రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు జోరుగా నడుస్తున్నాయి. బెల్ట్ షాపుల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. వ్యాపారం సంగతి దేవుడెరుగు కానీ బెల్టు షాపులు మాత్రం కక్షలకు, కార్పణ్యాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఎవరితోనైనా గొడవకు దిగాలన్నా, బెల్టు షాపులలో అర్థరాత్రిలు మద్యం తాగుతూ అక్కడే రచనలు చేస్తున్నారు. వైన్స్ షాపుల యజమానులు బెల్ట్ షాపుల యజమానుల నుండి ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. వైన్స్ షాపులు సిండికేట్ గా మారి అధిక లాభాల కోసం బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నాయి. కస్టమర్ అడిగినా మద్యం లేదు అంటూ వాళ్లకు ఆఫర్లుగా వచ్చిన మద్యాన్ని జనాలకు అంటగడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ రూల్స్ ధిక్కరించి వైన్ షాప్ నిర్వాహకులు ఎమ్మార్పీకి మించి, బెల్ట్ షాపులకు మద్యాన్ని అమ్ముతున్నా కూడా అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతను పెడదోవ పట్టించటంలో మొదటి కారణం మద్యమే అంటూ మద్యం ప్రియుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.