అహ్మదాబాదుకు చెందిన క్రిష్ణా, బాతిక్ లు భార్యాభర్తలు. వీరిద్దరూ కలిసి ‘ స్టోరీ టైలర్ ’అనే వినూత్న హ్యాండ్ ప్రింట్ డిజైన్ దుస్తులను పిల్లల కోసం ప్రత్యేకంగా తయారుచేస్తున్నారు. వీటిపై చిన్నారులను ఆకర్షించే పంచతంత్ర కథల బొమ్మలను ప్రింట్ చేస్తున్నారు. ఈ దుస్తులకు వాడే బట్ట కూడా పర్యావరణహితమైంది కావడం మరో విశేషం. ఇన్ని ప్రత్యేకతలతో పిల్లల కోసం ఈ జంట రూపొందిస్తున్న ‘కథల డ్రస్సుల’ గురించి తెలుసుకుందాం…
వీరిద్దరూ ఉమ్మడి కుటుంబంలో పుట్టారు. అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే సంప్రదాయ జానపద కథలు వింటూ పెద్దవాళ్లయ్యారు. ఇది ఈ జంట జీవన గతినే పూర్తిగా మార్చేసింది. ఆ ప్రభావంతోనే ఈ జంట ఏకంగా స్రుజనాత్మకమైన దుస్తుల స్టార్టప్ ను ప్రారంభించింది. ‘ స్టోరీ టైలర్ ’ అనే పేరుతో ఎకో ఫ్రెండ్రీ దుస్తుల బ్రాండుకు శ్రీకారం చుట్టారు. పంచతంత్ర కథల స్ఫూర్తితో డిజైన్లను రూపొందించి చిన్నారుల కోసం దుస్తులపై ముంద్రించి అమ్మడం మొదలెట్టారు. క్రిష్ణాది అహ్మదాబాద్. ఇన్ స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్ లో ఆమె ఇంజనీరింగ్ చేశారు. 2008లో ఇంజర్సోల్ ర్యాండ్ లో ఉద్యోగానికి చేరారు. 2014లో ఆమెకు వివాహమైంది. పెళ్లి అయిన తర్వాత ఆమె మకాం ముంబయికి మారింది. ఆ తర్వాత ప్రెగ్నెట్ కావడంతో కెరీర్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఆమెకు బాబు పుట్టాడు. ఆమె భర్త బాతిక్ మంచి ఆర్టిస్టు.
అతను ‘మామ్ మేడ్ కంపెనీ’ అనే అడ్వర్టయిజింగ్ సంస్థను నడిపేవారు. ‘మా బాబు దేవ్ పుట్టిన తర్వాత తిరిగి నా పాత కార్పొరేట్ ఉద్యోగంలో చేరలేదు. ఆ పని చేస్తూ రోజులో పన్నెండు పదమూడు గంటల సమయం వ్రుధా చేసుకోవడం ఎందుకనిపించింది. బాబుతోనే ఎక్కువ టైము గడపాలని అనిపించింది. బాబుకి బట్టలు కొనడం కోసం తరచూ షాపింగ్ చేసేదాన్ని. షాప్స్ లో చాలా దుస్తులపై సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వంటి పాశ్చాత్య కేరక్టర్లు, కార్టూన్ పాత్రలతో ఉన్న డిజైన్లే ఎక్కువగా ఉండడం గమనించా. మార్కెట్ లో ఇండియన్ బ్రాండులు కూడా తక్కువగా ఉండడంతో పాటు వాటిపై సంప్రదాయ డిజైన్లు, ప్రింట్లే ఎక్కువగా ఉండేవి. ఇవి నాలో కొత్త ఆలోచనలను రేపాయి. అదే ఆ తర్వాత ‘స్టోరీ టైలర్’ స్టార్టప్ కు నాంది పడేట్టు చేశాయి’ అని క్రిష్ణా గుర్తుచేసుకున్నారు.
బాతిక్, క్రిష్ణా ఇద్దరిదీ ఒకేరకమైన కుటుంబ నేపథ్యం. ముందరే చెప్పినట్టు ఇద్దరూ ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగారు. అత్తయ్య, మామయ్య, బాబయ్య, తాత, అమ్మమ్మలు, నానమ్మల మధ్య పెరిగారు. వాళ్లు అన్నం పెడుతూ చెప్పే నీతి కథలు వింటూ పెద్దవాళ్లయ్యారు. పెళ్లయిన తర్వాత ముంబయి వచ్చిన క్రిష్ణా అక్కడ అత్తమామలు, మరుదులు, తొంభై ఏళ్ల దాటిన ముత్తమ్మమ్మల మధ్య ఉంటూ కుటుంబ జీవనం సంతోషంగా గడిపిన వాళ్లు. మరుదుల పిల్లలతో, తమ పిల్లలతో ఇల్లు ఎంతో సందడిగా ఉండేదని క్రిష్ణ అంటారు. ఆ పిల్లలందరికీ రకరకాల సంప్రదాయ దుస్తులు కుట్టి వేస్తూ ఎంజాయ్ చేసేవాళ్లమంటారు ఆమె.‘ మా అత్తగారే పిల్లలకు డ్రస్సులు డిజైన్ చేసి కుట్టేవారు’ అని క్రిష్ణా చెప్పారు.
‘మేము పిల్లల కోసం వాడే బట్టల మెటీరియల్, డిజైన్లు ఇరుగుపొరుగువారికి, స్నేహితులకు బాగా నచ్చేవి. ఎక్కడ కొన్నారంటూ వాళ్లు మమ్మల్ని అడిగేవారు. అప్పుడే మా వారికి, నాకు పిల్లల కోసం మేమే వెరైటీగా దుస్తులు డిజైన్ చేసి అమ్మితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. క్రిష్ణా భర్త బాతిక్ గ్రాఫిక్ డిజైనర్. కుందేలు, తాబేలు కథతో ఆయన చిన్నారుల దుస్తులపై డిజైనింగ్ ఐడియా మొట్టమొదట వేశారు. అలా తమ స్టార్టప్ ఐడియాను నిజం చేసుకున్నారు. వదోదర వచ్చి అక్కడ తమ ప్లాన్ కు శ్రీకారం చుట్టారు. ప్రారంభంలో రకరకాల డిజైన్లతో ఎన్నో ప్రయోగాలు చేశారు. ‘ మొదట బ్లాక్ ప్రింటింగ్ చేద్దామని అనుకున్నాం. కానీ తర్వాత చిక్కటి స్క్రీన్ డిజైన్లు బాగుంటాయనిపించింది. మేం తెచ్చే ప్రతి డ్రస్ లేదా అవుట్ ఫిట్ తో ఫ్లిప్ బుక్ కూడా ఇస్తాం. అందులో ఆ డ్రస్సుపై ఉండే కథ, ఇలస్ట్రేషన్లు ఉంటాయి. ఆ పుస్తకంలోని బొమ్మలపై పిల్లలు కలరింగ్ వేయొచ్చు.
అలా 2021 లో ‘స్టోరీ టైలర్’ స్టార్టప్ ను ప్రారంభించాం’ అని క్రిష్ణా చెప్పారు. జీరో నుంచి ఎనిమిదేళ్ల వయసు అబ్బాయి, అమ్మాయిలకు దుస్తులను డిజైన్ చేయాలని ఈ జంట టార్గెట్ గా పెట్టుకుంది. పండగలప్పుడు పిల్లలు వేసుకునే దుస్తులతో పాటు వాళ్లు నిత్యం ధరించే దుస్తులు కూడా తయారుచేశారు. డ్రస్సులు పిల్లలకు అనువుగా ఉండేలా డిజైన్ చేశామని చెప్పారు. తమ డిజైన్లు ఎంతో విలక్షణంగా ఉంటాయని ఈ జంట ఎంతో గర్వంగా చెప్తారు. దుస్తుల తయారీలో వీళ్లు జీరోవేస్ట్ పాలసీని అనుసరిస్తున్నారు. అందులో భాగంగా దుస్తులతోపాటు హెయిర్ బ్యాండ్స్, క్లచెస్, మాస్కుల వంటివి కూడా అందిస్తున్నారు. స్టోరీ టైలర్ ప్రింట్స్, డిజైన్ల మీద పేటెంట్ హక్కులు తీసుకునే ప్రణాళికలో ఉన్నట్టు క్రిష్ణా చెప్పారు. వీరు రూపొందించిన దుస్తులు వాళ్ల వెబ్ సైట్ ఫస్ట్ క్రై, నెస్టరీ, మిత్రలో అందరికీ అందుబాటులో ఉన్నాయి. బట్టల నుంచి డిజైనింగ్, ప్రింటింగ్, కుట్టడం అన్నీ ఇన్ హౌస్ తయారీనే.
దుస్తుల ధరలు 999 రూపాయల నుంచి మొదలవుతుంది. ఈ వ్యాపారం మీద 13 లక్షల పెట్టుబడి పెట్టినట్టు క్రిష్ణా వెల్లడించారు. పిల్లల కోసం తాము రూపొందిస్తున్న డిజైన్ల ను రానున్న కాలంలో మరింతగా విస్తరించేలా పథకాలు వేస్తున్నామని ఆమె అంటున్నారు. సంప్రదాయంగా కనిపించే హోయసరీ కాటన్, రా సిల్క్ వంటి సహజ ఫ్యాబ్రిక్స్ ను సైతం తమ దుస్తులలో త్వరలో పరిచయం చేయనున్నారు. పిల్లలతో పాటు అమ్మమ్మలు, నానమ్మలకు కూడా సౌఖ్యంగా ఉండేలాంటి ఫ్యాబ్రిక్, కథల డిజైన్లతో దుస్తులు తేనున్నామని క్రిష్ణా చెప్తున్నారు. కథల ప్రింట్లతో చీరలను కూడా ఈ జంట తేనున్నారు. స్టోరీ టెల్లింగ్ కాన్సెప్టుతో పిల్లలకు బొమ్మలు తీసుకొచ్చే ఆలోచన కూడా ఉందని క్రిష్ణా చెప్పారు. స్టోరీ టెల్లింగ్ సెషన్లు కూడా నిర్వహిస్తామన్నారు. అంతేకాదు పిల్లలు, యువత బాల్యంలోని రకరకాల ఆటలను ఆడుకునేందుకు ఫిజికల్ స్పేస్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా తమకు ఉన్నట్టు క్రిష్ణా వివరించారు.
పంచతంత్ర కథల స్ఫూర్తితో రూపొందించిన వీరి డిజైన్లు చిన్నారులను ఇట్టే ఆకర్షిస్తాయనడంలో సందేహం లేదు….