Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Meruga Nagarjuna: దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా కొనసాగించాలి

Meruga Nagarjuna: దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా కొనసాగించాలి

ఎస్సీల అభివృద్ధి పథకాలను ప్రశంసించిన కమిషన్

మతం మారినా ఏమాత్రం మారని దుర్భర పరిస్థితుల మధ్య బతుకుతున్న దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలని దళిత క్రిస్టియన్లను ఎస్సీ కులాల్లో చేర్చాలన్న అంశంపై జాతీయ స్థాయిలో ఏర్పాటైన జస్టిస్ బాలక్రిష్ణన్ కమిషన్ ను కలిసి విజ్ఞప్తి చేసామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాలను కమిషన్ ఈ సందర్భంగా ప్రశంసించిందని తెలిపారు.
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వాలన్న విషయంగా ఏర్పాటైన జస్టిస్ కేజీ బాలక్రిష్ణన్ ఇద్దరు సభ్యులతో కూడిన కమిషన్ మంగళవారం రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర సచివాలయంలో విచారణ చేపట్టింది. మంత్రి నాగార్జున కమిషన్ ను కలిసి దళిత క్రిష్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. నవరత్నాలు, ఇతర పథకాల ద్వారా గత ఐదేళ్ల కాలంలో 1 కోటీ 23 లక్షలా 11 వేల 910 మంది ఎస్సీ లబ్దిదారులకు రూ.57 వేలా 828 కోట్ల రుపాయలను అందించడం జరిగిందని తెలిపారు. ఇది కాకుండా గడచిన ఐదేళ్ల కాలంలో ఎస్సీ సబ్ ప్లాన్ (ఎస్సీ కాంపొనెంట్) ద్వారా రూ.62 వేలా 270 కోట్ల రుపాయలను ఎస్సీల సంక్షేమం కోసం ఖర్చు చేసామని వెల్లడించారు. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీ కుటుంబాలకు సాయం అందించడంలోనూ, ఎస్సీ విద్యార్థులకు అత్యధికంగా పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్పులు మంజూరు చేయడంలోనూ, భారీ సంఖ్యలో ఎస్సీ మహిళా గ్రూపులకు ఆర్థిక సహాయం అందించడంలోనూ ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని గతంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగిందని ఆయన గుర్తు చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో 59 కులాలు షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నాయని చెప్పారు.

- Advertisement -

ఎస్సీలుగా సమాజంలో వివక్షకు గురవుతున్న పరిస్థితుల్లో సామాజిక మార్పు కోసం ఎస్సీలు మతం మారారని అభిప్రాయపడ్డారు. మతం మారినా కూడా ఎస్సీల జీవన స్థితిగతులు మారని నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ సిక్కుమతం, బౌద్ధ మతంలోకి మారిన ఎస్సీలను మళ్లీ ఎస్సీ కులాల్లో కొనసాగించడం జరిగిందని నాగార్జున వెల్లడించారు. అదే విధంగా క్రిస్టియన్ మతం లోకి మారిన దళితులను కూడా ఎస్సీలుగా కొనసాగించాలని కోరామన్నారు. క్రిస్టియన్లుగా మారినా కూడా అదే దళిత వాడల్లో, అవే దీన పరిస్థితుల మధ్య బతుకుతున్న ఎస్సీల బతుకుల్లో, వారి జీవన విధానాల్లో, సాంప్రదాయాల్లో ఏ మాత్రం మార్పు రాలేదని తమ ప్రభుత్వం గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో క్రిస్టియన్లుగా మారిన దళితులకు ఎస్సీ హోదాను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ప్రభుత్వం గుర్తించిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీల అభివృద్ధికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్లుగా మారిన ఎస్సీలను ఎస్సీలుగానే పరిగణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ 2023 మార్చి 24 న అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించడం ద్వారా ఎస్సీల పట్ల తనకు ఉన్న ప్రేమను, అభిమానాన్నీ చాటి చెప్పారని నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన విధంగానే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వాలని కమిషన్ ఛైర్మెన్ జస్టిస్ కే.జి. బాలక్రిష్ణన్ ను అభ్యర్థించామన్నారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఒక నివేదికను కమిషన్ కు అందజేసామని చెప్పారు. ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించిన జస్టిస్ బాలక్రిష్ణన్ తో పాటుగా కమిషన్ సభ్యులు డా.రవీంద్రకుమార్ జైన్, ప్రొఫెసర్ సుష్మా యాదవ్ కూడా రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధికి చేపడుతున్న పథకాలు ప్రశంసనీయంగా ఉన్నాయని కొనియాడారని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఎపీలో ఎస్సీల అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాలను ఆదర్శంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించిన కమిషన్ ఛైర్మెన్, సభ్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులు, పేదల అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలతో రాష్ట్రంలో పేదరికం 12% నుంచి 6% శాతానికి తగ్గుముఖం పట్టిందని ప్రస్తావించారు. కాగా ఎస్సీల అభివృద్ధికి చేపడుతున్న పథకాలతో పాటుగా విజయవాడలో రూ.404 కోట్ల రుపాయల వ్యయంతో నిర్మించిన అంబేద్కర్ స్మృతివనాన్ని ఈనెల 19న సీఎం జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేస్తారని వివరించారు. ప్రతిపక్షాలు కూడా రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను గుర్తించాలని నాగార్జున కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News