మనుష్యులు సాధారణంగా ఏ పని చేసినా తక్షణ ప్రయోజనం కోసమే చేస్తుంటారు. అది అవశ్య కర్తవ్యం కూడా. వారు చేసే వృత్తులూ, ఉద్యోగాలూ, కార్యకలాపాలూ తాత్కాలిక జీవన గమనం కోసమే! తమ ఆశలూ, ఆకాంక్షలూ అన్నీ వర్తమానం మనుగడ కోసమే! ఇవన్నీ స్వార్థ ప్రయోజనాల సంసిద్ధికి మాత్రమే దోహదం చేస్తాయి. ఆశలు అందరికీ ఉంటాయి. కానీ ఆశయాలు మాత్రం కొందరికే ఉంటాయి. ఆశలు స్వార్థపూరితమైనవైతే, ఆశయాలు పరార్ధ సాధనకు సోపానాలు నిర్మిస్తాయి. ఆశయ సాధనలో స్వార్థ చింతనకు ఎంతమాత్రమూ తావుండదు. ఒక్కొక్కసారి స్వార్ధ ప్రయోజనాలను సైతం కోల్పోవలసి ఉంటుంది. ఖండితంగా చెప్పాలంటే త్యాగం చెయ్యగలవారు మాత్రమే ఆశయ సాధనకు పూనుకోగలరు. ఒక్కొక్కసారి త్యాగం చేసినా కూడా ఆశయం సిద్ధించకపోవచ్చు. ఆయా ఆటుపోట్లను, కష్టనష్టాలను భరించగలవారు మాత్రమే ఆశయ సాధనలో ముందడుగు వెయ్యగలరు. ప్రముఖ అభ్యుదయ కవి
సీరపాణి ‘ముందు తరాల కోసం’ అనే కవితలో ఆ విషయాన్నే వివరిస్తున్నారు. ఈ కవిత ఈయన రచించిన
‘డమరుధ్వని’ అనే కవితా సంపుటి లోనిది.
‘నాకు తెలుసు
ఈ నవతా క్రతుకుండం
నన్ను బలిగోరుతుందని
ఈ విప్లవ హవనాగ్నిచ్ఛటా జాల జిహ్వాంచలాలు
నా నెత్తురు చవి చూస్తాయని’
క్రతువు అంటేనే బలిదానం కోరుతుంది. ఇది నవతా క్రతువు అంటే సామ్యవాదం కోసం చేసేది. ఈ క్రతువు స్వరూపం ఎటువంటిది? అలజడులు, ఆందోళనలు అభివృద్ధి నిరోధక శక్తులతో సంఘర్షణలు. ఉద్యమకారుడు ఈ ప్రయత్నంలో ఏ
కష్టానికైనా, నష్టానికైనా సిద్ధం కావాలి. కవి ఈ కవితలో విప్లవ హవనాగ్ని అనివాచ్యంగానే చెబుతున్నాడు.
హవనాగ్నిచ్ఛటా జాలాలను నాలుకలతో పోల్చి, అవి తన నెత్తురు చవి చూస్తాయని తనకు ముందుగానే
తెలుసునంటున్నాడు.
‘ఈ భీకర వర్తమాన పంచానన వదన గహ్వరం
నాకోసం తెరుచుకుందని
ఈ దురంత పాశవిక కృతాంత పాశాలు
ఎప్పుడో నా కంఠాన్ని కౌగిలించుకుంటాయని
నాకు తెలుసు’
వర్తమానం అనే భయంకరమైన సింహం నోరు అనే గుహ తన కోసమే తెరుచుకుందనీ, ఈ అంతులేని ముష్కరమైన
యమపాశాలు ఏదో ఒకనాడు తన కంఠాన్ని చుట్టుకుంటాయని తనకు తెలుసును అంటున్నాడు. ప్రగతిశీలుడైన వ్యక్తికి
తన ఆశయ సాధనలో ఎదురయ్యే కఠిన దండనలు ముందుగానే దృగ్గోచరమవుతాయని కవి భావం.
ఇంత కష్టభూయిష్టమైన ఆశయ సాధనకు మరి తాను ఎందుకు ఉద్యుక్తుడౌతున్నాడు? అనే ప్రశ్నకు కవి స్పష్టంగానే
వివరణ ఇస్తున్నాడు.
‘కాని,
పాప పుణ్యాల పరమార్ధం తెలియని
రేపటి పసిపాపలు
చెదపట్టిన ఈ భూమిని చూసి
కెవ్వుమని విలపించకూడదు’
ఇప్పటికిప్పుడు ఎంత ఉద్యమించినా ప్రజాస్వామిక జగత్తులో ఫలితం సాధించడం అసాధ్యం. ఈ విషయం గుర్తెరిగే కవి
అంటున్నాడు. రేపటి పసిపాపలు పాపపుణ్యాలు తెలియని వారు. అంటే సామాజికంగా ఎదురయ్యే దురవస్థలు
ఎరుగలేనివారు. అలాంటి అమాయకులు ఎక్కడికక్కడే ఛిద్రమైన ఈ సామాజిక వ్యవస్థను చూసి కెవ్వుమని ఏడ్వరాదు అంటున్నాడు కవి.
‘మానవతా సమీరపరీమళాలు గుబాళించవలసిన
రేపటి స్వేచ్ఛాప్రసూనాలు
గండు తుమ్మెదల అమానుష కృత్యాలకు
బలి కాకూడదు’
ఇంతవరకూ ఎలావున్నా రాబోయే కాలంలోనైనా సభ్యసమాజం మానవత్వంతో కూడిన నవ సమాజాన్ని
నిర్మించుకోవాలి. అప్పుడు మాత్రమే స్వేచ్ఛాప్రసూనాల వంటి బాలికలు కామంధుల దురాగతాలకు బలికాకుండా
ఉంటారు.
‘అమృతం హాలాహలం సమంగా పంచుకోవలసిన
రేపటి చిరంజీవులు
స్వార్థపరుల చేతుల్లో దగా పడకూడదు
సౌమనస్య సౌధాలు నిర్మించుకోవలసిన
రేపటి నా ప్రజలు
అడ్డుగోడల నధిగమించలేక
అఘోరించకూడదు’
కవి వాంఛించేది సామ్యవాద జగత్తు. మనకు సామాజికంగా సంక్రమించే కష్టసుఖాలను, లాభనష్టాలను అందరం సమానంగానే అనుభవించాలి. అంతేకానీ కష్టాలు కొందరివి, సుఖాలు కొందరివి కాకూడదు. అలా అయితే స్వార్ధపరుల చేతుల్లో దగాపడినట్లే! సౌమనస్య సౌధాలు నిర్మించడం అంటే సర్వ మానవ సౌభ్రాతృత్వం సాధించడం. అటువంటి ఆదర్శలతో కూడిన భావి భారత పౌరులు కులమత ప్రాంతీయ బేధాలు, సామాజిక ఆర్థిక అసమానతలు అనే అవరోధాలను దాటలేక సతమతం కాకూడదని కవి భావం.
‘అందుకే
మోస్తున్నానిన్ని అవమానాల లగేజీలు
అందుకే
కాస్తున్నానిన్ని అపజయాల ఎదురు దెబ్బలు
అందుకే
అందుకుంటున్నాను అనంతకోటి శాపాలు
అనుభవిస్తున్నాను చెయ్యని పాపాలు’
ప్రగతివాది భవిష్యత్తులో తన ఆశయ సాధనలో ఎదురయ్యే భయంకరమైన బాధల్ని గుర్తుచేస్తూనే ప్రస్తుతం తాను అనుభవిస్తున్న కష్ట పరంపరలను పేర్కొంటున్నాడు. అవి ఏవంటే తనవి కాని అవమానాల బరువుల్ని మోస్తున్నాననీ, అపజయాల ఎదురు దెబ్బల్ని కాస్తున్నాననీ అంటున్నాడు. అన్ని వైపుల నుండి నిందలనూ నిష్ఠూరాలనూ అందుకుంటున్నాననీ, తాను చెయ్యని పాపాలకు కూడా శిక్షలు అనుభవిస్తున్నాననీ వాపోతున్నాడు. ఇవన్నీ ప్రగతిగామి మానవుడు పడుతున్న పడరాని పాట్లు. స్వార్థరాహిత్యమూ, త్యాగశీలత మాత్రమే సమాజాభ్యుదయాన్ని సాధించగలవనే తిరుగులేని సత్యాన్ని ఈ కవిత ద్వారా కవి ప్రభోధిస్తున్నాడు.
అందుకేనేమో ఈ కవితా సంపుటికి నమ్మకం అనే పేరుతో ముందుమాట రాస్తూ ప్రఖ్యాత కవి ‘ఆరుద్ర’ ఇలా అంటారు. ‘సమత ఇతని కవితకు ప్రాణం. అది ముందు తరాల కోసం కవి ఇచ్చే గోదానం.’ తరచి చూస్తే ఈ కవి ఆత్మీయత ఈ కవితలో మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ఈ కవిత 17-3-1972 ప్రగతి వార పత్రికలో అచ్చయ్యింది.
పిల్లా తిరుపతిరావు…7095184846