ఊపిరితిత్తుల ఆరోగ్యానికి….
ఇటీవల శ్వాససంబంధమైన సమస్యలను చాలామంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ తర్వాత ఇవి బాగా ఎక్కువయ్యాయి. ఇపుడు కోవిడ్ కొత్త వేరియంట్ బాగా వ్యాప్తిచెందుతోంది. అదీ చలికాలం కావడంతో ఈ వేరియంట్ వ్యాప్తి వేగం పెరుగుతోంది. ఈ కారణంతో పాటు కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలిలు కూడా శ్వాససంబంధమైన సమస్యలు అధికం కావడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి ఏడాది శ్వాససంబంధమైన జబ్బుల బారిన మూడు మిలియన్ల మంది పడుతున్నారు.
ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులకు ఉపయోగపడే ఫుడ్స్ తీసుకుంటే, జీవనశైలిలో కొద్దిగా మార్పులు చేపడితే ఈ పరిస్థితిలో కొంత మెరుగుదల వస్తుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. లంగ్స్ ను ఆరోగ్యంగా ఉంచే అలాంటి హెల్దీ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. వీటిని మీ డైట్ లో చేరిస్తే ఊపిరితిత్తుల అనారోగ్య సమస్యలకు తొందరగా లోనుకారు.
వెల్లుల్లి ఊపిరితిత్తులకు చేసే మేలు ఎంతో. ఇందులోని ఎలిసిన్ అనే ఫైటోన్యూట్రియంట్ మనకు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ఇది యాంటిమైక్రోబియల్, యాంటికాన్సర్ మాత్రమే కాదు రక్తపోటును తగ్గించే సుగుణాలు కూడా ఇందులో ఉన్నాయి. శ్వాససంబంధమైన సమస్యలతో బాధపడేవారికి, కాన్సర్ బాధితులకు వెల్లుల్లి మంచి ఫలితాలను ఇస్తుందని చైనా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో సైతం వెల్లడైంది. అందుకే నిత్యం వండుకునే కూరలు, సలాడ్స్, లేదా సలాడ్ డ్రెస్సింగ్ లలో రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఎంతో మంచిది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జబ్బుల బారిన పడకుండా ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
పాలకూర, ముల్లంగి ఆకులు, కేల్ వంటి వాటిల్లో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఫైటోకెమికల్స్ బాగా ఉంటాయి. ఇవి ఆక్సడేటివ్ డ్యామేజ్ అవకుండా కాపాడడమే కాదు మంటను, వాపును తగ్గిస్తుంది. వీటిల్లోని ఫైటోకెమికల్స్ కాన్సర్ పై సైతం శక్తివంతంగా పోరాడతాయి. అందుకే రోజుకు కనీసం ఒక కప్పు పాలకూరను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు
ఊపిరితిత్తులు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.
యాపిల్స్ లో యాంటాక్సిడెంట్లు , ఫైటోకెమికల్స్ సమ్రుద్ధిగా ఉంటాయి. ఇవి ఆస్తమా బారిన పడకుండా కాపాడతాయి. కాన్సర్, ఇన్ఫ్లమేషన్, గుండెజబ్బులు వంటి వాటి రిస్కుకు గురికాకుండా సంరక్షిస్తాయి.
రోజుకు ఒక యాపిల్ పండును బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్ గా తీసుకుంటే చాలా మంచిది. ఈ అలవాటు మీ ఊపిరితిత్తులను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది.
సాల్మన్, మకెరల్, కార్ప్ వంటి ఫ్యాటీ ఫిష్ లు కూడా ఊపిరితిత్తులకు ఎంతో మంచివి. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో పోలిఅన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి కాన్సర్, యాంటాక్సిడేటివ్ లు మాత్రమే కాదు గుండెను ఆరోగ్యంగా ఉంచే గుణాలను కలిగి ఉన్నాయి. అందుకే ఫ్యాటీ ఫిష్ లేదా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల శరీరారోగ్యం బాగుంటుంది. వైద్యలను సంప్రదించి తగిన మోతాదులో ఈ సప్లిమెంట్లు తీసుకుంటే ఎంతో మంచిది.
జలుబు, గొంతునొప్పులను అల్లం బాగా తగ్గిస్తుంది. అల్లంలో జింజరాల్ అనే బయోయాక్టివ్ కాంపౌండ్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్లం రుచిని పెంచే పదార్థం ఇదే. ఇది ఆస్తమా, జలుబు, మైగ్రేన్, అధిక రక్తపోటు వంటివి రాకుండా నిరోధిస్తుంది. ఉదయం మీరు తాగే డిటాక్స్ నీళ్లల్లో చిన్న అల్లం ముక్కను దంచి కలుపుకు తాగితే ఎంతో మంచిది. లేదా బ్రేక్ ఫాస్ట్ జ్యూసులో కూడా దంచిన చిన్న అల్లం ముక్కను వేసుకుని తాగితే ఊపిరితిత్తులకు చాలా మంచిది.
స్ట్రాబెర్రీలు, రాస్పెబెర్రీలు, క్రాన్బెర్రీలు, బ్లాక్ బెర్రీలు, బ్లూబెర్రీలు కూడా లంగ్స్ కు మంచివి. వీటిల్లో ఫినొలిక్ యాసిడ్స్, ఫ్లెవనాయిడ్స్, యాస్కొరోబిక్ యాసిడ్, ఇతర లబ్ది చేకూర్చే ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అంతేకాదు అనేక రకాల కాన్సర్లపై ఎంతో శక్తివంతంగా పోరాడతాయి కూడా. ఈ బెర్రీలను స్మూదీల్లో వాడొచ్చు. బ్రేక్ ఫాస్ట్ లో వాడొచ్చు. స్నాక్ గా తినొచ్చు. తీపి ఆప్రికాట్లు ఎంతో రుచిగా ఉండడమే కాదు ఊపిరితిత్తులకు అవి చేసే మేలు ఎంతో. ఆప్రికాట్లల్లో విటమిన్ సి, విటమిన్ ఇ, బేటా కెరొటెనె, లికోపిన్ వంటివి బాగా ఉంటాయి. ఇవన్నీ యాంటాక్సిడెంట్లు. ఇవి ప్రమాదకరమైన ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ ను లేకుండా చేస్తాయి. అంతేకాదు ఆప్రికాట్లు యాంటి ఎలర్జిక్, యాంటిమైక్రోబియల్, యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి కాన్సర్ గుణాలను కలిగి ఉన్నాయి. ఆప్రికాట్లను సలాడ్లల్లో, స్మూదీలలో, లేదా బ్రేక్ ఫాస్టులో తినొచ్చు. స్నాక్ గా కూడా తీసుకోవచ్చు.
ఆహార పదార్థాల్లో బ్రొకోలీ చేసే మేలు ఎంతో. వీటిల్లో సల్ఫోరాఫేన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటాక్సిడెంట్. అంతేకాదు ఇందులో యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటీకాన్సర్, యాంటిమైక్రోబియల్ సుగుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది ఊపిరితిత్తుల కాన్సర్, స్టొమెక్, బ్రెస్ట్ కాన్సర్లకు గురికాకుండా అడ్డుకుంటుంది. వేడి నీళ్లల్లో వేసి తీసిన ఒకకప్పు బ్రొకోలీ లేదా గ్రిల్డ్ బ్రొకోలీని రోజు విడిచి రోజు తింటే శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. గ్రేప్ ఫ్రూట్ బరువు తగ్గిస్తుంది. అంతేకాదు దీనివల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాం. తక్కువ కాలరీలు ఉన్న ఈ పండులో విటమిన్ సి, విటమిన్ బి6, థియామైన్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. బ్రేక్ ఫాస్ట్ లో నిత్యం అర ముక్క గ్రేప్ ఫ్రూట్ తింటే శరీరంలోని మలినాలన్నీ బయటకు పోవడమే కాదు శ్వాసకోశ వ్యవస్థలోని ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. అయితే కొన్ని సమయాల్లో ఇలాంటి సిట్రస్ పండ్లు ప్రతికూలంగా కూడా పనిచేసే అవకాశం ఉంది కాబట్టి జలుబు, ఇతర శ్వాససంబధమైన సమస్య తలెత్తినపుడు వైద్యుని సలహా తీసుకుని ఈ ఫ్రూట్స్ ను తీసుకోవడం ఉత్తమం.
పసుపు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించే సుగుణాలను కలిగి ఉంది. ఇందులోని కుర్కుమిన్ వల్ల మనం ఎన్నో ఆరోగ్య లాభాలను పొందుతున్నాం. ఇది యాంటాక్సిడెంట్, యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటిమైక్రోబియల్ సుగుణాలను కలిగిఉంది. అందుకే ఇది ఇన్ఫ్లమేటరీ డిజార్డర్లను, కాన్సర్లను, ఊబకాయన్ని నియంత్రించగలుగుతుంది. అందుకే పసుపును మీరు తీసుకునే స్మూదీలలో, జ్యూసుల్లో, సలాడ్ డ్రస్సింగ్ లో, కూరల్లో కొద్దిగా వాడితే చాలా మంచిది. బీన్స్, సీడ్స్, నట్స్ కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వీటిల్లో యాంటిఇన్ప్లమేటరీ గుణాలు కూడా బాగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గుతాయి. అందుకే నిత్యం ఒక కప్పు బీన్స్, గుప్పెడు నట్స్, సీడ్స్ తీసుకుంటే ఒంటికి చాలా మంచిది.
అవకెడో కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో విటమిన్ కె, ఇ, బి6, రిబోఫ్లేవిన్, పాంటోథెనిక్ యాసిడ్, నియాసిన్, పోలీ అన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు బాగా ఉన్నాయి. వీటిల్లో యాంటాక్సిడెంట్లు, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. నిత్యం అరముక్క అవకెడో తినడం వల్ల ఆర్తైరైటిస్, కీళ్లనొప్పులు తగ్గుతాయని శాస్త్రవేత్తలు సైతం గుర్తించారు. పౌల్ట్రీ ఫుడ్స్ అంటే చికెన్, టర్కీ వంటివి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి లంగ్ కాన్సర్ రిస్కును తగ్గిస్తాయి. హార్మోన్ ఫ్రీ పౌల్ట్రీని తింటే మరింత మంచి ఫలితాలను పొందుతారు. బ్రాయిల్డ్, గ్రిల్డ్ పౌల్ట్రీని లంచ్ లేదా డిన్నర్ గా తీసుకోవచ్చు.
రెడ్ బెల్ పెప్పర్స్ లలో లికోపెనె, విటమిన్ సి, బేటా కెరటెనె ఉంటాయి. ఇవి యాంటాక్సిడెంట్లు. ఇవి ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ ను తటస్థం చేస్తాయి. దీంతో ఊపిరితిత్తులు, ఇతర అవయవాలు సురక్షితంగా ఉంటాయి. ఎలాంటి జబ్బులు, డిజార్డర్లు మిమ్మల్ని చుట్టుముట్టవు. ఎర్ర పచ్చిమిరపకాయలలో యాంటాక్సిడెంట్లతో పాటు యాంటికాన్సర్ గుణాలు ఉన్నాయి.
లంగ్స్ పరంగా గుడ్డు, ఉప్పు, వైన్, షెల్ ఫిష్ తీసుకోకుండా ఉంటే మంచిది. అవకెడో కూడా. ఈ విషయంలో వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. తేనె కలిపిన నీళ్లు, గ్రీన్ టీ, దాల్చిన చెక్క నీళ్లు వంటివి తాగితే ఊపిరితిత్తులకు చాలా మంచిది. వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగాలి. దీనివల్ల డిటాక్సిఫికేషన్ అవుతుంది. అంతేకాదు సీజనల్ జలుబు, దగ్గుల నుంచి సాంత్వననిస్తుంది. అరటి పండ్లు ఊపిరితిత్తులకు మంచిది. ఈ పండు మ్యూకస్ ను, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఆస్తమాను తగ్గించే సహజమైన రెమిడీ గా కూడా అరటిపండును సూచిస్తుంటారు. ఈ విషయాలలో వైద్యుని సంప్రదించి తదనుగుణంగా వ్యవహరించాలి.