Saturday, November 23, 2024
Homeనేషనల్INDIA Alliance no direction: ‘దిక్కు’తోచని స్థితిలో ఇండియా కూటమి

INDIA Alliance no direction: ‘దిక్కు’తోచని స్థితిలో ఇండియా కూటమి

మోదీకి ధీటైన అభ్యర్థిని ఇప్పటికీ ఎంపిక చేయలేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది

సార్వత్రిక ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగబోతున్నాయనగా, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధాన హిందీ రాష్ట్రాలను కోల్పోవడం ఆ పార్టీలోనే కాక, ఇండియా కూటమిలో కూడా నైరాశ్యాన్ని పెంచినట్టు కనిపిస్తోంది. పైగా 28 పార్టీల ఇండియా కూటమిలో ఇంతవరకూ ఒక ఉమ్మడి అజెండా రూపుదిద్దుకోకపోవడం దీని విజయావకాశాలపై అనుమానాలు రేకెత్తిస్తోందంటూ సంశయాత్ములు ప్రచారం చేస్తుండడం కీలక నాయకులను మరింతగా నిరాశా నిస్పృహలకు గురి చేస్తోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీకి ధీటైన పోటీగా సరైన అభ్యర్థిని ఇప్పటి వరకూ ఎంపిక చేయలేకపోవడం ఇండియా కూటమి శక్తి సామర్థ్యాల మీద అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ అనుమానాలకు, సందేహాలకు ఇండియా కూటమి నాయకుల్లో ఎవరి దగ్గరైనా సమాధానం ఉందా అన్నది అంతుబట్టడం లేదు.

- Advertisement -

నరేంద్ర మోదీకి గట్టి పోటీ ఇవ్వగల నాయకుడు ఇండియా కూటమిలో ఉన్నాడా అన్న ప్రశ్నకు ముందుగా సమాధానం వెతకాల్సి ఉంటుంది. గత రెండు పర్యాయాల ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా, తన ప్రధాన ఎన్నికల ప్రచార సారథిగా మోదీని ప్రజల ముందుంచడం ఖాయమని అర్థం అవుతూనే ఉంది. 2014లో ప్రతిపక్ష కూటమి ‘మై నహీ, హమ్’ (నేను కాదు, మేము) అనే నినాదాన్ని చేపట్టింది కానీ, ఏ కారణంగానో ఆ నినాదాన్ని ఆ తర్వాత వదిలేసింది. ఆ నినాదాన్ని కొనసాగించి ఉంటే ఇప్పుడు అది ఈ ప్రశ్నకు సరైన సమాధానమ య్యేది. ‘నేను’, ‘నా’ అనే మాటలను వినీ వినీ ప్రజలకు ఈ పాటికి విసుగుపుట్టేసి ఉంటుంది. ఇది వ్యక్తి పూజ తప్ప మరేమీ కాదని కూడా వారికి అర్థమైపోయి ఉంటుంది. బీజేపీ మాదిరిగా ఒకే వ్యక్తి మీద ఆధారపడక, ఇండియా కూటమి ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడే సమష్టి నాయ కత్వం మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇండియా కూటమిలోని అనుభవజ్ఞులైన నాయకులంతా కలిసి సమష్టిగా పనిచేయడం ద్వారా దేశాన్ని కొత్త పుంతలు తొక్కించవచ్చు.

కాంగ్రెస్ విధానాలే శ్రేష్ఠం
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆశయాల కోసం, ఏ లక్ష్యాల కోసం పాటుపడుతోందో వాటినే భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి కట్టుబడి ఉండడం మంచిది. దేశానికి ఇటువంటి అజెండానే అందించడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరంగా కనిపిస్తోంది. పాలనాపరంగా బీజేపీ ఘోరంగా వైఫల్యం చెందినప్పటికీ, అది చేస్తున్న సానుకూల ప్రచారం దానికి విజయాలను తెచ్చి పెడుతోంది. ఆ
పార్టీలోని ప్రచార యంత్రాంగం పటిష్టంగా, శక్తిమంతంగా పనిచేస్తుండడం వల్ల ఆ పార్టీకి ఎదురు లేకుండాపోతోంది. ఇందుకు ప్రతిగా దేశ ప్రజలు ఇండియా కూటమి నుంచి సానుకూల వ్యవహార శైలిని, సానుకూల సందేశాన్ని కోరుకుంటున్నారు. కేవలం మోదీ మీదా, బీజేపీ మీదా ఆరోపణలు, విమర్శలు చేసి ఉపయోగం లేదు. దేశానికి తాను ఏం చేయదలచు కున్నదీ ఇండియా కూటమి చెప్పగలగాలి. దేశాభివృద్ధి విషయంలో తన విజన్ ఏమిటన్నది ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించగలగాలి.

స్వాతంత్ర పోరాట కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి ఉంది. ఇండియా కూటమిలోని పార్టీలు సైతం ఇందులో కొన్ని సిద్ధాంతాలను పుణికి పుచ్చుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, బడుగు వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, దళితులు, మహిళలు, ఆదివాసీలు తది తరుల సంక్షేమం వంటి అంశాలకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. అయితే, కాలక్రమంలో వీటినన్నిటినీ సిద్ధాంతాలుగా కాకుండా ఓటు బ్యాంకు రాజకీయాలుగా పరిగణించడం ప్రారంభమైంది. అయితే, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే ఈ సిద్ధాంతాలను నియమబద్ధంగా అనుసరిస్తోంది. ఈ సిద్ధాంతాలనే ఇండియా కూటమి కూడా మరింతగా ఆచరించాల్సిన అవసరం ఉంది.

దేశంలోని బహుళ జాతులకు, బహుళ సంస్కృతులకు ఇండియా కూటమి అద్దంపడుతోంది. దేశ సంస్కృతిలో భాగమైన లౌకికవాదానికి ఇది మనసా వాచా కర్మణా కట్టుబడి ఉంది. లౌకికవాదం అనేది కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే ఉంది. ఈ విలువల గురించి చెప్పుకోవడానికి, ఈ విలువలకు కట్టుబడి ఉండడానికి కాంగ్రెస్ పార్టీ గానీ, ఇండియా కూటమి పార్టీలు గానీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. బీజేపీ ఈ బహుళ జాతుల, బహుళ సంస్కృతుల సాంప్రదాయానికి స్వస్తి చెప్పి, హిందూ రాష్ట్ర వాదాన్ని చేపట్టడంతో అల్పసంఖ్యాక వర్గాలు అభద్రతాభావానికి లోను కావడం జరుగుతోంది. భారతదేశ మౌలిక స్వరూపం, స్వభావం అయిన లౌకికవాదం నిర్వీర్యమయితే, దేశ మనుగడే ప్రశ్నార్థకమవుతుందనడంలో సందేహం లేదు. నిజానికి, కాంగ్రెస్ పార్టీ కట్టుబడిన విలువలకు, బీజేపీ ప్రవచించే విలువలకూ ఎక్కడా పోలికే లేదు. ఈ రెండు పార్టీల భావాల మధ్యా, సిద్ధాంతాల మధ్యా హస్తిమశకాంతరం తేడా ఉంది. అల్పసంఖ్యాక వర్గాలకు సాధికారికత కల్పించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, ఆ వర్గాలను పక్కకు తప్పించాలన్నది బీజేపీ ప్రధాన ధ్యేయంగా కనిపిస్తోంది.

తిరోగమన విధానాలు
ఎన్నికల సమయంలో సాధ్యమైనంత ఎక్కువ మందికి టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ తాపత్రయ పడుతుండగా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏనాడూ జరగని విధంగా బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. లోక్ సభలో కానీ, రాజ్యసభలో కానీ ఆ పార్టీకి ఒక్క ముస్లిం సభ్యుడు కూడా లేకపోవడం విచారకరం. రాజకీయ పునరేకీకరణే ధ్యేయంగా బీజేపీ నాయకులు అల్పసంఖ్యాక వర్గాలపై హింసాకాండను ప్రేరేపించడం జరుగుతోంది. ఆ హింసాకాండను చల్లార్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇండియా కూటమి తన దృష్టిని అభివృద్ధి మీదకు మళ్లించాల్సి ఉంది. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ ఎక్కడ? అచ్ఛే దిన్ ఎక్కడ? అమృత్ కాల్ ఎక్కడ? ఈ నినాదాలన్నీ ఎక్కడికి పోయాయి? పదేళ్ల యు.పి.ఏ హయాంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఉపాధి హామీ, ఆర్.టి.ఐ, ఆర్.టి.ఇ, ఆహార భద్రత, కోట్లాది ఉచిత బ్యాంక్ ఖాతాలు తదితర అంశాలకు ప్రచారం కల్పించాల్సి ఉంటుంది.

అల్ప సంఖ్యాక వర్గాలతో సహా భారతీయులందరి ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ పాటు బడుతూ వస్తోంది. ఆర్థిక సరళీకరణను చేపట్టింది కాంగ్రెస్ పార్టీయే. సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నది కూడా కాంగ్రెస్ పార్టీయే. దేశ ఆర్థికాభివృద్ధికి పథకాలు, కార్యక్రమాలు రూపొందిస్తూనే, వాటి ఫలాలు బడుగు వర్గాలకు, మారుమూల ప్రాంతాలకు అందేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పేదల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ పాలనలో కోట్లాది మంది పేదలను ఆర్థికంగా అభ్యున్నతి పథంలోకి తీసుకు రావడం జరిగింది. ఈ
ప్రయత్నాలను మరింతగా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని అన్ని వర్గాలకూ మేలు జరిగితే తప్ప దేశం వెలిగిపోవడం జరిగే పని కాదు.

పట్టణ ఓటర్లపై దృష్టి
పట్టణ ఓటర్ల అభ్యున్నతి కూడా కాంగ్రెస్ కట్టుబడి ఉంది. గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు, పథకాలు చేపట్టి అమలు చేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం వీటిని కొనసాగించడం మాత్రమే జరుగుతోంది. పట్టణ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ఇంతవరకూ చేసిందేమీ లేదని, పట్టణ పాలనలో బీజేపీ దారుణంగా విఫలం అయిందని, పట్టణ ప్రజల ఓట్లకు బీజేపీ అర్హురాలు కాదని ఇండియా కూటమి చాటి చెప్పాల్సి ఉంది. ఇక గ్రామీణ ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘనంగా చేపట్టి అమలు చేసిన పథకాలను కూడా ఇండియా కూటమి వీలైనంతగా ప్రచారం చేయాల్సి ఉంది. రైతు కూలీలకు ఉపాధి హామీ పనులను కల్పించడంతో పాటు, వాటి నిధులను కూడా ఏటా పెంచడం జరిగింది. రుణ మాఫీలు చేయడం జరిగింది. గిట్టుబాటు ధరలను కల్పించింది. విమర్శకులు దీనిని సంక్షేమమనో, ఉచితమనో వ్యాఖ్యలు చేయవచ్చు. అయితే, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు కాంగ్రెస్ పార్టీ గర్వపడాలే తప్ప సిగ్గుపడకూడదు.

బీజేపీ మాత్రమే జాతీయవాదాన్ని భుజాలకెత్తుకుంటోందనే అభిప్రాయం సరికాదు. జాతీయ ప్రయోజనాల కోసం పాటుపడిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే. దేశ జాతీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది. దేశీయ విధానాలు, విదేశీ విధానాలు పూర్తిగా జాతీయవాదానికి అనుగుణంగానే అనుసరించడం జరిగింది. పార్టీ నాయకులు వీటి గురించి గొప్పగా ప్రచారం చేసుకోవాల్సి ఉంది. బీజేపీ చెబుతున్న జాతీయవాదం పూర్తిగా పక్షపాతంతో, స్వార్థంతో కూడుకుని ఉంది. దేశంలోని యువత భవిష్యత్తుకు అవసరమైన యవిజన్ ను కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల ముందుంచాల్సి ఉంది. దేశంలోని 30-40 ఏళ్ల మధ్య యువతీ యువకులకు కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందో, ఏం చేయబోతోందో తెలియజేయాల్సి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో యువత అభ్యున్నతికి సంబంధించిన పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఈ పథకాలనే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేస్తామనే హామీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

ఇవే కాదు, మరెన్నో చేయాల్సి ఉంటుంది. చెప్పాల్సి ఉంటుంది. అతి పురాతన, అత్యంత అనుభవం కలిగిన, దేశ ప్రజలందరినీ కలుపుకుని వెళ్లగలిగిన కాంగ్రెస్ పార్టీ దేశ భవిష్యత్తు విషయంలో ఎటువంటి ప్రణాళికలతో ఉన్నదీ యువతకు తెలియజేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశానికి పూర్వ వైభవాన్ని
సంతరించుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఇవే విధానాలను ఇండియా కూటమి కొనసాగించడం దేశానికి చాలా మంచిది.

– ఎస్. ఆనందరావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News