధునాతన టెక్నాలజీతో ప్రపంచం దూసుకుపోతున్నా మూఢనమ్మకాలు మాత్రం ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు జన విజ్ఞాన వేదికలు అధికారులు మూఢనమ్మకాలపై ఎంతగానో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు మూఢనమ్మకాల వైపే వెళ్తున్నారు. క్షుద్ర పూజలు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక మర్రిగూడెం ఆటో స్టాండ్ సమీపంలోని రహదారిపై శుక్రవారం కుంకుమ, పసుపు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, జీడిగింజలు ఇతర వస్తువులు ఎర్రటి వస్త్రంతో క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం రేపడంతో స్థానిక ప్రజలు, ఆ వైపుగా వెళ్లేవారు హడాలెత్తిపోతు భయాందోళనకు గురయ్యారు.
క్షుద్ర పూజలు చేశారా లేక ఎర్రటి వస్త్రంలో ఈ వస్తువులు తీసుకోవచ్చి ఇక్కడ పడేశారా అని స్థానిక ప్రజలు అనుమానిస్తున్నారు. సమీపంలో సీసీ కెమెరాల నిఘా నీడలో ఉన్నామనే భయం లేకుండా క్షుద్ర పూజ ఆనవాళ్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతంలో పలుమార్లు ఇదే తరహాలో కుంకుమ పూలు నిమ్మకాయలు ఇతర వస్తువులు కనిపించినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదని ఈ తరహాలో ఈ వస్తువులు చూడటం భయాందోళనకు గురిచేసిందని, ఇలాంటి క్షుద్ర పూజలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.