Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Amaravathi Kathalu: ప్రాంతీయ కథలకు పథ నిర్దేశకుడు

Amaravathi Kathalu: ప్రాంతీయ కథలకు పథ నిర్దేశకుడు

గుంటూరు జిల్లా అమరావతి గ్రామానికి చెందిన సత్యం శంకరమంచి గురించి తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అందులో అతిశయోక్తేమీ లేదు. ఆయన, ఆయన రాసిన కథలు తెలుగు రాష్ట్రాల్లో పలువురు కథా రచయితలకు మార్గదర్శకాలు కావడం జరిగింది. 1937లో పుట్టి, 1987లో కన్నుమూసిన సత్యం శంకరమంచి కథలు రాయడంలోనే కాదు, కథలు చెప్పడంలో కూడా నిష్ణాతుడు. ఆయన కథలు, కథానికల కోసం మేగజైన్ల పాఠకులే కాదు, ఆకాశవాణి శ్రోతలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఆయనకు ఎవరితోనూ పోలిక లేదు. ఇతివృత్తాల ఎంపికలోనే కాక, కథారచనలో ఆయనకు ఆయనే సాటి.
ఆయన తన స్వగ్రామమైన అమరావతి మీద ‘అమరావతి కథలు’ పేరుతో రాసిన కథలను చదువుతుంటే, తెలుగు కథాభిమానులకు సమయమూ తెలియలేదు, బోరు కూడా కొట్టలేదు. సరళమయిన తెలుగు భాషలో, సూటిగా, చక్కగా ఆయన కథలు రాసిన తీరు ఎటువంటి పాఠకుడినైనా తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఆ కథల్లో అమరావతి గ్రామ స్థితిగతులే కాకుండా, యావత్‌ గుంటూరు జిల్లా పరిస్థితులు కూడా కళ్లకు కడతాయి. తమకు గ్రామానికే పరిమితమైన కథలు ప్రపంచాన్ని కూడా మన కళ్ల ముందుంచుతాయి. “తెలుగులో ఇంతకన్నా మంచి కథలు న భూతో న భవిష్యతి. ఇంతకన్నా బాగా కథలు రాసేవారు కూడా ఉండకపోవచ్చు” అని ప్రసిద్ధ హాస్య కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ వ్యాఖ్యానించారు. “తెలుగులో అత్యుత్తమ కథా సంపుటి ఏదంటే నేను అమరావతి కథలు అనే చెబుతాను” అని ఆదోని కళాశాలలో ఇంగ్లీష్‌ విభాగానికి అధిపతిగా పనిచేసిన పి.ఎస్‌. మూర్తి కొనియాడారు. “ప్రతి తెలుగువాడూ తన వ్యక్తిగత గ్రంథాలయం లోనే కాదు, హృదయంలోనూ పదిలంగా దాచుకోవాల్సిన పుస్తకం అమరా వతి కథలు” అని ప్రముఖ సాహితీవేత్త డి. ఆంజనేయులు కితాబిచ్చారు.
వారన్నట్టే తెలుగునాట సత్యం శంకరమంచి పుస్తకాలను, కథలను చదవనివారు, హృదయంలో పదిలంగా దాచుకోని వారు ఉండకపోవచ్చు. ఆయన కథలు అనేకం ఇంగ్లీషు తో సహా అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయన ‘అమరావతి కథలు’ పుస్తకం చదివిన ప్రసిద్ధ బాలీవు్‌డ దర్శకుడు శ్యాం బెనగల్‌ వెంటనే వాటిని ‘అమరావతి కీ కథాయే’ పేరుతో సీరియల్‌ గా నిర్మించి టెలివిజన్‌ లో ప్రసారం చేశారు. ఆయన రాసిన ‘ది ఫ్లఢ్‌’ అనే కథ ఇంగ్లీషులోకి అనువాదం కావడంతో దేశ విదేశాల్లో ఆయన పేరు మార్మోగి పోయింది.
ఒక్క అమరావతి కథలే కాదు. ఆయన ఏం రాసినా పాఠకులు, వీక్షకులు, ప్రేక్షకులకు ఇంపుగానూ, సొంపుగానే ఉండేవి. ఆయన కథల కోసం పాఠకులు ఎదురు చూసేవాళ్లు. 1960, 1970 దశకాల్లో ఆయన కథలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. అమరావతి కథలతో పాటు ఆయన రాసిన ‘ఆఖరి ప్రేమలేఖ’, ‘కార్తీక దీపాలు’, ‘రేపటి దారి’ కథలు కథా సాహిత్యాన్ని ఒక ఊపు ఊపాయి. ఇప్పటికీ, ఎప్పటికీ మరచిపోలేని కథలుగా తెలుగునాట శాశ్వత కీర్తి ప్రతిష్టలను సంపా దించుకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News