నేటి యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని, యూత్ ఐకాన్ లుగా తయారవ్వాలని, స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవంను పురష్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. యువజన వేడుకలకు ముఖ్య అతిధిగా హజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని నేటి యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని యువత ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కడివెడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు అని అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు యువత శక్తిపై అపార నమ్మకాన్ని ఉంచి వారి అభ్యున్నతి కోసం మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి ఆర్.కె. రోజా తెలిపారు.
స్వామి వివేకానంద యువతకు మార్గనిర్ధేశం చేశారని, ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు, స్ఫూర్తికి అనుగుణంగా యువత నడిస్తే వారికి తిరుగుండదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పేర్కొన్నారు. హిందూ యోగిగా స్వామి వివేకానంద మన దేశ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని విదేశాల్లో చాటి చెప్పిన తొలి వ్యక్తి అని కొనియాడారు. స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లు నేడు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాయని వివరించారు. అందుకనే 120 సంవత్సరాల తరువాత కూడా స్వామి వివేకానంద గొప్పతనాన్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నామన్నారు. స్వామి వివేకానంద మన దేశంలో జన్మించటం మనం చేసుకున్న అదృష్టమని మంత్రి ఆర్. కె. రోజా పేర్కొన్నారు. నేటి యువత మందలో ఒకరిగా కాదు వందలో ఒకరిగా నిలవటానికి వారి వారి రంగాల్లో విశేష కృషి చేయాలని కోరారు. స్వామి వివేకానంద సముద్ర కెరటం నాకు ఆదర్శమన్నారని, అంటే ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కాని ప్రయత్నం చేయటంలోనే ఓడిపోకూడదని, యువత తమ జీవితంలో ఒక గోల్ నిర్ణయించుకుని నిరంతరం శ్రమిస్తే విజయం తథ్యమని మంత్రి ఆర్. కె. రోజా అన్నారు.
స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకుని ప్రతి ఏడాది యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ ఏడాది థీమ్ యూత్ ఫర్ డిజిటల్ ఇండియా గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిదన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవ పోటీల్లో ప్రధమంగా నిలిచిన విజేలందరినీ, ఈ ఏడాది నాసిక్ లో నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనటానికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని నాసిక్ లో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల్లో ప్రతిభ చూపి మన రాష్ట్రానికి మరిన్నీ బహుమతులు తీసుకురావాలని మంత్రి ఆర్.కె. రోజా కోరారు.
రండి-మెల్కోండి-లక్ష్యాన్ని చేరుకోండి అన్న స్వామి వివేకానంద స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. యువతకు మార్గనిర్ధేశకులు స్వామి వివేకానంద అని అన్నారు. యువత అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వం దేశంలోనే మన ముందు వరుసలో ఉండటం గర్వకారణమని, అందుకు మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కు ధన్యవాదాలు తెలిపారు. ఆడుదాం ఆంధ్రాకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత మానసిక వికాసం, శారీరక ధారుడ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే విష్ణు కోరారు.
యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న స్వామి వివేకానంద జీవితానికి సంబంధించిన నాలుగు చిన్న కథలను విద్యార్థులకు వివరించి అందులోనుంచి సమయస్ఫూర్తి, శారీరక బలం, మానసిక బలం, ధైర్యం ప్రాముఖ్యతను యువతకు వివరించారు. ఈ నాలుగు జీవితంలో భాగం చేసుకోవాలని అప్పుడే యువత తమ లక్ష్యాన్ని మరింత త్వరగా చేరుకుంటారన్నారు. స్వామి వివేకానంద దేశ భవిష్యత్ గురించి కూడా చెప్పారని రాబోయే తరాలు మన సంస్కృతికి, సాంప్రదాయలకు పెద్దపీట వేస్తారని అన్నారని గుర్తుచేశారు.
రామకృష్ణ మిషన్ స్వామిజీ తాతా మహారాజ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, ఆయన రచనలు యువతకు ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద యువతకు దిక్సూచి అని కొనియాడారు. భారతదేశం గొప్పతనాన్ని తెలుచుకోవాలంటే వివేకానందుడి జీవితాన్ని చదివితే తెలుస్తుందన్నారు. సనాతన ధర్మం గొప్ప తనాన్ని నేటి యువత గుర్తించాలన్నారు.
ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అతిధులు ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన యువజనోత్సవాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందచేశారు. అలాగే యువజన శాఖ ఆధ్వర్యంలో అధికారులు మంత్రి రోజాను ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది మన రాష్ట్రం సాధించిన లార్జెస్ట్ యూత్ ఐకాన్ ఫెస్టివల్ అవార్డును మంత్రి రోజా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్నకు అందచేశారు.
కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె. శారదాదేవి, డిప్యూటీ మేయర్ ఎ. శైలజారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్. ఆసీఫ్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పి. మహేష్ తదితరులు పాల్గొన్నారు.