యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా (నారీమణులను ఎక్కడ పూజిస్తారో, దేవతలు అక్కడే ఉంటారు)
కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ
ఆకాశంలో ఆమె సగం
ఇలా.. మహిళల గురించి చెప్పాలని అనగానే ప్రతియేటా మహిళా దినోత్సవం రోజున బోలెడన్ని కొటేషన్లు చెప్పేస్తారు. వాళ్లను ఆకాశంలో సగం అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. అది ఇది ఏమని అన్ని రంగముల… అంటూ ప్రతి రంగంలోనూ వాళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారని కొండొకచో కుళ్లుకుంటారు కూడా.
కానీ ఎప్పుడైనా మీరు గానీ, మీ కుటుంబ సభ్యులు గానీ ఒక్క ప్రసవానికి కాకుండా వేరే ఏదైనా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్లినప్పుడు అక్కడ మహిళా సర్జన్లను చూశారా? గైనకాలజీ, డెంటల్ లాంటి విభాగాలు కాకుండా తల నుంచి కాళ్ల వరకు అనేక ప్రత్యేక విభాగాలు ఉంటాయి. న్యూరోసర్జరీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ, ఆర్థోపెడిక్ సర్జరీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి. కానీ వీటన్నింటిలో మన భారతదేశంలో ఉన్న సర్జన్ల సంఖ్యను ఏ నగరంలోనైనా వేళ్లమీద లెక్కపెట్టచ్చు. ఇటీవల విశాఖపట్నంలో అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సమావేశాలు నిర్వహించారు. ఈ సంఘంలో మొత్తం 32 వేల మంది సభ్యులు ఉంటే, వారిలో కేవలం 4,160 మంది.. అంటే 12.5% మాత్రమే మహిళలు. హైదరాబాద్‌లోని అన్ని కార్పొరేట్ ఆస్పత్రులలో ఉన్న సర్జన్లలో 10% మాత్రమే మహిళలని, వాళ్లంతా కూడా గైనకాలజిస్టులు, ఆబ్స్టెట్రీషియన్లేనని 2016లో టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. ఈ ఒక్క విభాగాన్ని పూర్తిగా మహిళలకే కేటాయించిన ఘనత మన దేశానికే దక్కుతుంది. దీని తర్వాత కొంతలో కొంత మహిళా సర్జన్లు కనిపించేది దంతవైద్య విభాగంలోనే. కొంతమంది ఎంబీబీఎస్ సీటు రాకపోవడం వల్లనో, మరే కారణంతోనో బీడీఎస్, ఎండీఎస్ కోర్సులు చేసి ఈ రంగంలోకి రావడం వల్ల అలా ఉంటున్నారు.
స్టెమ్ రంగాలు.. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమెటిక్స్ రంగాలలో మాత్రం మహిళల వాటా గణనీయంగానే ఉంది. మన దేశంలో ఈ కోర్సులలో మొత్తం పట్టభద్రుల్లో 43% మహిళలు ఉంటున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని ప్రపంచ బ్యాంకు ఘంటాపథంగా చెబుతోంది. కానీ, ఈ పట్టభద్రులందరిలో కేవలం 14% మాత్రమే పరిశోధన రంగంలోకి (పీహెచ్‌డీ) వెళ్తున్నారు.
చదువుకున్నా కూడా…
ప్రస్తుతం సర్జికల్ రెసిడెన్సీలలో పురుషులు, మహిళల వాటా 50:50 ఉంటోంది. అంటే, మహిళా సర్జన్లు పట్టభద్రులై బయటకు వస్తున్నారు. కానీ, వీళ్లంతా ప్రాక్టీసు చేయకుండా ఎందుకు ఊరుకుంటున్నారన్నది అతిపెద్ద ప్రశ్న. సీనియర్ సర్జన్లు తమ వద్ద పనిచేయడానికి పురుషులను ప్రోత్సహించినంతగా మహిళా సర్జన్లను ప్రోత్సహించకపోవడం ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. జనరల్ సర్జరీ లాంటి విభాగాల్లో ఇదే తీరు ఇప్పటికీ కొనసాగుతోందని వైద్యవర్గాలు అంటున్నాయి. గతంలో మహిళలకు వైద్యవిద్య అనగానే గైనకాలజిస్టులు, జనరల్ ఫిజిషియన్లు, డెర్మటాలజిస్టులు.. ఇలా ఏసీ గదిలో కూర్చుని చేసే విభాగాలకే వెళ్లాలని కుటుంబాల్లో పెద్దల నుంచి కూడా ఒత్తిడి ఉండేది. భారతీయ సమాజంలో ఉన్న పితృస్వామ్య వ్యవస్థ ఇందుకు కొంతవరకు కారణం అంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ సంకెళ్లు తెగిపోతున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో అన్ని విభాగాల్లోనూ మహిళా సర్జన్లు కూడా కత్తులు, కటార్లు పట్టుకుని సిద్ధమవుతారన్న ఆశాభావాన్ని కొందరు వైద్యులు వ్యక్తం చేస్తున్నారు.
మహిళా వైద్యులపై కుళ్లు జోకులు
వైద్య విద్యలోను, కొన్ని ఆస్పత్రులలో కూడా చాలామంది పురుష వైద్యులు మహిళా వైద్యులు, నర్సులు, మెడికల్ ఇంటర్న్‌లపై తమలో తాము కుళ్లుజోకులు వేసుకుంటారు. మహిళలు తమ సామర్థ్యం వల్ల కాకుండా తమ శరీరాలను ఉపయోగించి వైద్యులు అయిపోతున్నారన్న కామెంట్లు కూడా తాను విన్నానని ఢిల్లీలో ఈఎన్‌టీ, హెడ్ అండ్ నెక్ సర్జరీ విభాగంలో రెసిడెంట్ సర్జన్‌గా ఉన్న డాక్టర్ పల్లవీ త్రిపాఠీ చెప్పారు. కొందరు పేషెంట్లు కూడా తమకు మహిళా సర్జన్లు వద్దని, పురుషులే కావాలని అడుగుతున్నారట! పనిప్రదేశంలో లింగవివక్ష తమపై చాలా స్పష్టంగా ఉంటోందని ఇటీవల ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (ఐఓఎస్ఆర్) నిర్వహించిన సర్వేలో పాల్గొన్నవారిలో 78% మంది మహిళా వైద్యులు చెప్పారు.
దాడుల్లోనూ అదే తీరు
ఎప్పుడైనా ఏదైనా కేసు విఫలమై, రోగి మరణించినప్పుడు వాళ్ల బంధువులు వైద్యులపై దాడులకు దిగడం మనం చూస్తుంటాం. అయితే, అలా దాడి చేసేటప్పుడు పురుషులనైతే మామూలుగా తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తారని, మహిళలనైతే లైంగిక సంబంధిత పదాలతో తిడతారని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో రోబోటిక్ గైనకలాజిక్ ఆంకాలజీ ఫెలో, గైనకలాజిక్ కేన్సర్ సర్జన్‌గా చేస్తున్న డాక్టర్ దీపాలీ రైనా చెబుతున్నారు.
పెళ్లి, కుటుంబం, బాధ్యతలు
వైద్యవృత్తిని చాలా ఆసక్తితో, ఉత్సుకతతో చేపట్టిన మహిళలు కూడా ఆ తర్వాత పెళ్లి, పిల్లలు, ఇతర బాధ్యతల కారణంగా ఒత్తిడితో కూడుకున్న విభాగాల్లోకి రావడానికి కొంత వెనకడుగు వేస్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లకు కనీసం మూడు నాలుగేళ్ల వయసు వచ్చేవరకు తల్లి సంరక్షణ అవసరం కావడం, ఆ తర్వాత కూడా వాళ్లను పెంచే క్రమంలో తమ కెరీర్‌ను క్రమంగా వదులుకోవడం లేదా మరీ అంత అత్యవసరం కాని విభాగాలనే ఎంచుకోవడం మహిళలకు తప్పట్లేదన్నది మహిళా సర్జన్లలో 70% మంది అభిప్రాయం. తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే అయినా.. పిల్లల బాధ్యత ఎక్కువగా తల్లిమీదే పడుతోంది. అదే ఇతర రంగాల్లో మాత్రం ఇలా ఉండట్లేదు.
సుదీర్ఘ కాలం చదువులు
ఎంబీబీఎస్, ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడానికి దాదాపు ఏడేళ్లు పడుతుంది. పీజీ డిగ్రీ కావాలంటే మరో మూడేళ్లు, ఇంకా సర్జరీలో ఏదైనా సూపర్ స్పెషాలిటీ కావాలంటే మరికొంత కాలం అవసరం అవుతుంది. ఇంటర్ అయిన తర్వాత దాదాపు 10-14 సంవత్సరాలు ఇలా చదువుకోవడానికి కేటాయిస్తే, ఆ సమయం అంతా మహిళల పునరుత్పత్తి దశలో చాలా కీలకం. కెరీర్ మీద దృష్టిపెట్టి పెళ్లి, పిల్లలను వాయిదా వేస్తే కుటుంబం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అందుకే పీడియాట్రిక్స్/గైనకాలజీ లాంటి విభాగాలు మినహా మిగతావాటిలో విభాగాధిపతులు (హెచ్ఓడీ) పదవుల్లో మహిళలు అంతగా కనిపించరు.
బలం అవసరం లేకపోయినా..
ఆర్థోపెడిక్ సర్జరీ లాంటి విభాగాల్లో ఇంతకుముందు చాలా బలం ప్రయోగించాల్సి వచ్చేది. ఇప్పటికీ చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్లు తమ పని కార్పెంటర్ పని లాంటిదేనని జోకులు వేస్తుంటారు. అందువల్ల ఈ విభాగంలో మహిళలను అంతగా ప్రోత్సహించేవారు కారు. కానీ ఇప్పుడు అత్యాధునిక పరికరాలు రావడం, రోబోటిక్ సర్జరీల రంగప్రవేశంతో మహిళలు కూడా సునాయాసంగా ఇవన్నీ చేయడం సాధ్యమవుతోంది. అలాగే, న్యూరోసర్జరీ, కార్డియోథొరాసిక్ సర్జరీ లాంటి విభాగాల్లో సున్నితమైన అవయవాలను చూసినప్పుడు మహిళలైతే త్వరగా నెర్వస్ అవుతారని సీనియర్ సర్జన్లు అంటుంటారు. కానీ ఆ సమస్య పురుషులు, మహిళల్లో ఒకేలా ఉంటుందన్నది పలు పరిశోధనల్లో వెల్లడైంది. కేవలం మహిళలను రానివ్వకుండా ఉండాలనే ఆలోచనతో ఉండకుండా, వారిని సైతం ప్రోత్సహిస్తే వైద్యవిద్య చదువుకున్న అనేకమంది మహిళలు మరింత ముందుకొచ్చి, సర్జన్లుగా తమ ప్రతిభను నిరూపించుకోగలరు. ప్రాణదాతలుగా పేరొందిన వైద్యులు ఇలాంటి లింగవివక్షను ప్రదర్శిస్తూ, తమను తాము తక్కువ చేసుకోవడం తగదన్నది మహిళల అభిప్రాయం. దాన్ని కూడా గౌరవించి, వారికీ తగినంత పెద్దపీట వేయడం వాంఛనీయం.
-సమయమంత్రి చంద్రశేఖర శర్మ