Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Modi: రాష్ట్రపతి పదవిలోకి మోడీ !

Modi: రాష్ట్రపతి పదవిలోకి మోడీ !

విదేశీ రాయబార కార్యాలయంలోని అధికారులకు తమ విధి నిర్వహణలో భాగంగా ఎన్నో పనులుంటాయి. వాటిలో ఓ ముఖ్యమైన బాధ్యత దేశంలోని ప్రభుత్వాలు, పార్టీలు, వారి బలాబలాలు, ఎవరు పీఎం అవుతారు, ఎవరు సీఎం అవుతారు, ఎవరెవరికి మంత్రి పదవులు ఊడతాయి, ఎవరికి ప్రజల్లో ఎలాంటి చెరిష్మా ఉంది ఇలాంటివన్నింటిపై కన్నేసి ఉంచాలి. తమ సొంత దేశానికి ఈ రిపోర్టులు ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి. రాజకీయ స్థితిగతులపై ఫార్మాలిటీ కోసం ఈ రిపోర్టులు పంపాలి. ఒక్కోసారి ఫలానా దేశంలో రాజకీయ అనిశ్చితి తలెత్తుతుందని ముందే రాయబార కార్యాలయాలు గ్రహించి, ఇందుకు అనుగుణంకా తమ మాతృదేశం విధి-విధానాలు మార్చుకోవాల్సిందిగా వీరు దిశా నిర్దేశం కూడా చేస్తుంటారు. ఇదే రిపోర్టును రాజకీయ పండితులు ఉప్పందించగా పలు దేశాల విదేశీ రాయబార కార్యాలయాలు తమ మాతృదేశానికి పంపుతున్న రిపోర్టులోనూ స్పష్టంగా పేర్కొంటున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం ఇటు బీజేపీలో అటు దేశంలోనూ ప్రధాని నరేంద్ర మోడీకి తిరుగులేని గుర్తింపు, ప్రజాదరణ, చెరిష్మా, ఇమేజ్ వంటివన్నీ ఉన్నాయి. ఆయనకు పోటీగా ఇటు సొంత పార్టీలో అటు ప్రతిపక్షాల్లో నిలబడ సత్తా ఉన్న నాయకుడు కనిపించటం లేదు. ఈనేపథ్యంలో ఎన్నికల ఏడాది కాబట్టి ప్రతి అంశాన్ని సంతృప్తి పరిచేలా, అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ ను విస్తరించనున్నారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో చక్కని కేబినెట్ ఉంటే తన హ్యాట్రిక్ మరింత సులువు అవుతుందనే యోచనలో మోడీ-షా ఉన్నారు.

కానీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో డైనమిక్స్ ఏంటి. ఏ నేత పార్టీలో అత్యధిక ప్రజాదరణ ఉన్నవారు. ఎవరెవరికి ప్రమోషన్ వస్తుంది. ఎవరికి డిమోషన్ తప్పదు. పార్టీ బాధ్యతలు దక్కేదెవరికి, కేంద్ర మంత్రి పదవులు దక్కేదెవరికి, ఏ బీజేపీ సీఎంకు మోడీ-షా అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు లాంటి ఎన్నో చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మోడీ తన మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన చేసినప్పుడే ఇవన్నీ బయటికి వస్తాయి.

మరోవైపు జేపీ నద్దా వివాదాలకు అతీతంగా, మోడీ-షా కనుసన్నల్లో నడుస్తున్నా ఆయన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా రెండవసారి పార్టీని అధికారంలోకి తేలేకపోయారని, అసమర్థుడంటూ ముద్ర వేసి సాగనంపుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత రాష్ట్రంలో రెబెల్ లీడర్స్ ను కట్టడి చేయటంలో నద్దా పూర్తిగా వైఫల్యం చెందారనేది బహిరంగ రహస్యం. చివరి దశలో నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి అసంతృప్తలను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో నద్దాను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించటంలో ప్రయోజనం లేదనే రెండో ఆలోచనలో మోడీ-షా ఉన్నట్టు లీకులు వస్తున్నాయి. చూస్తుంటే ఈయనకు ఎక్స్ టెన్షన్ ఇచ్చేబదులు కొత్తవారికి పార్టీ పగ్గాలు అప్పగించటం బెటరనే నెక్ట్స్ ప్లాన్ లో వీరు ఉన్నట్టు స్పష్టమవుతోంది. జనవరి 2023తో జేపీ నద్దా అధ్యక్షాలం పూర్తికానుంది. ఇప్పటికే బాగా ఆలస్యం కావటంతో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సంస్థాగత ఎన్నికలు జరిగే అవకాశాలు మాత్రం లేవు. దీంతో నద్దాను కొనసాగించవచ్చు అంటూనే..ఈ పదవిలో రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కూర్చోబెట్టే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న రాజ్ నాథ్ సింగ్ అయితే ఇక బీజేపీకి వచ్చే లోక్ సభ ఎన్నికలు కేక్ వాకే. జేపీ నద్దా పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన్ను కేంద్ర మంత్రిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రాజ్ నాథ్ కు పార్టీ బాధ్యతలంటే ఏమాత్రం ఆసక్తి ఉందో తెలియట్లేదు కానీ రక్షణ మంత్రిగా ఈయన వివాదాలకు అతీతంగా వ్యవహరిస్తూ తన గ్రాఫ్ ను పకడ్బందీగా మెయిన్టెన్ చేస్తున్నారు. పైగా మోడీ తరువాత నంబర్ టూ ఎవరు అంటే చాలాసార్లు అమిత్ షా కాదు రాజ్ నాథ్ అనేలా రాజ్ నాథ్ పేరు ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటుంది.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజారికనందుకు ఆ శిక్షను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు విధిస్తారా. అందులో భాగంగా ఆయనను కేంద్ర మంత్రిగా తప్పిస్తారా. అంటే ప్రస్తుతం అనురాగ్ ఠాకూర్ చేతుల్లో ఉన్న కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ పదవిని మరొక్కరికి కట్టబెడతారా అన్నది పజిల్ గా మారింది.

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ రైజింగ్ స్టార్ గా కేంద్రమంత్రివర్గంలో వెలిగిపోతున్నారనే రిపోర్టు ఒకటి పదేపదే వినిపిస్తోంది. ఈనేపథ్యంలో భూపేంద్రకు ప్రమోషన్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఈయన రిపోర్ట్ కార్డ్ చాలా పాజిటివ్ గా ఉండటం హైలైట్.

ఇక ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ విషయానికి వస్తే ఈయన మోడీ మనిషా, లేకా అమిత్ షా మనిషా లేకా వీళ్లద్దరికీ లాయల్ గా ఉండే మనిషా.. లేక అసలు వీళ్లిద్దరికీ యోగి అంటే పడదా అనే చర్చ నిత్యం ఢిల్లీ, యూపీ పొలిటికల్ సర్కిళ్లలో వినిపించే రొటీన్ విషయం. దీనిపై క్లారిటీ ఎవరికీ లేదు. పార్లమెంటుకు అత్యధిక సంఖ్యలో పార్లమెంటు సభ్యులను పంపే కీలకమైన యూపీకి రెండవసారి భారీ మెజార్టీతో యోగి ఎన్నికయ్యారంటే ఈయన రాజకీయంగా మంచి పట్టున్న నేతనే అనటంలో సందేహం అక్కర్లేదు. ప్రధాని కంటే కఠినమైన హిందుత్వ అజెండాను వినిపించే వ్యక్తిగా యోగికి ఇమేజ్ ఉంది. మరోవైపు మోడీ పదవికి ఎప్పటికైనా అసలు సిసలు పోటీదారు సీఎం యోగినే అనేలా పార్టీలో, యూపీలో, యావత్ దేశంలో పదేపదే ఆదిత్యానాథ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది.

ఇక మోడీ, షాకు కాస్త గట్టి పోటీగా నిలిచిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విషయానికి వస్తే ఈయన్నే ఎంపీ సీఎంగా కొనసాగిస్తారా లేక జ్యోతిరాదిత్యా సింధియా వంటి వారిని మధ్యప్రదేశ్ సీఎం చేసి, ఎంపీ ఎన్నికల బరిలోకి బీజేపీని దించుతారా అన్నది మరో ఆసక్తికరమైన విషయం. ఎంపీ సీఎం విషయంలో బీజేపీ హైకమాండ్ ఆలోచన ఏంటి. ఎప్పటికైనా శివరాజ్ ప్రధాని పదవికి పోటీగా నిలుస్తారని మోడీ, షా భావిస్తున్నారా. అచ్చు ఆదిత్యానాథ్ లానే చౌహాన్ కూడా మోడీ ఇమేజ్ కు గట్టిపోటీ ఇచ్చే సీఎంగా ఎదిగారా అన్నది పార్టీలోనూ ఆసక్తిగా మారింది. ఇప్పుడు కాకపోయినా పలుమార్లు ఎంపీలో గెలిచిన సీఎంగా చౌహాన్ ఏకు మేకై భవిష్యత్తులో తలనొప్పులు తెస్తారని మోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే పరిస్థితి ఏంటో కూడా తెలియటం లేదు. ఓవైపు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొని వస్తుంటే మరోవైపు ఈమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు మోడీ టీం రెడీగా లేదు. దీంతో ఈమె సొంతవర్గం అంతా తిరుగుబాటు చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

ఈమేరకు ఈమె రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీతోనూ తెరవెనుక మంచి సంబంధాలు ఎప్పటినుంచో నెరుపుతున్నట్టు కూడా అభియోగాలున్నాయి. వసుంధరా రాజే ఇమేజ్ మోడీ-షా దృష్టిలో పాజిటివ్ గా లేకపోగా నెగటివ్ గా ఉండటం విశేషం. అందుకే రాజస్థాన్ సీఎంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పేరును వీరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ప్లేసులో ఇంకొకరికి ఛాన్స్ దొరుకుతుందన్నమాట. మరి అలాంటప్పుడు రాజే సైలెంట్ గా ఎందుకు ఉంటారు ఆమె రెబెల్ గా మారి బరిలోకి దిగుతారా. ఇవి ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలు.

కర్నాటకలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో సీఎం మార్పు తథ్యమా. ప్రస్తుతం సీఎంగా ఉన్న బసవరాజ్ బొమ్మై స్థానంలో వేరేవారిని కూర్చోబెడతారా. యడ్యూరప్పను ఇప్పటికే పార్టీ అత్యున్నత బాడీ అయిన పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించినా ఆయన ఆగ్రహంచల్లారలేదని సమాచారం. అందుకే మోడీ కర్నాటక పర్యటనకు యడ్యూరప్ప డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. బీఎల్ సంతోష్ పరిస్థితి ఏంటి.. ఈయనకు ఇతరులతో ఉన్న విభేదాల మాటేమిటి. మోడీ-షా ద్వయం కేంద్రంలోఅధికారం చేపట్టాక, ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని అప్పటి వరకూ పార్టీలో పెత్తనం చెలాయించిన ఓ స్థాయి ఉన్న నేతలనందరినీ పక్కన పెట్టేశారు. పూర్తిగా తమకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకునే క్రమంలో కొత్త వారిని తెరపైకి తెచ్చి, బాధ్యతలు కట్టబెట్టి.. వారితోనే పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుతూ.. కొత్త తరం నేతలను తయారు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఈ దెబ్బకి చౌహాన్, యోగి, రాజే, యడ్యూరప్ప ఇలా చాలామంది సీనియర్ నేతలు గిలగిలలాడుతున్నారు.

వ్యక్తిగతంగా చార్టెడ్ అకౌంటెంట్ అయిన పీయూష్ గోయల్ పై ఎటువంటి కంప్లైంట్ లేకపోయినా ఆయనకు ఎందుకో కీలకమైన ఆర్థిక శాఖ దక్కకపోగా అనూహ్యంగా ఈ పదవి నిర్మలా సీతారామన్ కు దక్కింది. పైగా బీజేపీలో ఇప్పుడున్న పరిస్థితులు జాగ్రత్తగా గమనిస్తే ఎవరికి, ఎందుకు, ఎలా ప్రమోషన్ వస్తోందో..ఎవరిపై ఏ కారణంగా వేటు పడుతోందో అర్థం కాని సందిగ్ధత నెలకొంది. దీంతో ఈ భవిష్యత్ ను అంచనా వేయటం అసాధ్యంగా మారుతోంది.

పొద్దున్న లేస్తే పార్టీ, ప్రభుత్వ విషయాలపై అనర్ఘళంగా ఇంగ్లీష్, హిందీల్లో మాట్లాడుతూ.. మీడియాలో కనిపించే సీనియర్లైన రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జావ్డేకర్ లు ఎందుకు తమ మంత్రి పదవి ఊడిందో ఇప్పటికీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. పార్టీలో ఏకైక మైనార్టీ ఫేస్ గా ఉన్న ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పరిస్థితి కూడా ఎవరికీ అంతుచిక్కటం లేదు. పాపం మంత్రిపదవి ఊడి ఏం చేయేలో అర్థంకాని చిక్కుల్లో పడ్డారు నఖ్వీ. ప్రస్తుతం ఉన్న బీజేపీలో అంతే..ఏవీ అర్థంకావు… కనీసం ముందస్తు క్లూ కూడా దొరకదు. అందుకే ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఏంటో..ఈ ఆపరేషన్ ఏంటో అని సీనియర్లంతా పరేషాన్ అయి ఉంటున్నారు.

రాత్రికి రాత్రి గుజరాత్ సీఎం విజయ్ రూపాణి, ఆయన యావత్ క్యాబినెట్ ను రద్దు చేయటం వెనకున్న కారణాలు కూడా ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. ఆతరువాత ఉన్నట్టుండి భూపేంద్ర పటేల్ మోడీ-షాకు ఫేవరెట్ గా మారిపోయారు.

ఈమధ్య కాలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-బీజేపీకి మధ్య ఉన్న అనుబంధానికి బీటలు వారినట్టు కూడా వార్తలు పొక్కుతున్నాయి. ఆర్ఎస్ఎస్ కు మోడీ వంటి పెద్ద ఇమేజ్ ఉన్న నేత కావాల్సిందే..ఈయనే ఇప్పుడు హిందూ పోస్టర్ బాయ్ కానీ మోడీ మాత్రం సంఘ్ పరివార్ పట్ల విధేయత చూపించటం లేదనేది అసలు కంప్లైంట్ గా మారిందట. పార్టీకి మించి ఎవరూ ఎదగకూడదని, పార్టీనే సర్వస్వం, అల్టిమేట్ అని.. పార్టీలో వ్యక్తి పూజకు స్థానం లేదనేది సంఘ్ పరివార్ సిద్ధాంతం దీన్ని ట్రాష్ గా కొట్టేసే మోడీ-షా ద్వయంతోనే అసలు చిక్కు వచ్చిందంటారు కొందరు.

ఇటు హిందుత్వ అజెండాను పూర్తిగా హైజాక్ చేసిన భజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు భవిష్యత్తులో మరింత దూకుడుగా వ్యవహరించేందుకు పకడ్బందీ ప్లాన్ రెడీ చేసుకుంది. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్న మోహన్ భాగవత్ పనితీరుపై భజరంగ్ దళ్ లోని కొందరు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అందుకే మోహన్ భగవత్ ఆమధ్య కొందరు ముస్లిం నేతలతో కలిసినప్పుడు, ఓ మసీదుకు వెళ్లినప్పుడు భారీగా ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగింది. ఇందులో భజరంగ్ దళ్ తోపాటు బీజేపీ వాళ్లు కూడా కీలక పాత్ర పోషించారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇటు మరో సీనియర్ నేత నితిన్ గడ్కరీ పరిస్థితి కూడా చాలా గందరగోళంగా తయారైంది. కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన్ గడ్కరీని తప్పించటం ఆయనను అవమానానికి గురిచేసింది. కానీ ఆర్ఎస్ఎస్ అండదండల కారణంగా ఆయన సైలెంట్ గా ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు గడ్కరీ స్థానంలో మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎదిగినట్టు అనుకునేలా సంఘ్ పరివార్, బీజేపీ ప్రవర్తిస్తోంది.

ఇదంతా సరేకానీ.. మరో 3 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీకి కూడా 75 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. మరి అప్పుడు ఆయన రాజకీయ అస్త్ర సన్యాసం చేసేస్తారా. అలా చేస్తే ఆయన పదవి ఎవరికి అప్పగిస్తారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషిల్లా ఆయన కూడా మార్గదర్శక మండలికి వెళ్లిపోతారా. దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది..అప్పుడు ఆయన రాష్ట్రపతి పదవిలోకి వెళ్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News