Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Vemulavada: ఆశలన్నీ 'పొన్నం' పైనే

Vemulavada: ఆశలన్నీ ‘పొన్నం’ పైనే

నామినేటెడ్ పోస్టుల కోసం పొన్నం కంట్లో పడే..

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు పూర్తయిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇప్పటికే గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించబడిన అన్ని రకాల కార్పొరేషన్ల చైర్మన్లను, మిగతా నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారందరినీ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్సహం కనిపిస్తోంది. ఇన్ని రోజులు కష్టపడినందుకు తమకు ఫలితం దక్కనుందని, ఈసారి ఎలాగైనా నామినేటెడ్ పోస్టులు సంపాదించి కష్టానికి తగిన ప్రతిఫలం పొందాలని పార్టీలోని కీలక నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గత పదేళ్లుగా అండగా నిలిచి, జెండాలు మోసిన వారికే నామినేటెడ్ పోస్టుల్లో, ఇతర పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో ఆశావాహుల్లో ఉత్సహం రెట్టింపు అయింది. దీంతో సదరు ఆశావహులు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల చుట్టూ తిరుగుతూ, వారిని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.

- Advertisement -

ఆశలన్నీ ‘పొన్నం’ పైనే !

రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న తరుణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు, పార్టీ కొరకు నిరంతరం శ్రమించిన కార్యకర్తలు పదవులు దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా నుండి మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుల చుట్టూ తిరుగుతూ, వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే మాజీ ఎంపీగా, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతగా, గత పదేళ్లుగా ఉమ్మడి జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తిగా గుర్తింపు పొంది, అందరికి సుపరిచితుడైన మంత్రి ‘పొన్నం’పైనే ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పదవుల భర్తీలో స్థానికంగా ఎమ్మెల్యేల ప్రభావం ఉంటున్నప్పటికీ, ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడిగా, అధిష్టానాన్ని ఒప్పించే వ్యక్తిగా గుర్తింపు ఉన్న పొన్నం అయితేనే తమకు న్యాయం చేయగలుగుతాడని, ఆయనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై పూర్తి పట్టుందని, గత పదేళ్లుగా పార్టీ కొరకు ఎవరు కష్టపడ్డారు…? ఎవరికి పదవులు కట్టపెడితే రాబోయే అన్ని రకాల ఎన్నికల్లో ‘హస్తం’ హవా ఇట్లానే కొనసాగుతుంది…? ఎవరికి ప్రాధాన్యతనిస్తే పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత రాకుండా ఉంటుందనే విషయాలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి పొన్నం అని అందుకే ఆశావాహులు ఆయనపై ఆశలను పెంచుకొని, ‘అమాత్యుడి’ చుట్టూ ప్రదక్షిణలు చేసే పనిలో బిజీ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి నుండి మొదలుపెడితే జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనుండటంతో అన్ని పోస్టుల్లోనూ పొన్నం మాటే శిరోధార్యం అయ్యే పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఆయన వైపే పార్టీ శ్రేణులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

రాజన్న సాక్షిగా ఆశావహుల అవస్థలు

ఇక అందరితో పోలిస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆశావాహులు మాత్రం పూర్తిగా ‘పొన్నం’ పైనే ఆధారపడినట్లు తెలుస్తోంది. జిల్లాలోని రెండు నియోజకవర్గాలైన సిరిసిల్లలో బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ ఉండటం, వేములవాడలో సొంత పార్టీకే చెందిన ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా ఉన్నప్పటికీ, మొదటిసారిగా గెలిచిన ఆది శ్రీనివాస్ మాటను అధిష్టానం అంతగా పరిగణనలోకి తీసుకునే పరిస్థితి ఉండకపోవచ్చని, దీంతో సీనియర్ నాయకుడిగా, మంత్రిగా పొన్నం ప్రభాకర్ మాటకే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని, ఆయన సూచించిన వ్యక్తులకే పోస్టుల్లో ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ఆయన చుట్టే జిల్లా నేతలు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి పండగ సందర్భంగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మొదటిసారిగా ఆదివారం వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన పొన్నంను కలిసేందుకు, ఆయన దృష్టిలో పడేందుకు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. శాలువాలతో సన్మానం చేసేందుకు నానా అవస్థలు పడ్డారు. ఒకానొక సమయంలో వందల సంఖ్యలో ఆలయానికి వచ్చిన నాయకులను, కార్యకర్తలను చూసి, దర్శనానికి వచ్చిన భక్తులతో పాటు ఆలయ అధికారులు సైతం ఆశ్చర్యపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వేచి చూడాలి మరి అమాత్యుడి ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో…?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News