Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Congress election strategy: ఎన్నికల వ్యూహానికి కాంగ్రెస్ ఆమడ దూరం

Congress election strategy: ఎన్నికల వ్యూహానికి కాంగ్రెస్ ఆమడ దూరం

ఉచిత పథకాలతో ముందుకు పోతూ..

దేశంలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోందనే ప్రశ్ర ఉదయించడం సహజమే. తెలంగాణలో అనుసరించిన వ్యూహాన్నే 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా అనుసరించాలనే ఉద్దేశంలో ఉందే తప్ప కొత్తగా చేస్తున్నదేమీ లేదు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటే ఇది. ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పినట్టు, కాంగ్రెస్ కొద్దిగా అనుభవం సంపాదించుకుందే తప్ప తెలివితేటలు పెంచుకోలేదు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రమే విజయం సాధించింది.

- Advertisement -

రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాలకు ఉత్తర ప్రదేశ్ ను కూడా కలిపితే హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభ వెలిగిపోతోందన్నది స్పష్టం. ఆ పార్టీ కేవలం రాముడిని, హనుమంతుడిని, నరేంద్ర మోదీని చూపెట్టుకుని విజయాల మీద విజయాలు సాధిస్తోంది. కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. ఇది ఉత్తరాదిని, దక్షిణాదిని వేరు చేసి చెప్పడం
కాదు. కాంగ్రెస్ పార్టీతో మపాటు పలు పార్టీలు, పలువురు రాజకీయ మేధావులు తమ అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి చూపించే ‘ఉత్తరాది, దక్షిణాది విభజన’ కారణాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది.

దక్షిణాది రాష్ట్రాలు ప్రగతిశీల భావాలు కలిగిన లౌకికవాద రాష్ట్రాలని, ఉత్తరాది రాష్ట్రాలు ఆచార, సంప్రదాయాలకు కట్టుబడిన మత ఛాందసవాద రాష్ట్రాలని, అందువల్లే ఉత్తరాదిలో బీజేపీ గెలు స్తుండగా, దక్షిణాదిలో కాంగ్రెస్, డి.ఎం.కె, వామపక్షాలు విజయాలు సాధించడం జరుగుతోందని ఇటీవల కొన్ని పార్టీలు వ్యాఖ్యానాలు చేయడం జరుగుతోంది. సాధారణంగా కాంగ్రెస్ వంటి ఓటమి పాలయ్యే పార్టీలు ప్రతీకారంతో రగిలిపోతుంటాయి. దెబ్బతిన్న పులుల్లా వ్యవహరిస్తుంటాయి. తాము బాధితులమనే అభిప్రాయంతో ఉంటాయి. ఆ బాధను
బయటికి చెప్పుకోలేక దక్షిణాది రాష్ట్రాలు పరిణతి చెందిన రాష్ట్రాలనే అభిప్రాయాన్ని వ్యాపింపజేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే, తనలోని లోపాలను సవరించుకునే ప్రయత్నం చేయదు. వందేళ్ల నాటి భావాలకు, వ్యూహాలకు పూర్తిగా కట్టుబడి ఉంటుంది. ఇప్పటికీ ఆ పార్టీకి ఒక ఎన్నికల వ్యూహమంటూ లేదు. ఒక విజన్ అంటూ లేదు. ఉచితాలు ప్రకటించి పబ్బం గడుపుకోవడమే తప్ప దీర్ఘకాలంలో దేశాభివృద్ధికి సంబంధించిన లక్ష్యమేమీ ఇంతవరకూ కనిపించ లేదు.

కాలం చెల్లిన భావాలు
ఇప్పటికీ లౌకికవాదం, సోషలిజం వంటి భావాల గురించి మాట్లాడడంతోనే ఆ పార్టీ తన సమయాన్ని వృథా చేసుకుంటోంది. ఇవే భావాలతో ఇంకా తనను తాను మభ్యపెట్టుకుంటోంది. లౌకికవాదం ముసుగులో హిందువులను నిర్లక్ష్యం చేయడం, ముస్లింలను, క్రైస్తవులను బుజ్జగించడమనే పద్ధతులనే ఆ పార్టీ అనుసరిస్తోంది. ఆ పార్టీ దృష్టిలో అదే లౌకికవాదం. ఈ వాదాల నుంచి దేశం, దేశ ప్రజలు చాలా దూరం వచ్చేసిన విషయాన్ని అది ఏమాత్రం అర్థం చేసుకునే ఉద్దేశంలో లేదు. కాలం చెల్లిన భావాలతో దేశ ప్రజలను మభ్యపెట్టలేమనే విషయాన్ని అది దేశంలో ఎన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నా గుర్తించడం లేదు. తమ తెలివితేటలకు తమను తామే అభినందించుకోవడం, కొందరు భజనపరులు చేసే స్తోత్రపాఠాలకు పరవశం అయిపోవడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైన వ్యవహారం.
కళ్లకు కడుతున్న వాస్తవాలను సైతం వారు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిన భావాల నుంచి ఒక పట్టాన బయటపడలేక పోతోంది. దానికి ఏది తోస్తే దాన్నే పట్టుకుని ఊగులాడుతుంటుంది. ఏ అంశం గెలిపిస్తే ఆ అంశాన్నే మళ్లీ మళ్లీ ఉపయోగించుకుంటూ ఉంటుంది.

ఉదాహరణకు, గౌతమ్ అదానీ విషయాన్నే తీసుకుందాం. దేశానికి పట్టిన చీడ ఆయన ఒక్కడే అన్నట్టుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తూ ఉంటుంది. పార్లమెంటులోనూ, ఎన్నికల ప్రచారాల్లోనూ, ఇతర సభలు, సమావేశాలలోనూ ఆయన గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. సన్నిహిత పెట్టుబడిదార్ల గురించి మాట్లాడినప్పుడల్లా అదానీ గురించి మాత్రమే చర్చిస్తూ ఉంటుంది. ఆయనపై విమర్శించడమంటే మోదీని విమర్శించడమే అనుకుంటుంది. ఇది పారిశ్రామిక రంగాన్నే కాక, వాణిజ్య రంగాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉందనే విషయాన్ని అది ఏమాత్రం పట్టించుకోదు. అదానీ నిష్క్రమిస్తే దేశంలోని సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా? అదానీని తిడితే మోదీని తిట్టినట్టవుతుందా? అదానీ మీద విమర్శలు చేసినంత మాత్రాన దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా? దేశ సమస్యలన్నీ ఒకే వ్యక్తి మీద ఆధారపడి ఉన్నాయా? అదానీని తిట్టడం వల్ల ఉపయోగం ఏముంటుంది? కాంగ్రెస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటివన్నీ చేయలేదా? కొందరు పారిశ్రామికవేత్తలను ఆదరించడం జరగలేదా? ప్రజలు ఇవన్నీ ఆలోచించరా?

పనికిరాని ప్రచారాలు
అదానీ ఒక పారిశ్రామికవేత్త. ఆయన గ్రూపునకు సంబంధించిన పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లో వేలాది మంది పనిచేస్తున్నారు. ఇదే విధంగా అనేక సంస్థల్లో వేలాదిమంది పనిచేయడం జరుగు తోంది. అదానీ గ్రూపు మాత్రం రాక్షసి అనీ, మిగిలిన సంస్థలన్నీ దేవ దూతలనీ చెప్పగలమా? ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, మరికొన్ని ప్రతిపక్షాలు అదానీని మాత్రమే ప్రచారాంశంగా తీసుకోవడాన్ని బట్టి ఇవి అతి ముఖ్యమైన ఇతర దేశ సమస్యలను విస్మరిస్తున్నారనే భావన కలుగుతుంది. అదానీ రోకంటిపాట వల్ల వారి ప్రధానోద్దేశం, ప్రధాన ప్రయోజనాలు దెబ్బతినడం ఖాయం. ప్రజల్లో ఇప్పటికే ఈ రోకంటిపాట విసుగు పుట్టిస్తోంది.
అందుకు మూడు రాష్ట్రాల్లో పరాజయమే నిదర్శనం. ఎన్నికలు పూర్తయి, తాము పరాజయం పాలయిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి, తనను తాను మభ్యపెట్టుకోవడం ఎక్కువైపోతుంటుంది. ఎప్పుడూ ఎక్కడా ఏ విషయంలోనూ పాఠాలు నేర్చుకున్న దాఖలాలు కనిపించవు.

ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఇదే వ్యవహారం కనిపించింది. రాహుల్ గాంధీ, జైరామ్ రమేశ్ వంటి సీనియర్ నాయకులు ఈ ఎన్నికల ఫలితాలపై ట్వీట్ చేస్తూ, ‘‘చత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ శాసనసభల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన మాట నిజమే. ఈ ఫలితాలు మేం ఊహించిన దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అయితే, ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే మా పార్టీ బీజేపీకి బాగా దగ్గరలోనే ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ పరిస్థితి మాకు ఆశాజనకంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఒక్క శాతం ఓట్ల తేడా వచ్చినా అనేక సీట్లు కోల్పోవడం జరుగుతుంది. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి తలకెక్కడం లేదు. ఇక అదానీని విమర్శించడంతో పాటు ఇష్టారాజ్యంగా ఉచితాలు ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రహ్మాస్త్రంగా కనిపిస్తోంది. ఈ మధ్య కుల గణన కూడా కాంగ్రెస్ చేతికి అందివచ్చింది. విచిత్రమేమిటంటే ఇవే అస్త్రాలను లోక్ సభ ఎన్నికల్లో కూడా ప్రయోగించాలనే ఉద్దేశంలో ఉంది. నిజానికి, వీటిని ఉత్తరాది రాష్ట్రాలు గత ఎన్నికల్లో నిర్ద్వంద్వంగా తిరస్కరించడం
జరిగింది. మోదీ, ఆయన బృందం ఇప్పటికే మరింత ముందుకు పోవడం జరిగిపోయింది.

రాహుల్ గాంధీ ఈ విధంగా ఉచిత పథకాలతో ముందుకు పోతుండగా, మోదీ మహిళా సాధికారికతను ప్రధానాంశంగా తీసుకుని దూసుకుపోతున్నారు. ఆర్టికల్ 370 రద్దు వంటి దేశానికి అవసరమైన అంశాలను చేపడుతున్నారు. రాహుల్ గాంధీ కంటే ఉధృతంగా ఉచిత పథకాలను కూడా మోదీ ప్రకటిస్తున్నారు. దేశ, విదేశాల్లో అనేక విషయాల్లో ఘన విజయాలు సాధిస్తున్నారు. ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడుగా ఎదిగిపోతున్నారు. రాహుల్ గాంధీ వంటి యువ నాయకుడు ఇంకా పాత చింతకాయ పచ్చడి అంశాలనే పట్టుకుని వేళ్లాడుతున్నారు. తన భారత్ జోడో యాత్ర వల్ల వచ్చిన సానుకూల ఫలితాలు కూడా క్రమంగా నీరుకారిపోతున్న విషయాన్ని రాహుల్ గాంధీ పట్టించుకోవడం లేదు. అత్యవసర సమస్యలను, బీజేపీ బలహీనతలనే కాదు చివరికి మహువా మొయిత్రా కేసును కూడా ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు.

లోక్ సభ ఎన్నికలు జరగడానికి ఇక చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. కేంద్రంలోనూ, హిందీ రాష్ట్రాలలోనూ బీజేపీ దాదాపు పాతుకుపోయి ఉంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పటికే అర్థమైపోతోంది. కాంగ్రెస్ పార్టీకి ఇంత వరకూ ఒక వ్యూహ మంటూ లేదు. పాఠాలు నేర్చుకోవడమంటూ లేదు. బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు దూసుకు పోతోంది. రాహుల్ గాంధీ నుంచే కాదు, ఒక్క సీనియర్ నాయకుడి నుంచి కూడా ఇంతవరకూ సరైన ప్రకటన వెలువడలేదు. అసలు ఆ పార్టీలో నాయకుడెవరన్నది కూడా తేలడం లేదు. ఒక వ్యూహానికి, విజయావకాశాలకు కాంగ్రెస్ చాలా దూరంలో ఉంది.

– బి. కామేశ్వర రావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News