Friday, September 20, 2024
HomeఆటWrestling Federation: కుస్తీ సమాఖ్యకు మరో సువర్ణావకాశం

Wrestling Federation: కుస్తీ సమాఖ్యకు మరో సువర్ణావకాశం

బ్రిజ్‌ భూషణ్‌ పట్టు పలుకుబడి ఏ స్థాయిలో ఉన్నదో రుజువు ఇదే

కొత్తగా ఏర్పడిన భారత కుస్తీ సమాఖ్యను సస్పెండ్ చేస్తూ కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడం దేశ కుస్తీ క్రీడా ప్రపంచానికి నిజంగా శుభవార్తే. భారతీయ కుస్తీ క్రీడా రంగాన్ని ఏడాదిగా పట్టి పీడిస్తున్న కొన్ని సమస్యల నుంచి ఇక ఈ రంగానికి విముక్తి లభించే అవకాశం ఉంది. భారతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌, మరి కొందరు కోచ్‌లు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ 2023 జనవరిలో ప్రముఖ కుస్తీ యోధులు, ఒలింపిక్‌ విజేతలు అయిన సాక్షీ మాలిక్‌, భజరంగ్‌ పూనియా, విఘ్నేశ్‌ ఫోగత్‌ తదితరులు క్రీడా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను సమాఖ్య అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆయనపై పోలీసు కేసు నమోదు చేయడం కూడా జరిగింది.
అయితే, గత గురువారం శరణ్‌ సింగ్‌ దీర్ఘకాలిక విధేయుడు సంజయ్‌ సింగ్‌ను ప్రభుత్వం ఈ సమాఖ్యకు అధ్యక్షుడుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరిగిన 15 పోస్టులలో 13 పోస్టులకు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు సంబంధించిన వ్యక్తులే ఎంపికయ్యారు. ఇందులో ఒక్క మహిళకు కూడా స్థానం లభించలేదు. ఇక బ్రిజ్‌ భూషణ్‌ నివాసం బయట గజమాలలతో నిలబడి ఉన్న బ్రిజ్‌ భూషణ్‌ పక్కనే సంజయ్‌ సింగ్‌ నిలబడి ఫోటోలు తీయించుకోవడం, విజయ సంకేతాలు చూపిస్తూ ఉండడం పత్రికల్లోనూ, టీవీ ఛానల్స్‌ లలోనూ కనిపించాయి. నిజానికి ఆయన నివాసం కూడా ఒక విధంగా సమాఖ్య కార్యాలయంగానే పనిచేస్తోంది. మొత్తానికి ఇవన్నీ సమాఖ్యను వెనుక నుంచి ఎవరు అజమాయిషీ చేయబోతున్నదీ చెప్పకనే చెబుతున్నాయి. ఇది మహిళా కుస్తీ యోధులకు ఎంతగా మనస్తాపం కలిగించిందంటే, సాక్షీ మాలిక్‌ తాను ఇక ఈ రంగం నుంచి తప్పుకుంటున్నట్టు కన్నీళ్లతో ప్రకటించడం జరిగింది. ప్రస్తుత కుస్తీ సమాఖ్యలో మహిళలకు భద్రత ఉంటుందనే నమ్మకం తనకు లేదని విఘ్నేశ్‌ ఫోగత్‌ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ వ్యవహారానికంతటికీ నిరసనగా భజరంగ్‌ పూనియా తన పద్మశ్రీని తిరిగి ఇచ్చేయడానికి నిర్ణయించారు.
ఇదంతా చూసిన క్రీడా మంత్రిత్వ శాఖ ఇబ్బందికర పరిస్థితిలో పడింది. సంజయ్‌ సింగ్‌ను సమాఖ్యకు అధ్యక్షుడుగా నియమించడం తొందరపాటు చర్యేనని అంగీకరించింది. అంతేకాక, సమాఖ్య నిబంధనావళి ప్రకారం సెక్రటరీ జనరల్‌ ప్రేమ్‌ చంద్‌ లోచాబ్‌ను సంప్రదించిన తర్వాత టోర్నమెంట్లను పునరుద్ధరించాల్సి ఉండగా, ఆయనతో మాట మాత్రంగా చెప్పకుండా సంజయ్‌ సింగ్‌ తనకు తానుగా ఈ మేరకు ప్రకటన చేయడం కూడా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు ఆగ్రహం కలిగించింది. సమాఖ్యలో బ్రిజ్‌ భూషణ్‌ను వ్యతిరేకించే కొద్దిమంది కార్యవర్గ సభ్యులలో లోచాబ్‌ కూడా ఒకరు. పైగా, కొత్త సమాఖ్య ఏర్పడినప్పటికీ, బ్రిజ్‌ భూషణ్‌ తో సహా పాత సమాఖ్య కార్యవర్గ సభ్యులే సమాఖ్య వ్యవహారాలను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మంత్రిత్వశాఖ దృష్టికి వచ్చింది. దేశంలో క్రీడా సమాఖ్యల వ్యవహారాలు ఏ విధంగా ఉన్నదీ కుస్తీ సమాఖ్య వ్యవహారాలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలో ఒక పక్క పలువురు క్రీడాకారులు అత్యంత ప్రతిభా పాటవాలు కనబరుస్తూ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న దశలో, క్రీడా సమాఖ్యలు అధికారుల చేతుల్లో కీలుబొమ్మలై, పురాతన పద్ధతులనే అనుసరిస్తున్నాయి.
క్రీడా సమాఖ్యల్లో ఉన్న క్రీడాకారులకు, సమాఖ్యలను నిర్వహిస్తున్న రాజకీయ నాయకులకు ఏమాత్రం పొసగడం లేదు. రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం తాపత్రయపడుతుండగా, అందులోని క్రీడాకారులు పతకాల గురించి ఆలోచించడం జరుగుతోంది. కుస్తీ వీరుల విషయానికి వస్తే, భారతీయ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పి.టి. ఉష గానీ, అథ్లెటిక్స్‌ కమిషన్‌ లో ఉన్న ప్రముఖ క్రీడాకారులు కానీ, కుస్తీ సమాఖ్య తీరుతెన్నుల పట్ల, కుస్తీ మహిళల అవస్థల పట్ల ఏ విధంగానూ స్పందించడం లేదు. బ్రిజ్‌ భూషణ్‌ పట్టు పలుకుబడి ఏ స్థాయిలో ఉన్నదీ ఇది రుజువు చేస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించిన తర్వాత కానీ, బ్రిజ్‌ భూషణ్‌ మీద ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు కాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. సంజయ్‌ సింగ్‌ నాయకత్వంలోని సమాఖ్యను క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసినందు వల్ల, ఇప్పటికైనా కుస్తీ సమాఖ్యను ప్రక్షాళన చేయడం, ఇందులో సంస్కరణలు చేపట్టడం చాలా మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News