చర్మం అందంగా, పట్టులా ఉండడానికి కొన్ని సహజసిద్ధమైన టిప్స్ ఉన్నాయి. ఇవి అనుసరిస్తే మీ చర్మం కాంతివంతంగా ఉండి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. అవేమిటంటే…
నిమ్మరసం, టొమాటా జ్యూసులను సమపాళ్లల్లో తీసుకుని వాటి మిశ్రమాన్ని బాగా కలపాలి. చర్మం ఎక్స్ ఫొయిలేషన్ కు అందులో ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని బాగా కడిగేసుకోవాలి. ఈ పేస్టును వారానికి మూడు నాలుగుసార్లు లేదా రోజూ ఒక నెలపాటు ముఖానికి రాసుకోవాలి. వాటిల్లోని సి విటమిన్, యాంటాక్సిడెంట్ల వల్ల చర్మం మెరుపులు చిందిస్తుంది. అంతేకాదు చర్మంపై ఉండే నల్లని మచ్చలు కూడా పోతాయి. సన్ ట్యాన్ ను కూడా ఇది పోగొడుతుంది.
ఉదయమే ఖాళీ కడుపుతో అలొవిరీ జ్యూసు 30 ఎంఎల్ తాగాలి. ఇది రక్తాన్ని శుభ్రంచేస్తుంది. చర్మం పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. అలొవిరా జల్ ను చర్మంపై రాసుకుంటే ఎంతో సాంత్వననిస్తుంది. చర్మం మ్రుదువుగా ఉంటుంది కూడా. అలాగే తాజా కీరకాయ జ్యూసును ముఖానికి కాటన్ బాల్ తో రాసుకుని అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా నెలపాటు చేస్తే స్కిన్ టెక్స్చర్ బాగుంటుంది.
బొప్పాయి యాక్నే మచ్చలను పొగొట్టడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. తాజా బొప్పాయి పండు ముక్కలను తీసుకుని వాటిని పేస్టులా చేసి దాన్ని ముఖంపై రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. అరటిపండు తొక్కలతో చర్మంపై మసాజ్ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీటిల్లో ల్యూటిన్ అనే ఎంతో శక్తివంతమైన యాంటాక్సిడెంట్ ఉంటుంది. ఇది వాపును, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అంతేకాదు ఆరోగ్యవంతమైన కణాల వ్రుద్ధికి సహాయపడుతుంది.
పొడిచర్మం, మొటిమలతో బాధపడేవారికి బాదం మంచి ఫలితాలను ఇస్తుంది. ఎనిమిది గ్రాముల బాదం పొడి, మూడు గ్రాముల మీగడ, కొన్ని చుక్కలు నిమ్మరసం బాగా కలిపి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 లేదా 20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత వేళ్ల అంచులతో ముఖంపై గుండ్రంగా మసాజ్ చేసి చల్లటి నీళ్లతో ముఖం కడిగేయాలి.
మెంతులను నీళ్లల్లో నానబెట్టి పేస్టులా చేసి ముఖానికి రాసుకుంటే చర్మంపై వెంటనే మంచి ప్రభావం చూపుతుంది. స్వచ్ఛమైన కొబ్బరి నూనె కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చర్మంలో ఎలాస్టిసిటీ గుణాన్ని పెంచుతుంది. అతినీలలోహిత కిరణాల నుంచి కొబ్బరినూనె కాపాడుతుంది. అంతేకాదు సన్ ట్యాన్ బారిన పడకుండా చర్మాన్ని సంరక్షిస్తుంది.