Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్ఆదివాసుల భక్తికి అన్య సంస్కృతుల ప్రమాదం

ఆదివాసుల భక్తికి అన్య సంస్కృతుల ప్రమాదం

అంతరించి పోతున్న స్వచ్ఛమైన ఆదివాసీ సంస్కృతి

విలక్షణమైన జీవితం ఆదివాసులది. వీరు ఆదిమ కాలం నుంచి ఆచార సంస్కృతులకు చిరునామాదారులు. మూలవాసీ సంస్కృతి ఆచారాలను తప్పక పాటిస్తారు. నేడు కాలానుగుణంగా వస్తున్న ఆధునిక మార్పుల్లో భాగస్వాములు అవుతున్నారు. ఆధ్యాత్మికత, భక్తిభావానికి గల భేదాలు తెలియని ఈ గిరిజనులకు తెలిసిందల్లా నమ్మకంతో ముడిపడ్డ భక్తి మాత్రమే. దానినే ఆచరిస్తారు. వారికి ఉన్నది సాధారణ పరిజ్ఞానం మాత్రమే. మౌఖిక సాహిత్యం వల్ల, ఆధ్యాత్మిక చింతనలు, పునర్జన్మలు, ముక్తి మార్గాలు వారికి తెలియవు. బ్రతికినన్ని రోజులు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించటం మాత్రమే వారికి అవసరం. వారికి గల నిండైన కృతజ్ఞత, విశ్వాసాల సాక్షిగా నిరాకారులైన వారివారి కుల, గ్రామ దేవర్లనే పూజిస్తారు. వారి ఇలవేల్పులైన నాగోబా, జంగుబాయి, పెర్స పెన్, మేడారం సమ్మక్క, సారక్క, గుంజేడు ముసలమ్మ, కొమ్మలమ్మ, సడలమ్మ, గట్టమ్మ, దూలుగొండ, మారయ్య వంటి దైవాలను గౌరవించుకుంటారు. మొక్కులు చెల్లించుకుని జీవిస్తుంటారు. వారికి వ్రతాలు, నోములు, పూజలు, మంత్రాలు, హోమాలు తదితర వాటితో సంబంధం లేదు. వాటిని ఆచరించి అంతులేని పుణ్యం, సంపదలు రావాలని వారు కోరుకోరు. వాటి అవసరం కూడా వారికి లేదు. కేవలం వారి పూర్వాచారాలే వారసత్వంగా అమలవుతున్నవి.

- Advertisement -

అనారోగ్యం పాలైతే తెలిసిన మూలికా వైద్యం చేసుకుంటారు. మనోధైర్యం కోసం వారాంతపు దేవర్ల దగ్గరకు వెళ్లి పూనకం దేవర్లు చెప్పే ధైర్యపు మాటలు వింటారు. దీనితో మనోధైర్యం పెంచుకొని జబ్బుల బారి నుండి బయటపడుతుంటారు. పంటలు బాగా పండాలని కోరుకుంటారు. పంటలు బాగా పండాలని దేవర్లకు మొక్కుకుంటారు. కృతజ్ఞతతో వారికి ధాన్యం, ఇప్పసారా, మాంసాహారం వంటి వాటిని ప్రసాదంగా సమర్పించుకుంటారు. ఒక రకంగా గిరిజనుల భక్తి భావనలో కేవలం నమ్మకం, కృతజ్ఞతలు తప్ప ప్రతిఫలాపేక్ష ఏ మాత్రం ఉండదు. ఇది ఒకనాటి గిరిజనుల భక్తి భావనల తీరు. అయితే, నేటి ఆధునిక కాలంలో వస్తున్న మార్పుల్లో భాగంగా వీరి భక్తి విధానాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక దైవాలైన శ్రీరాముడు, ఆంజనేయులు, గణపతి, అయ్యప్పలను పూజిస్తున్నారు. మాల ధారణలు, దీక్షలు మొదలు పెట్టారు. మొదట జంగుబాయి, సమ్మక్క – సారక్క మాల ధారణ దీక్షలకే పరిమితమయ్యే వారు. వీరు, గిరిజనేతరులతో కూడా కలిసి విడివిడిగా భక్తి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగానే, ఇటీవల గిరిజన గ్రామాల్లో విరివిగా గణేష్ మండపాలు వెలిశాయి. గ్రామస్తులంతా చందాలు వేసుకుని పూర్తి ఆధునిక పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రులు మొత్తం పూజలు చేసే ఆర్థిక స్థోమత లేక మూడు లేదా ఐదు రాత్రులతో ముగించి నిమజ్జనం చేస్తున్నారు. అనంతరం సామూహిక అన్నదానంలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, నిమజ్జనం, శోభా యాత్రల్లో మాత్రం తమదైన డోలు వాయిద్యం, గిరిజన నృత్యాలతో సాంప్రదాయపు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. దీనితో తమ గిరిజన సంస్కృతిని చాటుకోవడం విశేషం. ఇదే క్రమంలో సంక్రాంతి నాడు శ్రీరామ భజన చేస్తూ గిరిజన గ్రామాల్లో పల్లకి సేవలు నిర్వహిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో జరిగే శివరాత్రి నాటి శివకళ్యాణం, హోలీకి, శ్రీరామ నవమి నాటి సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నారు. సృసింహ జయంతికి జరిపే నరసింహ కళ్యాణం జరుపుకుంటున్నారు. భద్రాచలంలోని రామాలయంలో శబరి స్మృతి యాత్ర వంటి వివిధ తీర్ధాలకు గిరిజనులు అధిక సంఖ్యలో వెళుతున్నారు. కాని వీటివెనుక మనువాదం మిళితం అయిందని ఆలోచించడం లేదు. కానీ, తమ సంస్కృతికి విఘాతం ఏర్పడితే గిరిజన జాతి ఉనికికే ప్రమాదమని గుర్తించాలి.

గిరిజనుల్లో అధికంగా సామూహిక కార్యక్రమాలు, ప్రయాణాలు ఉంటాయి. మద్యపాన వ్యసనం నుండి దూరం కావడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. సాధారణ ఆరోగ్యం కోసం, గిరిజన యువత అధికంగా మాలధారణ దీక్షలు చేపడుతున్నారు. అంజన్న మాల ధరించే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. తరువాత క్రమంలో అయ్యప్ప, దుర్గమ్మ, శ్రీరామ దీక్షదారులు ఉంటున్నారు. మరోవైపు గిరిజనుల్లో కొందరు ఆర్థిక వెసులుబాటు అనారోగ్యాల నుంచి స్వస్థత పొందే క్రమంలో చర్చీలకు వెళుతున్నారు. పాస్టర్ల ఆర్థిక పురోభివృద్ధి ప్రత్యక్షంగా చూసిన కొంతమంది గిరిజన యువకులు పాస్టర్లుగా కూడా మారుతున్నారు. దీనితో ప్రతి గిరిజన గ్రామంలో చర్చిలు వెలుస్తున్నాయి. మరోపక్క తమ జాతి పండుగలకు దూరమైతున్నారు. వారిదైన గిరిజన సంస్మృతికి సంబంధించిన కొత్తల పండుగ, విత్తనాల పండుగ, వివిధ తెగల, గోత్రాలకు నిర్దేశించిన ఇలవేల్పు పండుగలను మర్చిపోతున్నారు. గ్రామ పండుగలైన ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ తదితర పండుగలకు, జాతర్లకు కూడా దూరమమైతున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో అక్షరాస్యులు, ఉద్యోగులైన గిరిజన యువత ఏర్పాటు చేసుకున్న తుడుందెబ్బ, సంక్షేమ పరిషత్, ఆదివాసీ సేన తదితర గిరిజన సంఘాలు ఈ ఆధునిక భక్తి భావాలపట్ల వ్యతిరేకతను ప్రకటిస్తున్నాయి.

తమదైన గిరిజన సంస్కృతికి సంబంధించిన దేవర్లను, ఇలవేల్పులను, ఆదివాసీ వీరులను మాత్రమే పూజించుకునే ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అందువలన మేడారంలో ఆదివాసీ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చెయ్యాలి. ఈ చైతన్యం దిశగా గిరిజన సంఘాలు ప్రత్యక్ష కార్యాచరణకు పునుకోవాలి. అక్షరాస్యత ద్వారా గిరిజనుల్లో వచ్చిన సామాజిక, ఆర్ధిక మార్పుల వల్ల, జీవన విధానంలో చక్కటి మార్పు వచ్చింది. అది ఆనందదాయకమే. నేటి గిరిజన యువతలోని అక్షరాస్యత కేవలం ఉద్యోగాల కోసం, ఆర్ధిక వృద్ధి కోసం మాత్రమే కాదు. తమదైన సంస్కృతులను, సాంప్రదాయాలను, తమ అస్తిత్వాన్ని సంరక్షించుకోవాలి. తమ జాతి ప్రజలను చైతన్యపరచడానికి ఉపకరించాలి. ప్రభుత్వాల పరంగా ఆదివాసులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో తమదైన ఆలోచనా శక్తి, చైతన్యంతో ఉత్తమ జీవన విధానంలో కొనసాగాలి. సంస్కృతి సంరక్షకులై, సదా ఆరోగ్యాలతో, అభివృద్ధి సాధించాలి.
* గుమ్మడి లక్ష్మీనారాయణ,
ఆదివాసీ రచయితల వేదిక,
సెల్ : 9491318409

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News