Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్BJP-Janasena: జనసేనను బీజేపీ నడిపిస్తుందా?.. సోము మాటల వెనక అర్థమేంటి?

BJP-Janasena: జనసేనను బీజేపీ నడిపిస్తుందా?.. సోము మాటల వెనక అర్థమేంటి?

- Advertisement -

BJP-Janasena: ఏపీలో రాజకీయ పరిస్థితులు చిత్ర, విచిత్రంగా కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులకు సైతం ఇక్కడి రాజకీయాలు అంతు చిక్కడం కష్టమైపోతుంది. ఇక్కడ పెద్ద రాజకీయ పార్టీలుగా ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి టీడీపీ, రాష్ట్రంలో ఆదరణ లేకపోయినా జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ, సినీ స్టార్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీల మధ్య సంబంధాలు ఏంటో రాష్ట్ర ప్రజలకు కూడా అర్ధం కావడం లేదు.

అధికార-ప్రతిపక్ష పార్టీలుగా వైసీపీ, టీడీపీ ఘాటు విమర్శలు సహజమే కాగా.. మిగిలిన ప్రతిపక్ష పార్టీలు బీజేపీ-జనసేన కూడా వైసీపీపై విమర్శలకు ఎక్కడా తగ్గడం లేదు. ఎన్నికలకు కూడా ఒకటిన్నర ఏడాదికి పైనే సమయం ఉన్నా ఇప్పటికే ఇక్కడ.. వచ్చే ఎన్నికలకు పొత్తులపై కూడా ఊహాగానాలు, కథనాలు రసవత్తరంగా వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికలకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేలా తమ నిర్ణయాలు ఉండవని ప్రకటించిన జనసేనాని పవన్ అందుకు తగ్గట్లు అవసరమైతే తాము ఒక మెట్టు తగ్గేందుకు కూడా వెనుకాడేది లేదని చెప్పారు.

పవన్ వ్యాఖ్యలతో ఈసారి జనసేన పార్టీ టీడీపీతో పొత్తు ఖాయమనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే, జనసేన ఇప్పటికే బీజేపీతో కలిసి నడుస్తుంది. కనుక టీడీపీ-జనసేన-బీజేపీ కూటిమిగా ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని అనుకున్నారు. కానీ.. బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తుకు అవకాశమే లేదని.. వైసీపీ, టీడీపీ తమకు సమదూరమని చెప్పుకొచ్చింది. టీడీపీ కూడా పవన్ తో దగ్గరవుతుంది.. ఈ మధ్యనే టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. కానీ బీజేపీని విమర్శించలేదు.. అలాగని దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం లేదు.

దీంతో పొత్తుకు బీజేపీ సిద్ధంగా లేకపోతే వదిలించుకొని అయినా పవన్ టీడీపీతో జతకట్టే అవకాశాలు లేకపోలేదని ఈ మధ్య గట్టిగా వినిపించింది. అయితే ఊహించని విధంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీతో మేం కలవబోం.. మేం తెలుగుదేశంతో కలిసేది లేదని పవన్‌కు కూడా ఢిల్లీ పెద్దలు స్పష్టంగా చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మాతోటే ఉండాలి.. ఉండను అని అనరు. అందుకు తగ్గట్లే టీడీపీతో నేను వెళ్లిపోతాను అని పవన్ కూడా ఎక్కడా చెప్పలేదని సోము చెప్పుకొచ్చారు.

దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలలో మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే పవన్ ఏ పార్టీతో వెళ్ళాలో.. ఎవరిని కలవాలో కూడా బీజేపీ ఢిల్లీ పెద్దలే చెప్తారా?, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ చెప్తుంటే.. ప్రతిపక్ష పార్టీ టీడీపీకి జనసేనను దూరం చేసి వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చేలా బీజేపీ ప్రయత్నిస్తుందా? అసలు సోము వీర్రాజు వ్యాఖ్యల వెనక అర్థమేంటి? పొత్తుల కోసం తాము ఒక మెట్టు తగ్గేందుకు కూడా సిద్ధమని పవన్.. టీడీపీకి ఆఫర్లు ఇస్తుంటే.. పవన్ మాతోనే ఉండాలని.. మేము మాత్రం వైసీపీకి మేలుచేసేలా వెళ్తామని బీజేపీ నేతలు చెప్పడం వెనక అర్ధమేంటని ఇప్పుడు వాడీవేడి చర్చలు సాగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News