ప్రసిద్ధ రచయిత్రి తెన్నేటి హేమలత (లత) ఏది రాసినా ఆణిముత్యమే. 1960ల నుంచి 1990ల వరకు సాహితీ లోకాన్ని తన రచనలతో ఒక ఊపు ఊపిన లత సాహిత్య రంగంలో ఒక సంచలనం. ఒక కెరటం. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 1962లో రాసిన రామాయణ కల్పవృక్షం గ్రంథాన్ని ఖండిస్తూ రామాయణ విష వృక్షం పేరుతో ముప్పాళ రంగనాయకమ్మ ఒక గ్రంథం రాసినప్పుడు లత ఆ గ్రంథాన్ని ఖండిస్తూ 1977లో రాసిన రామాయణ విష వృక్షం-ఖండన గ్రంథం అప్పట్లో తెలుగునాట ఒక తీవ్రమైన సంచలనం సృష్టించింది. ఖండన పేరుతో ఆమె ఆ పుస్తకం రాసినప్పటికీ దాన్ని లత రామాయణంగా కూడా పరిగణించడం ప్రారంభించారు. ఆకాశవాణిలో అనౌన్సర్ గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన లత రేడియో నాటకాలతో తన సాహితీ రంగ ప్రవేశం చేశారు. ఆమె రచించిన ‘గాలి పడగలు-నీటి బుడగలు’ అనే నవలను చదవని వారు, ప్రభావితం కానివారు తెలుగునాట ఉండకపోవచ్చు. ముక్కు సూటిగా వ్యవహరించే తత్వం కలిగిన లత తన రచనల్లోనూ అదే తత్వాన్ని కనబరచేవారు.
ఆమె తన గురించి,జీవితంలోని తన అనుభవాల గురించి ఊహాగానం పేరుతో 1958 నుంచి 1962 వరకు మ్యూజింగ్స్ రాశారు. అయితే, అందులో ఆమె తన గురించి కంటే తన అనుభవాల గురించే ఎక్కువగా రాయడం జరిగింది. అనేక సినిమాలకు సంభాషణలు కూడా రాసిన లత తన జీవితం మొత్తం మీద 105 నవలలు రాశారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవి కాకుండా 700లకు పైగా రేడియా నాటికలు, వందలాది చిన్న కథలు, పది రంగస్థల నాటకాలు, అయిదు సంపుటాల సాహితీ వ్యాసాలు, పది సాహితీ విమర్శ సంకలనాలు, 25 చరిత్రకందని ప్రేమ కథలు రాశారు. ఆమె అహర్నిశలూ సాహితీ వ్యాసంగంలోనే గడిపారు. ఆమె రచనలు రాశిలోనూ, వాసిలోనూ ఒక రికార్డు సృష్టించాయి. స్త్రీవాద రచయిత్రిగా గుర్తింపు పొందిన లత ఒక సంచలన రచయిత్రిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇరవై సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ కొనసాగడం కూడా ఆమె జీవితంలో ఒక రికార్డే. 1981లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు ‘అసాధారణ మహిళ’ పురస్కారంతో సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆమెను ‘కళాప్రపూర్ణ’ బిరుదునిచ్చి గౌరవించింది.
ఆమె ఏ రచన చేసినా దాని వెనుక తీవ్రస్థాయి పరిశోధన, అధ్యయనం తప్పకుండా ఉంటాయి. స్త్రీవాదాన్ని కూడా ఆమె కొత్త పుంతలు తొక్కించారు. నిరంతర అధ్యయనశీలి అయిన లత స్త్రీల సమస్యలను లోతుగా స్పృశించడంతో పాటు బహుచర పేరుతో ట్రాన్స్ జెండర్ల జీవితాలపై రాసిన నవల ఎంతో ప్రసిద్ధి పొందింది. వాళ్ల జీవితాలను ఎంతో సన్నిహితంగా, సునిశితంగా పరిశీలించిన లత నిరంతరం శ్రమించి ఈ గ్రంథం రాయడం జరిగింది. ట్రాన్స్ జెండర్లు కొలిచే దేవతను బహుచర అంటారు. నిజానికి ఆమె తన గ్రంథాల్లో ఎక్కువగా చెప్పుకోకపోవడం నిజంగా విచిత్రమే. ఆమె ఇంతగా సాహితీ సేవ చేసినప్పటికీ, ఆమెకు సాధారణ పాఠక జనంలో అంతగా పేరు రాకపోవడం కూడా విచిత్రమే. ఆమె రచనల మీద ఎందరో
సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు పరిశోధన గ్రంథాలు రాసి డాక్టరేట్లు సంపాదించుకోవడం కూడా జరిగింది. స్త్రీల హక్కులు, అధికారాలు, స్వేచ్ఛ కోసం నిరంతరం పోరాడిన, తపించిపోయిన లత తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో సందేహం లేదు.