“భారత్ మరో మైలురాయిని సృష్టించింది. భారత దేశ మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 గమ్యస్థానానికి చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన మరియు జటిలమైన అంతరిక్ష యాత్రలను విజయవంతం చేయడంలో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం.” ఆదిత్య యల్1 వ్యోమనౌక విజయవంతంగా నిర్దేశిత లగ్రాంజ్ పాయింట్ (యల్ 1) కి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు చేరిన తరువాత మన దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన ట్వీట్ ఇది. ఈ రోజు కోసం ఆయన ఎంతలా ఎదురు చూసారో ఈ ట్వీట్ నుండి మనం తెలుసుకోవచ్చు. సోలార్ అబ్జర్వేటరీ స్పేస్‌క్రాఫ్ట్, ఆదిత్య-యల్ 1 యొక్క హాలో-ఆర్బిట్ ఇన్సర్షన్ జనవరి 6, 2024 న సాయంత్రం నాలుగు గంటలకు పూర్తి చేయబడింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకను విజయవంతంగా గమ్యస్థాన కక్ష్యలోకి చేర్చింది. భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య యల్ 1 సెప్టెంబరు 2, 2023న ప్రయోగించబడిన 127 రోజుల తర్వాత జనవరి 6న యల్ 1 పాయింట్‌కి చేరుకుంది. ఆదిత్య యల్ 1 అంతరిక్ష నౌక యొక్క కక్ష్య అనేది ఆవర్తన హాలో కక్ష్య. ఇది భూమి నుండి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో నిరంతరంగా కదులుతున్న సూర్య-భూమి రేఖపై సుమారు 177.86 భూ రోజుల కక్ష్య వ్యవధిలో ఉంది. ఈ హాలో కక్ష్య అనేది సూర్యుడు, భూమి మరియు అంతరిక్ష నౌకను కలిగి ఉన్న యల్ 1 వద్ద ఆవర్తన, త్రిమితీయ కక్ష్య. ఈ నిర్దిష్ట హాలో కక్ష్య 5 సంవత్సరాల మిషన్ జీవితకాలాన్ని నిర్ధారించడానికి ఎంపిక చేయబడింది. ఆదిత్య యల్ 1 మిషన్ అనేది సూర్యుని యొక్క క్రోమోస్పిరిక్ మరియు కరోనల్ డైనమిక్స్‌ను పరిశీలించడం మరియు అర్థం చేసుకోవడం కోసం లాగ్రాంజియన్ పాయింట్ యల్1 వద్ద ఒక భారతీయ సౌర పరిశీలనా కేంద్రం. అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ ఈ రోజు ఈ ప్రయోగం సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు అని పేర్కొన్నారు. చివరి స్థానానికి చేరుకోవడం ఎల్లప్పుడూ ఆత్రుతతో కూడిన క్షణం. ఊహించినట్లుగానే జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాం అని అన్నారు. ఈ మిషన్ సంక్లిష్టమైనది అని తాము సంక్లిష్టతను ఖచ్చితంగా అధిగమించామని ఇస్రో చీఫ్ చెప్పారు. పేలోడ్‌లు బాగా పని చేస్తున్నాయి. కానీ ఇప్పుడు డేటా నమ్మదగినది మరియు ఉపయోగించదగినది అని నిర్ధారించుకోవడానికి పేలోడ్‌లపై ఇంకా చాలా పనులను చేయవలసి వుందని మరియు ఇది ఇప్పటి నుండే ప్రారంభమవుతుందని ఆనందంతో సోమనాథ్ గారు చెప్పారు. ఈ ప్రయోగ పూర్వాపరాలు ఒకసారి చూస్తే…చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయిన తరువాత మన శాస్త్రేత్తల దృష్టి అంతా సూర్యుని మీద పడింది. సెప్టెంబరు 2 వ తేదీన శ్రీహరికోట లోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి ఆదిత్య ఎల్ 1 అనే నౌకను పి ఎస్ ఎల్ వి సి 57 వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించారు. దీని జీవితకాలం ఐదు సంత్సరాలు. ప్రస్తుత పరిస్థితులలో సూర్యుని దగ్గరకు అంతరిక్ష వాహనాన్ని పంపించలేము. ఎందుకంటే సూర్యుడు ఒక నక్షత్రము. ఈ విశ్వంలో కోట్లాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనకు దగ్గరలో ఉన్న నక్షత్రము సూర్యుడు మాత్రమే. అందుకే సూర్యుని పరిస్థితిని అధ్యయనం చేస్తే ఇతర నక్షత్రాల గుట్టు కూడా తెలుసుకోవచ్చు. 1868లో ఆగస్టు 18న సూర్యగ్రహణం సందర్భంగా జూల్స్ జాన్సన్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త సూర్యుడు లో హీలియం అనే మూలకము ఉందని కనుగొన్నాడు. సూర్యుడు తన లోపలి భాగంలో అణు కలయిక ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తాడు మరియు దాని బయటి పొరల నుండి విడుదల చేస్తాడు. ఫోటోస్పియర్ పరారుణ కాంతిని విడుదల చేస్తుంది. పైన క్రోమోస్పియర్ ఉంది. ఇంకా ఎక్కువ మిలియన్ డిగ్రీల సెల్సియస్ హాట్ కరోనా ఉంది. ఇందులోని ప్రక్రియలు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అంతేకాకుండా ఇది అతినీలలోహిత మరియు ఎక్స్-రే రేడియేషన్‌ను కూడా విడుదల చేస్తుంది. సూర్యుడు నుండి విద్యుత్ చార్జ్ చేయబడిన కణాలను కూడా నిరంతరం ప్రవహిస్తాయి. దీనిని సౌర గాలి అని పిలుస్తారు. సౌరవాయు ఆవర్తనాన్ని సుదూరం నుండి పరిశీలించడానికి , సూర్యుని వెలుపల ఉన్న పొరలు, సౌర శక్తి కణాలు, వేరు వేరు తరంగ పౌనః పున్యాల వద్ద ఫోటోస్పియర్ ( కాంతి మండలం), క్రోమోస్ఫియర్ ( వర్ణ మండలం) , కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపై అధ్యయనం చేసేందుకు గ్రహణాలు వంటివి పరిశోధనలకు అడ్డంకిగా మారకుండా భూమికి సుమారుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లెగ్రాంగ్జియన్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్షలోకి నౌక విజయంగా చేరుకుంది. లెగ్రాంజ్ పాయింట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అక్కడ చిన్న వస్తువు కూడా స్థిరంగా ఉండగలుగుతుంది. ఇక్కడ భూమి సూర్యుడు యొక్క గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. సూర్యునికి భూమికి మధ్యలో ఇటువంటి పాయింట్లు ఐదు ఉంటాయి. యల్ 1 అనేది మొదటి లాగ్రాంజియన్ పాయింట్‌ని సూచిస్తుంది. అటువంటివి ఐదు పాయింట్లు ఉంటాయి. ఈ అంశాలను 19వ శతాబ్దంలో స్విస్ గణిత శాస్త్రజ్ఞుడు లియోన్‌హార్డ్ ఆయిలర్ మరియు ఇటాలియన్-ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు జోసెఫ్-లూయిస్ లాగ్రాంజ్ సిద్ధాంతపరంగా కనుగొన్నారు. అందులో ఎల్ 1 అనే పాయింట్ వద్దకు ఇప్పుడు మనము ప్రయోగించిన వ్యోమనౌక చేరుకుంది. ఈ పాయింట్ నుండి పరిశోధనా సమయంలో గ్రహణాలు వంటి ఇతర అడ్డంకులు ఏమీ లేకుండా నిరంతరం సూర్యుణ్ణి పరిశీలించే సౌలభ్యం ఉంది. ఆదిత్య యల్ 1 లో ఏడు పేలోడ్లు ఉన్నాయి.
1475 కిలోల బరువున్న ఈ నౌకలో పేలోడ్లు బరువు కేవలం 244 కిలోలు మాత్రమే. ఈ పేలోడ్లలో మొదటిదైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ సూర్యుని నుండి ప్రసరించే కాంతి ప్రభావ అధ్యయనాన్ని, రెండవదైన సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ 200-400 నానో మీటర్ల తరంగదైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని మరియు 11 ఫిల్టర్‌లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలోని వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందించడం, మూడవది ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్ సౌర గాలి యొక్క వైవిధ్యం మరియు లక్షణాలను అలాగే దాని పంపిణీ మరియు వర్ణపట లక్షణాలను అధ్యయనం చేయడం, నాల్గవదైన ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ సౌర గాలి మరియు దాని శక్తి పంపిణీ యొక్క కూర్పును అర్థం చేసుకోవడానికి, ఐదవదైన సోలార్ లోఎనర్జీ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ సోలార్ కరోనా యొక్క సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజం అధ్యయనం కోసం , ఆరవదదైన హై ఎనర్జీ యల్ 1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్‌లను గమనించడానికి మరియు విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌర శక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేయడానికి , ఏడవడదైన మాగ్నెటోమీటర్ అంతర్ గ్రహ అయస్కాంత క్షేత్రం యొక్క పరిమాణం మరియు స్వభావాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి. వ్యోమనౌక మొదటి లాగ్రాంజ్ పాయింట్‌లో ఉండటంతో, ఈ పేలోడ్ సూర్యుడిని అంతరాయం లేకుండా నిరంతరం గమనిస్తూ ఉంటుంది. ఇలాంటి విజయవంత ప్రయోగాలు మరెన్నో చేసి మనదేశ గౌరవాన్ని విను వీధుల్లో మన శాస్త్రవేత్తలు ఎగురవెస్తారని కోరుకుందాం. జై భారత్….జైజై భారత్…భారత్ మాతాకీ జై….
జనక మోహన రావు దుంగ
అధ్యాపకుడు
శ్రీకాకుళం జిల్లా
ఆంధ్రప్రదేశ్
8247045230