Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్World fastest Champion: ప్రపంచం మెచ్చిన ఆటగాడు ఉసేన్ బోల్ట్

World fastest Champion: ప్రపంచం మెచ్చిన ఆటగాడు ఉసేన్ బోల్ట్

ఆయన ఆడే ప్రతి ఆట గెలుపే కానీ ఓటమి ఉండదు

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రన్నర్. ఓటమెరుగని ఆటగాడని పేరుగాంచిన యోధుడు. పరుగుల ఆటకు తిరుగులేని రారాజు అతనే “ఉసేన్ బోల్ట్”. తన అలుపెరగని ప్రయత్నాలతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసి అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక ఆటగాడు “ఉసేన్ బోల్ట్”.

- Advertisement -

అతని ఆట అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది. ఆయన ఆడే ప్రతి ఆట గెలుపే కానీ ఓటమి ఉండదని అభిమానుల ఆత్మవిశ్వాసం. వరుస విజయాలతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఏకైక ఆటగాడు ఉసేన్ బోల్ట్. ఒక గొప్ప క్రీడాకారుడి విజయాలను అభిమానులు సంబరాలు చేసుకోవడం సహజమే, కానీ అతని తొలి ఓటమిని కూడా సంబరాలు జరుపుకోవడం గొప్ప విషయం. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించి, ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. 2008, 2012, 2016 ఒలింపిక్స్‌ పరుగుల పోటీల్లో ఎనిమిది బంగారు పతకాలు సాధించాడు.

బోల్ట్ 21 ఆగస్టు 1986న జమైకాలోని షేర్‌వుడ్ కంటెంట్‌లో వెల్లెస్లీ బోల్ట్ మరియు జెన్నిఫర్ బోల్ట్‌లకు జన్మించాడు. 12 సంవత్సరాల వయస్సులో, ప్రాథమిక పాఠశాలలో, అతను పాఠశాల క్రీడల లో పాల్గొనడం ప్రారంభించాడు. అతని ప్రతిభను గమనించిన అతని తల్లిదండ్రులు తను ఆల్ టైమ్ గొప్ప క్రీడాకారుడు అవుతాడని అంచనా వేశారు. అతని చిన్నతనం నుండి, బోల్ట్ చదువు కంటే క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి నుంచి క్రీడల్లో రాణించాడు.బోల్ట్‌కు క్రికెట్ అంటే ఇష్టం.13 ఏళ్ల వయసులో ఒకసారి బోల్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు అతని క్రికెట్ కోచ్ అతని పరుగును గమనించి అథ్లెటిక్స్‌లో గట్టిగా ప్రయత్నించమని ప్రోత్సహించాడు. అతని ప్రోత్సాహం మేరకు అతను ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. అలా ప్రతిరోజు పట్టుదలతో ప్రయత్నిస్తూ 16 సంవత్సరాల వయస్సులో, 2002లో, అతను ప్రపంచ జూనియర్ ఛాంపియన్ స్థాయికి ఎదిగారు. 2007 నాటికి, అతను చరిత్రలో అత్యంత వేగవంతమైన వ్యక్తి గా, అతని మొదటి 100m ప్రపంచ రికార్డు నెలకొల్పాడు మరియు ఒక సంవత్సరం తరువాత, బీజింగ్ 2008 ఒలింపిక్ క్రీడలలో, అతను అంతర్జాతీయ సూపర్ స్టార్‌డమ్‌కి ఎదిగాడు. చైనాలో, బోల్ట్ పురుషుల 100మీ స్ప్రింట్‌లో విజయం సాధించాడు, ఆపై 200మీ మరియు 4×100మీ టైటిల్‌ను జోడించి లెజెండరీ ట్రిపుల్‌ను సాధించాడు. మూడు ఈవెంట్లలో అతను ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న బోల్ట్ అభిమానుల కోరిక మేరకు ఆఖరిసారి ఆటలో పాల్గొన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోయిన బోల్ట్ ఆట కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆయన కాలు లిప్తకాలం జంకింది.

వరుస విజయాలతో అభిమానులను ఉర్రూతలూగించిన ఉసేన్ బోల్ట్ ఒకే ఒక్క సందర్భంలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పదవి ఎక్కిన ప్రతి వారికి పదవి దిగే రోజు వస్తుంది అన్నట్టుగా వరుసగా విజయాలందుకున్న వీరుడికి ఓటమి తప్పలేదు. 8 ఒలంపిక్ పథకాలు, 11 ప్రపంచ ఛాంపియన్ పథకాలు, 3 డైమండ్ లీగ్ ఫైనల్ విజేత, 2 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలుచుకుని తనని తానే జయించుకుంటూ ఎన్నో రికార్డులు సృష్టించిన ఉసేన్ బోల్ట్ తన చివరి ఆటలో ఒక మూడు సెకన్లు ఆలస్యమయ్యాడు. అది కూడా అనారోగ్య కారణాల వల్లే తప్ప వారి సామర్ధ్యాలను అందుకోలేక కాదు. ఏనాడూ తనకంటే ముందు పరుగెత్తని వారు ఆ రోజు ఇద్దరు యువకులు అతనికంటే ముందుకు పరుగెత్తారు. బోల్ట్ తిరోగమనం చూసి అభిమానులే కాదు కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారు. ఏంటి ఏనాడూ వెనకపడని బోల్ట్ ఈరోజు వెనకబడటం ఏంటి? ఇది కలా నిజమా అనుకున్నాడు గెలిచిన వ్యక్తి. ఆఖరిసారిగా పోటీలో పాల్గొంటున్న మహావీరుడికి గెలిచిన వీరుడు అక్కడికక్కడే మోకాళ్ళ మీద నిలిచి మోకరిల్లాడు. ఆ దృశ్యాన్ని చూసిన బోల్ట్ అభిమానులు అతని ఓటమిని కూడా పండగలా జరుపుకున్నారు.

ఈ జమైకన్ వీరుడు ఒక దశాబ్దం పాటు ప్రపంచాన్ని శాసించాడు. 30 సార్లు అతను ప్రపంచంలోని చాలా మంది రన్నింగ్ క్రీడాకారులతో పోటీ పడ్డాడు. అందులో 9 సందర్భాల్లో మాత్రమే కొంతమంది మారక ద్రవ్యాలు పుచ్చుకొని పరుగులు తీశారు. ఆ 9 సందర్భాలలో కూడా బోల్ట్ విజయాలే. బోల్ట్ వేగంలో గాలికి పాఠం నేర్పిన గురువు.

ప్రపంచంలోని క్రీడాకారుల్లో మకుటం లేని మహారాజుగా నిలిచిన ఉసేన్ బోల్ట్ ఓటమి అనంతరం అభిమానులతో ఇలా అన్నారు “గెలిచిన ప్రతివాడికి ఏదో ఒకరోజు ఓటమి తప్పదు, ఓడిన ప్రతివాడికి ఏదో ఒకరోజు గెలుపు తప్పదు, నేను మీలా మామూలు మనిషిని నాకు కూడా ఓటమి తప్పలేదు అని అభిమానులకు ఒక గొప్ప సందేశం అందించారు.

సాధించిన రికార్డులు:

ఎనిమిది సార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత, బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్‌లో (2008, 2012 మరియు 2016) ఒలింపిక్ 100 మీ మరియు 200 మీటర్ల టైటిళ్లను గెలుచుకున్న ఏకైక స్ప్రింటర్. అతను రెండు 4 × 100 రిలే బంగారు పతకాలను కూడా గెలుచుకున్నాడు. అతను 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సమయాల్లో డబుల్ స్ప్రింట్ విజయంతో ప్రపంచవ్యాప్త ఖ్యాతి పొందారు, ఇది పూర్తిగా ఆటోమేటిక్ టైమింగ్ తప్పనిసరి అయిన తర్వాత రెండు రికార్డులు కలిగి ఉన్న మొదటి వ్యక్తి గా ఉసేన్ బోల్ట్ పేరు నిలిచింది.

పదకొండు సార్లు ప్రపంచ ఛాంపియన్, అతను 2009 నుండి 2015 వరకు వరుసగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ 100 m, 200 m మరియు 4 × 100 m రిలే బంగారు పతకాలను గెలుచుకున్నాడు, 2011లో 100 m ఫాల్స్ స్టార్ట్ మినహా. అతను అత్యంత విజయవంతమైన పురుష అథ్లెట్. బోల్ట్ 200 మీటర్లలో నాలుగు ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి అథ్లెట్ మరియు 100 మీటర్లలో మూడు టైటిల్‌లతో అత్యంత విజయవంతమైన వారిలో ఒకరు, సబ్-9.7 మరియు సబ్-9.6 పరుగులు సాధించిన మొదటి వ్యక్తి.

ఓటమి నేర్పిన పాఠం:

9 ఏళ్ల పాటు ప్రపంచానికి మకుటం లేని రారాజుగా నిలిచిన బోల్ట్ ఎట్టకేలకు తాను మామూలు మనిషినేనని చెప్పారు. ప్రపంచాన్ని ఏలిన ఈ జమైకా వీరుడు ఎన్నో గొప్ప విజయాలు సాధించినా నేనూ మీలాంటి సామాన్యుడిని అని గర్వం లేకుండా ప్రకటించుకోవడం బోల్ట్ మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. బోల్ట్ లాంటి మామూలు మనుషులు ప్రపంచంలో కొందరు ఉంటారు. పదవిలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఓటమి తప్పదని గుర్తిస్తే అందరూ సామాన్యులే. గెలుపు ఓటములు మనిషికి కొన్ని పాఠాలు నేర్పుతాయి.

యువతకు సందేశం:

సాధన చేస్తే ఈ ప్రపంచంలో మనిషి సాదించనిది ఏదీ లేదనడానికి ఉసేన్ బోల్ట్ ఒక ఉదాహరణ. ఉసేన్ బోల్ట్ కు చిన్నప్పటి నుంచి చదువు పై కాకుండా క్రీడలపై ఎక్కువ ఆసక్తి ఉండేది. బోల్ట్ కి ఎక్కువ నచ్చిన ఆట క్రికెట్. కానీ బోల్ట్ ఒక సందర్భంలో క్రికెట్ ఆడుతుండగా అతని రన్నింగ్ గమనించిన కోచ్ బోల్ట్ కి ఒక మంచి సలహా ఇచ్చారు “నీకు క్రికెట్ కంటే రన్నింగ్ క్రీడలోనే భవిష్యత్తు ఉంటుంది దాన్ని సరైన మార్గంలో ప్రయత్నిస్తే నువ్వు గొప్ప క్రీడాకారుడివి అవుతావు అని కోచ్ సలహా ఇచ్చాడు. ఆయన సలహా తూచా తప్పకుండా మరుసటి రోజునుండి ప్రయత్నించి ఎన్నో అవమానాలు, అవరోధాలను ఎదుర్కొంటు ప్రపంచ విజేతగా నిలిచాడు. ఏ పనైనా కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే ప్రతి ఒక్కరు విజేతే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News